
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాకు ఊరట లభించింది. ఆస్ధానాపై అవినీతి ఆరోపణల కేసులో నవంబర్ 1 వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని, అప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం దర్యాప్తు ఏజెన్సీని ఆదేశించింది. మరోవైపు కేసుకు సంబంధించి సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని సీబీఐ చేసిన వినతిని కోర్టు అంగీకరించింది.
కేసును పర్యవేక్షిస్తున్న బృందంమారిపోయిందని, ఆరోపణలపై దృష్టిసారించిన విజిలెన్స్ కమిషన్ వద్ద ఫైళ్లు ఉన్నాయని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. కాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా విచారణ ముగించాలని గత వారం సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుగుణంగా అలోక్ వర్మపై దర్యాప్తుకు సంబంధించి అవసరమైన పత్రాలు, ఫైళ్లను సీవీఈసీకి దర్యాప్తు ఏజెన్సీ అందిస్తోంది. తనపై ముడుపుల కేసులో తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ రాకేష్ ఆస్ధానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆస్ధానా హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment