వృద్ధిపై ప్రభుత్వానిది ‘డబ్బా’!
► పదేళ్లపాటు 8–10 శాతం వృద్ధి సాధించాలి...
► వృద్ధి జోరులో మనమే టాప్ అని
►అప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది...
► జీడీపీపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి రేటుపై మోదీ సర్కారువన్నీ డబ్బా కబుర్లేనంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా చురకలంటించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమంటూ బాకా కొట్టుకోవడానికి ముందు వరుసగా పదేళ్లపాటు అత్యంత పటిష్టమైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిని సాధించి చూపాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆర్‌బీఐ గవర్నర్‌గా తన అనుభవాలపై ‘ఐ డూ వాట్ ఐ డూ’అనే పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా రాజన్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఏకంగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం) పడిపోయింది. అంతక్రితం త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదైంది. అయితే, ఇదే తరుణంలో చైనా మాత్రం 6.5 శాతం చొప్పున వృద్ధి సాధించి భారత్‌ను వెనక్కినెట్టింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘భారత్ తన సంస్కృతి, చరిత్ర గురించి ప్రపంచానికి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. అయితే, ఆర్థిక వృద్ధి విషయంలో మాత్రం ఈ బాకా కుదరదు. ముందుగా పదేళ్లపాటు 8–10% మేర నిలకడైన వృద్ధి రేటును సాధించి చూపాలి. ఆ తర్వాత గొప్పలు చెబితే బాగుంటుంది’ అని రాజన్ సూచించారు.
నా వ్యాఖ్యల తర్వాత వృద్ధి పడుతూనే ఉంది: ఇప్పటివరకూ ఆర్‌బీఐ గవర్నర్లుగా పనిచేసిన వారందరికీ రెండోవిడత అవకాశం లభించింది. అయితే, రాజన్‌ను మాత్రం మరోవిడత కొనసాగించేందుకు మోదీ ప్రభుత్వం ఇష్టపడకపోవడంతో పదవిలో ఉండగానే తాను మరోసారి గవర్నర్‌గా చేయబోనని.. తన అధ్యాపక వృత్తికి తిరిగివెళ్లిపోనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్‌బీఐ అధిపతిగా ఉన్నప్పుడు కూడా రాజన్ మన ఆర్థిక వ్యవస్థపై నిక్కచ్చిగా కుండబద్దలుకొట్టినట్లు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ప్రధా నంగా ‘గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను ఉన్నోడే రాజు’ అంటూ భారత్ వృద్ధి రేటును ఆభివర్ణించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ.. తక్షణం రాజన్‌ను ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖకూడా రాశారు. అసలు రాజన్ మానసికంగా భారతీయుడు కాదని కూడా స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, దీన్ని తాను పెద్దగా పట్టించుకోలేదంటూ రాజన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘నేను దేన్నయినా ముందుగానే ఊహించి చెప్పగలనని అనుకోవడం లేదు. అయితే, మనగురించి మనం మరీ అతిగా చెప్పుకునే విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నదే నా ఉద్దేశం. నేను వృద్ధి విషయంలో ఆ వ్యాఖ్యలు 2016 ఏప్రిల్‌లో చేశాను. అప్పటి నుంచీ ప్రతి త్రైమాసికంలోనూ వృద్ధి రేటు దిగజారుతూనే వస్తోంది’ అని రాజన్ వివరించారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి చెప్పిన ప్రపంచ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఒకరు కావడం గమనార్హం.
మనది ఇంకా చిన్న ఆర్థిక వ్యవస్థే...
చైనా ఆర్థిక వ్యవస్థతో మనకు ఎన్నటికీ పోలికే ఉండదని రాజన్ చెప్పారు. ‘ప్రస్తుతం 2.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదికింద లెక్క. అయినప్పటికీ చాలా పెద్దదేశంగా భావిస్తాం. మనతో పోలిస్తే చైనా ఎకానమీ ఐదు రెట్లు పెద్దది. ఒకవేళ చైనా స్థాయికి భారత్ చేరుకోవాలంటే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించాలి. భారత్ వచ్చే పదేళ్లపాటు భారీస్థాయి వృద్ధి రేటుతో దూసుకుపోవాలి’ అని పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ వృద్ధి మళ్లీ 8–9 శాతానికి పుంజుకోవాలంటే మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులకు పునరుత్తేజం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ‘1990 దశకం నుంచి భారత్ 6–7–8 శాతం మేర వృద్ధి రేటు స్థాయికి నెమ్మదిగా చేరింది. అయితే, మధ్యతరగతి ప్రజలకు సైతం ఆర్థిక ప్రగతి ఫలాలు అందాలంటే 8–10 శాతం వృద్ధి కనీసం పదేళ్లపాటు స్థిరంగా కొనసాగాల్సి ఉంటుంది. అప్పుడే భారీస్థాయి ఆర్థిక వ్యవస్థగా అవతరించగలుగుతాం’ అని రాజన్ స్పష్టం చేశారు.