సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు | 2 per cent hike in budgetary allocation for Social Justice | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు

Published Sat, Feb 2 2019 5:06 AM | Last Updated on Sat, Feb 2 2019 5:06 AM

2 per cent hike in budgetary allocation for Social Justice - Sakshi

న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్‌ క్యాస్ట్‌కు సంబంధించి 2018–19 బడ్జెట్‌ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది.

మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్‌ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్‌లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్‌షిప్‌ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు.

డీవోపీటీకి 241 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్‌లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌టీమ్‌), ముస్సోరీలో లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్‌ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ), పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్స్‌ (క్యాట్‌)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్‌లో ప్రకటించారు.

పర్యావరణానికి రూ.3,111 కోట్లు
న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్‌’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్‌ టైగర్‌ కాన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్‌టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్‌టీసీఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ నిశాంత్‌ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు.

అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ గ్రీన్‌ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు.

లోక్‌పాల్‌కు, సీవీసీకి అంతంతే
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్‌ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్‌పాల్‌కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్‌లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు.  

సీబీఐకి రూ.777 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్‌లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్‌లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్‌లాండ్‌ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు, నకిలీ ఎన్‌కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, జతిన్‌ మెహతా, మెహుల్‌ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్‌ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్‌ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement