జై తెలంగాణతోపాటు వివిధ దేవతల పేరుతోప్రమాణం చేసిన ఎంపీలు
తెలుగులో ప్రమాణం చేసిన తమిళ ఎంపీ గోపీనాథ్
హాజరైన సీఎం రేవంత్, మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎంపీలు తమదైన శైలిలో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు 15 మంది తెలంగాణ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు హిందీ, ఇంగ్లిష్ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రమాణం చేశారు. పలువురు ఎంపీలు జై తెలంగాణతోపాటు జై సమ్మక్క, జై లక్ష్మీనరసింహ, జై భద్రకాళి, జై తుల్జాభవాని, జైభీం.. జై రాజ్యాంగం అంటూ ప్రమాణం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క లు లోక్‌సభకు హాజరై రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తమిళనాడులోని కృష్ణగిరి ఎంపీ కె.గోపీనాథ్ తెలుగులోనే ప్రమాణం చేశారు.
నగేష్‌తో మొదలు...
ముందుగా ఆదిలాబాద్ ఎంపీ జి,నగేష్ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అర్వింద్, మాధవనేని రఘునందన్‌రావు, ఆర్.రఘురాంరెడ్డిలు ఇంగ్లి‹Ùలో ప్రమాణం చేయ గా, మిగతా ఎంపీలు సురేశ్ షెట్కార్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, డా.మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, డా.కడియం కావ్య, పోరిక బలరాంనాయక్‌లు తెలుగులో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
కాగా ప్రమాణ సమయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై సమ్మక్క– సారలమ్మ అని, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య జై భద్రకాళి అని, నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి జైభీం అని, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ జై తుల్జాభవాని అంటూ ప్రమాణం ముగించారు.
ఒవైసీ వ్యాఖ్యపై సభలో గందరగోళం
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలో జై పాలస్తీనా అని అనడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మల్లు రవి ప్రమాణం చేసేందుకు సిద్ధమైన వెంటనే అసదుద్దీన్ ఒవైసీ జై పాలస్తీనా అనడాన్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది.
గందరగోళ పరిస్థితుల మధ్యే మల్లు రవి ప్రమాణాన్ని కొనసాగించారు. అయితే బీజేపీ సభ్యులు గట్టిగా కేకలు వేస్తుండడంతో మల్లు రవి కాస్త అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రమాణ పత్రంలో ఉన్నది మాత్రమే రికార్డుల్లోకి వెళుతుందని ప్యానెల్ స్పీకర్ రాధామోహన్‌సింగ్ చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. ఆ తర్వాత మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
సోనియాగాం«దీని కలిసిన రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపీలుగా ప్రమాణం చేసిన వారిని రేవంత్ సోనియాగాంధీకి పరిచయం చేశారు. సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఏపీ.జితేందర్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment