న్యూఢిల్లీ: సొంత డీఎస్పీని అరెస్ట్ చేసి, కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయడంపై సీబీఐకి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అవినీతికి సంబంధించిన ఒక కేసును సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా అనేక ఆధారాలు కన్పిస్తున్న సోమేశ్వర్ శ్రీవాస్తవను అరెస్ట్ చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ వ్యాపారి, ప్రధాన నిందితుడు అయిన మనోజ్ ప్రసాద్‌కు శ్రీవాస్తవ్ సోదరుడవుతాడు. ‘శ్రీవాస్తవ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనోజ్ ప్రసాద్ కన్నా ఈయనే కీలకంగా కనిపిస్తున్నాడు. ఆయనను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? మీరు మీ సొంత డీఎస్పీనే అరెస్ట్ చేశారు.
కేసులో పెద్ద పాత్ర పోషించినవారిని వదిలేశారు’ అని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీబీఐ.. శ్రీవాస్తవ్ పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై ఎల్‌ఓసీ(లుక్ ఔట్ సర్క్యులర్) జారీ చేశామంది. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఎల్‌ఓసీ ఎందుకు? దాంతో ఏం లాభం. భారతదేశం చాలా పెద్దది. ఇక్కడే హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్ కన్నా శ్రీవాస్తవ్‌కు వ్యతిరేకంగా ఎక్కువ సాక్ష్యాలున్నాయని, కీలక నిందితుడైన ఆయనను అలా వదిలేశారని వ్యాఖ్యానించారు. అనంతరం.. అవసరమైతే గతంలో ఈ కేసును విచారించిన అధికారిని పిలిపిస్తామని చెప్పి.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు.
కేసు వివరాల్లోకి వెళితే..
మాంసం ఎగుమతిదారు అయిన మొయిన్ ఖురేషీకి సంబంధించిన 2017 నాటి కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ బాబు నిందితుడు. ఆ కేసును విచారిస్తున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు తనపై చర్యలేవీ తీసుకోకూడదని కోరుతూ పలు విడతలుగా రూ. 2 కోట్లు మనోజ్ ప్రసాద్, శ్రీవాస్తవ్‌ల ద్వారా ఇచ్చానని సతీశ్ బాబు ఫిర్యాదు చేశారు. దాంతో ఆస్థానాపై కేసు నమోదు చేశారు. సహ నిందితుడిగా సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌ను, మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment