రాకేశ్ ఆస్థానా
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ఓ అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సానా ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆస్థానా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆస్థానాపై క్రిమినల్ విచారణ జరపకుండా, అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వజీరీ మాట్లాడుతూ.. ఆస్థానా, కుమార్‌లను విచారించేందుకు, అరెస్ట్ చేసేందుకు ఇకపై కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ కేసు విచారణను 10 వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ ఆలోక్ వర్మపై చేసిన అభియోగాలకు తగిన ఆధారాల్లే్లవని అభిప్రాయపడ్డారు. ఓ కేసులో తనకు ఊరట కల్పించేందుకు ఆస్థానా లంచం తీసుకున్నారని సతీశ్ సానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ తనను వేధించారని, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. దీంతో ఆస్థానాపై అవినీతి నిరోధక చట్టంలోని నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ తీర్పును ఆస్థానా సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment