బ్యాంకుల విలీనాలతో ఒరిగేదేంటి..?
♦ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి...
♦ బలహీన బ్యాంకులతో విలీనాలు మరింత జఠిలం
♦ కన్సాలిడేషన్ సులువైన ప్రక్రియేమీ కాదు
♦ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ తీరును రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. కన్సాలిడేషన్ సహేతుకమైనదే అయినప్పటికీ.. దీనివల్ల కలిగే లాభాలేంటో ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. ఒక ఫైనాన్షియల్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... బ్యాంకుల విలీనాన్ని చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా రాజన్ వర్ణించారు. ‘కన్సాలిడేషన్‌కి బ్యాంకుల సీఈవోలు, మేనేజర్లు మొదలైన వారంతా బోలెడంత శ్రమ, సమయం వెచ్చించాల్సి వస్తుంది.
ఐటీ సిస్టమ్స్ అనుసంధానం చేయాలి.. రెండు విభిన్న పని సంస్కృతులు, హెచ్‌ఆర్ వ్యవస్థలు మొదలైన వాటన్నింటి విలీనం చేయాలి. ఇదంతా అత్యంత శ్రమతో కూడుకున్నదే‘ అని ఆయన చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే బలహీనంగా ఉన్న నేపథ్యంలో విలీనాలు మరింత సమస్యాత్మకంగా మారతాయని రాజన్ పేర్కొన్నారు. ‘ఈ ప్రక్రియంతా చాలా సులువుగా ఎలా పూర్తయిపోతుందనేది ప్రభుత్వం చెప్పాలి. ఇది సమస్య నుంచి దృష్టి మరల్చి.. సంస్థను మరింతగా కుంగదీయకుండా, ఏ విధంగా ఊతమివ్వగలదో చెప్పాలి‘ అని వ్యాఖ్యానించారు.
నార్త్ బ్లాక్ ఆధిపత్యమేంటి?
విలీన ప్రణాళికల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుండటాన్ని రాజన్ ప్రశ్నించారు. ‘ఈ ప్రణాళికలన్నింటినీ నార్త్ బ్లాకే (ఆర్థిక తదితర కీలక శాఖల కార్యాలయాలున్న భవంతి) నిర్ణయిస్తుందా? ఒకవేళ అదే జరిగితే.. ఇక కొత్తేం ఉంది? ఎంతో కొంత వైవిధ్యం ఉండాలన్న జ్ఞాన సంఘం నిబంధనలను చేరుకోనట్లేగా? ఒకవేళ అంతా నార్త్ బ్లాకే నిర్ణయిస్తే.. తేడా ఏముంటుంది?‘ అని ఆయన పేర్కొన్నారు. విలీనాలనేవి బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే చేయాలి తప్ప బలహీనంగా ఉన్నప్పుడు కాదని రాజన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ నేపథ్యం..
ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను విలీనాల ద్వారా 21 నుంచి 15కి తగ్గించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టమైన పెద్ద బ్యాంకులను ఆవిష్కరించడమే దీని వెనుక ప్రధానోద్దేశమని కేంద్రం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది బ్యాంకులు కలిసి సుమారు రూ. 18,066 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. ఇక ఆరు బ్యాంకులు కార్యకలాపాల విస్తరణపై ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇక విలీనాల విషయానికొస్తే.. ఏ రెండు బ్యాంకులు కలపాలని చూసినా.. చాలా మటుకు సందర్భాల్లో వాటిలో పేరుకుపోయిన మొండిబాకీల పరిమాణం నిర్దిష్ట స్థాయికి మించిపోవడం ద్వారా ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా కేటాయింపులు పోగా.. మార్చి ఆఖరు నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండి బాకీలు మొత్తం రుణాల్లో 7.8 శాతంగా ఉండగా.. కెనరా బ్యాంక్ మొండి బాకీలు 6.3 శాతంగా నమోదయ్యాయి.
విలీనాలకు అనువైనవిగా భావిస్తున్న బలహీన బ్యాంకుల గురించి పెద్ద బ్యాంకులు ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశాయి. టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులుగా పరిగణిస్తున్న కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైనవి.. చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవడానికి ముందస్తుగా కొన్ని షరతులు విధిస్తున్నాయి. టార్గెట్ బ్యాంకు కచ్చితంగా లాభాలార్జిస్తున్నదై ఉండాలన్నది ఇందులో ప్రధానమైనది. అలాగే, టార్గెట్ బ్యాంకుకు తగినంత మూలధనం ఉన్నప్పటికీ ప్రభుత్వం మరింత పెట్టుబడి సమకూర్చాలని కూడా టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులు కోరుతున్నాయి. విలీనాలనేవి బోర్డుల నిర్ణయాల ఆధారంగానే ఉండాలి తప్ప.. ప్రభుత్వం నిర్ణయాల మేరకు ఉండకూడదని బ్యాంకులు ఆశిస్తున్నాయి. బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలు ముందుకు తెస్తే.. వాటిని మంత్రుల కమిటీ పరిశీలించి, కన్సాలిడేషన్ ప్లాన్‌కి సూత్రప్రాయ అనుమతులు ఇస్తాయంటూ కేంద్రం ఆగస్టు నెలాఖర్లో పేర్కొంది.