సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల దిశగా సన్నద్ధ తను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం నందినగర్‌లోని నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్, బీజేపీల సన్నద్ధత, ఎత్తుగడలు, వాటిపై పైచేయి సాధించడం, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆయా అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, అంగబలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రెండు పార్టీలు బరిలోకి దించుతాయని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఇస్తే ఎంత మేరకు పోటీ ఇవ్వగలరనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే లాభ, నష్టాలపైనా మదింపు జరుగుతోంది.
టికెట్‌పై కొందరికి సంకేతాలు
చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో గతంలో పోటీ చేసిన ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, గెడాం నగేశ్‌కు కూడా టికెట్ దాదాపు ఖాయం కావడంతో వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇలా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని భావించిన నేతలకు మాత్రమే సంకేతాలు ఇచ్చి పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు.
మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ స్థితిగతులపై సర్వే సంస్థల నివేదికలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారా లేక గతంలో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి టికెట్ ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచిన మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని కేటీఆర్, హరీశ్‌తో జరిగిన భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది.
జనవరి 3 నుంచి జనంలోకి
పార్టీ కేడర్‌తో అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. సుమారు నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ముమ్మరంగా జరిగేలా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment