తెలంగాణ, కోల్ గేట్ అంశాలపై రగడ, లోకసభ వాయిదా!
తెలంగాణ, ఉల్లి ధర పెరుగుదల, కోల్ గేట్ అంశాలు లోకసభలో గందరగోళం సృష్టించాయి. సభ ఆరంభం కాగానే తెలంగాణ, ధరల పెరుగుదల, కోల్ గేట్ అంశాలు కార్యక్రమాలకు అడ్డు పడటంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. ఐనా సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య మంగళవారం ఉదయం ప్రభుత్వం మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆహార భద్రత బిల్లుకు సంబంధించిన ముఖ్య పత్రాలను సమర్పించిన తర్వాత, బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆహార బిల్లుపై చర్చించేందుకు ప్రశ్నోత్తర సమయాన్ని కూడా రద్దు చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ న్యాయం చేయాలంటూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో గందరగోళం సృష్టించారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు, ఉల్లి ధర ఆకాశనంటిన నేపథ్యంలో వామ పక్ష పార్టీల సభ్యులు పోడియంలోకి దూసుకుపోయి నినాదాలతో హోరెత్తించారు. తమిళనాడుకు చెందిన సీపీఐ సభ్యుడు శ్రీలంకలో జరుగుతున్న కామన్ వెల్త్ సమావేశాల్లో భారత్ పాల్గొనకూడదని ప్లకార్డుతో నిరసన తెలిపారు.
సభలో నినాదాలు, నిరసనల మధ్య ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటి ఫర్ ఉమెన్ బిల్లును మానవ వనరుల శాఖ మంత్రి పల్లం రాజు, పౌర విమానశాఖ సహాయ మంత్రి కేసీ వేణుగో్పాల్ రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ బిల్లు 2013, సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (2013) బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే సివిల్ ఏవియేషన్ అథారిటి ఆఫ్ ఇండియా బిల్లును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగథ రాయ్ వ్యతిరేకించారు.
బిల్లులపై చర్చ చేపట్టాలని చేసిన ప్రయత్నాలకు సభ్యులు అడ్డుతగలడంతో స్పీకర్ మీరా కుమార్ సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. ఆతర్వాత సభ ఆరంభమైన తర్వాత కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక ఫైల్లు మాయం కావడంపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో సభ సరిగా జరగడానికి అనువుగా లేకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.