బీఆర్‌ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్
ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు
రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
ఆ దిశగానే పార్టీ కార్యక్రమాలు పలువురు నేతలతో పాటు లోక్‌సభ అభ్యర్థులతో సమావేశం...పార్లమెంటు ఎన్నికల పోలింగ్, ఇతర అంశాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడకుండా ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమా లు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థులు, కొందరు నేతలు గురువారం ఎర్రవల్లి నివా సంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తీరుతెన్నులతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది.
వరికి రూ.500 బోనస్, ధాన్యం కొనుగోలు అంశాలపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ చేపట్టిన నిర సన కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, కిందిస్థాయి వరకు సోషల్ మీడియా విభాగం బలోపేతం తదితరాలకు సంబంధించిన కార్యాచరణపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు.
‘స్థానిక’సన్నద్ధత ప్రారంభించాలి
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు.
పార్టీ కార్యవర్గాల ఏర్పాటులోనూ ఇలాంటి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించేందుకు 113 బీసీ ఉప కులాల గణన చేపట్టాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
అన్ని ఎన్నికల ఫలితాలు అనుకూలమే
రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలూ పార్టీకి అనుకూలంగా వెలువడే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి 28న జరిగిన శాసనమండలి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుస్తారని పార్టీ నేతలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,439 మంది ఓటర్లకు గాను 800 మందికి పైగా పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయడంతో సానుకూల ఫలితం వస్తున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నివేదిత మంచి మెజారిటీ సాధిస్తారని కేసీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 27న జరిగే ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించకుండా పార్టీ నేతలు, అభ్యర్థులు పార్టీ ఇచ్చే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment