గణాంకాల మాయాజాలం
గణాంకాలు సగటు మనిషిని చికాకుపరుస్తాయి. వాటి సారాంశమేమిటో తెలుసు కుని నిట్టూర్చడమో, ఊపిరిపీల్చుకోవడమో తప్ప... లోతుల్లోకి పోయి అర్ధం చేసు కోవడానికి ప్రయత్నించేంత తీరిక, ఓపిక వారికి ఉండవు. వాటి నిజానిజాలను తేల్చుకునే నైపుణ్యమూ ఉండదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ దేన్నయినా తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశ ప్రచారంలో ఆయన అంతకుముందు రోజు కేంద్ర గణాంకాల శాఖ(సీఎస్‌ఓ) ప్రకటించిన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని ప్రస్తావించారు. జీడీపీ 7శాతం ఉన్నదని తేలింది గనుక ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదివిన ‘మహా ఆర్థికవేత్తలు’ ఏమంటారని ఎద్దేవా చేశారు.
హార్వర్డ్ కన్నా ‘హార్డ్‌వర్క్’(కఠోరశ్రమ) మిన్న అని చెప్పారు. ‘పెద్ద నోట్లు రద్దు వల్ల వృద్ధి రేటు 2 శాతం పడిపోతుంది... 4శాతం పడిపోతుంది’అంటూ బెదరగొట్టారని గుర్తుచేశారు. పేర్లు చెప్పకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌లను ఉద్దేశించే ఆయనలా అన్నారని అందరికీ అర్ధమైంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సంగతలా ఉంచి అంతకుముందు నుంచే ఆర్థిక స్థితి బాగు లేదని పెదవి విరిచినవారున్నారు. ఎవరి వరకో ఎందుకు... రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నప్పుడు రఘురాంరాజనే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. నిరాశామయ వర్తమానంలో భారత్ దేదీప్య మానంగా వెలుగుతున్న దేశమని నిరుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అన్నప్పుడు రఘురాం రాజన్ పొంగిపోలేదు. ‘అంధుల దేశానికి ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అంటూ వ్యాఖ్యానించి నిర్వేదంగా మాట్లాడారు.
నిజమే...మొన్న డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెం బర్)లో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు సీఎస్‌ఓ అంచనా వేసింది. అది 6.1–6.8 మధ్య ఉండొచ్చునని అంతక్రితం అనేక ఏజెన్సీలు భావించాయి. పెద్దనోట్ల రద్దు, కొత్త నోట్ల లభ్యత సక్రమంగా లేని కారణంగా చిన్న పరిశ్రమలు మూతబడటం, రోజుకూలీలు సైతం ఉపాధి కోల్పోవడంవంటివి జరిగాయని వార్తలొచ్చిన నేప థ్యంలో సీఎస్‌ఓ గణాంకాలు నిజమేనా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, చివరకు పెద్దనోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా వాటన్నిటినీ తట్టుకునేంత పటిష్టంగా దేశ ఆర్థికవ్యవస్థ ఉంటే అది గర్వించదగిన, సంతోషించదగిన అంశం. అయితే తయారీ, వ్యవసాయ రంగాల ఊతం కార ణంగా అది పెరిగిందని సీఎస్‌ఓ అంటున్నది.
పెద్ద నోట్ల రద్దు సమయంలో హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ ఆర్ధికవేత్తలు మాత్రమే కాదు... ఇతర వర్గాలవారు కూడా ఆ నిర్ణయంలోని లోటుపాట్ల గురించి చర్చించారు. విమర్శించినవారున్నట్టే మెచ్చుకున్న వారూ ఉన్నారు. కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం ఆ నిర్ణయాన్ని దుయ్యబట్టింది. దానివల్ల 20 లక్షలమంది ఉద్యోగావకాశాలు కోల్పోయారని సంస్థ అధ్యక్షుడు బైజ్‌నాథ్ రాయ్ అప్పట్లో అన్నారు. అసంఘటిత రంగంలో పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉన్నదని కూడా చెప్పారు. నోట్ల రద్దు జరిగిన నెల్లాళ్ల తర్వాత అన్న మాటలవి. ఆ నిర్ణయం వెనకున్న ఉద్దేశం మంచిదని మెచ్చుకుంటూనే ఆయన ఈ లెక్కలు చెప్పారని గుర్తుంచుకుంటే సీఎస్‌ఓ తాజా గణాంకాలు ఆశ్చర్యం కలిగిం చడంలో వింతేమీ లేదు.
సీఎస్‌ఓ గడిచిన త్రైమాసికంలో ఆశావహమైన స్థితి ఉన్నదని చెప్పడమే కాదు... మొత్తంగా 2016–17 ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చింది. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత పరోక్ష పన్నుల వసూళ్లు ముమ్మరమయ్యాయని మర్చిపోకూడదు. పాత నోట్లతో పన్నులు కట్టొచ్చునని ప్రభుత్వాలు ప్రకటించేసరికి ఏళ్ల తరబడి మొండి బకాయిలుగా ఉన్నవి కూడా వసూలయ్యాయి. ఎటూ రద్దయిన నోట్లను చేంతాడంత క్యూల్లో గంటలకొద్దీ నిలబడి మార్చుకోవాల్సి ఉంటుంది గనుక దాని బదులు బకాయిలు చెల్లిస్తే సమస్య తీరుతుందని చాలామంది భావించారు. అదే సమయంలో పలు సంస్థలు, కంపెనీలు కూడా ఉత్పాదకతకు సంబంధించిన పన్నులను పాత నోట్లలో ముందే చెల్లించాయి. అలాగే తమ దగ్గరున్న నగదు నిల్వలను విక్రయాలుగా చూపించాయి. ఇవన్నీ జీడీపీ పెరుగుదలపై ప్రభావాన్ని చూపి ఉండొచ్చు.
సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ సుంకం వంటి వసూళ్లు మొన్న జనవరికి రూ. 7.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం అదే కాలంలో వసూలైన పన్ను వసూళ్లతో పోలిస్తే అది 23.9 శాతం అధికం. పైగా నోట్ల రద్దు రాబోతున్నదని తెలియక రెండు పెద్ద పండుగలకు జనం బాగా ఖర్చుపెట్టారు. వీటన్నిటి సంగతలా ఉంచి రెండేళ్లక్రితం ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్థ్ధిక కార్యకలాపాలను కొలిచే విధానాన్ని మార్చినప్పటినుంచి ఆర్థికవ్యవస్థ పెను వేగంతో కదులుతున్నట్టు కనబడటం మొదలుపెట్టిందని, ఇప్పుడు వెలువడిన గణాంకాలు కూడా ఆ వరసలోనివేనని పెదవి విరుస్తున్న వారున్నారు.
ఉత్తరాదిలో తయారీ రంగ పరిశ్రమలు విస్తృతంగా ఉండే లూథియానా, ఆగ్రా, నోయిడా... తమిళనాడులోని తిరుపూర్ వంటిచోట్ల పరిశ్రమలు మూతబడ్డాయని, కార్మికులను రిట్రెంచ్ చేశారని వార్తలొచ్చాయి. నిర్మాణరంగం మందగించిందని, వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయని కథనాలు వెలువడ్డాయి. తమ ఆదాయం, ఉపాధిపై గృహస్తుల్లో ఉన్న అనిశ్చితివల్ల వినియోగదారుల విశ్వాసం గణనీయంగా పడిపోయిందని రిజర్వ్‌బ్యాంక్ తాజా సర్వే కూడా చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్‌ఓ అందుకు భిన్నమైన స్థితిని ఆవిష్కరించడం ఒక వైచిత్రి. అయితే ఇది కేవలం ఈ త్రైమాసికానికి సంబంధించిందే. దీన్నిబట్టి అంతా బాగున్నదని మెచ్చుకోవడమో, వాస్తవాలను ప్రతిబింబించడంలేదని విమర్శిం చడమో చేయడం సరికాదు. మొత్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరం వాస్తవ స్థితి 2018 జనవరిలో వెలువడే సవరించిన గణాంకాలు చెబుతాయి. అంతవరకూ ఓపిక పట్టక తప్పదు.