dept
-
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. ఒక పక్క కోవిడ్ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట పరిమితులకు లోబడే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పక్క ద్రవ్య లోటును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రం చేసిన అప్పుల కంటే పలు ఇతర రాష్ట్రాలు చేసిన అప్పులే ఎక్కువ అని తేలింది. వాస్తవం ఇలా ఉండగా, ఈ మాత్రం అప్పులు చేయడం కూడా మహా ఘోరం అన్నట్లు ప్రతిపక్షం, ఎల్లో మీడియా ప్రజల్లో విషం నింపుతున్నాయి. ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక కూడా రూ.59,244.99 కోట్ల అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభంతో కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు గణనీయంగా తగ్గిపోగా, మరో పక్క ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్పుల పరిమితి పెంపునకు అనుమతించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక ఏడాది అంటే 2021–22 బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు కూడా అప్పులు చేయలేదు. అందులో కేవలం 68.04 శాతం మేర మాత్రమే అప్పు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక ఏడాది మొత్తం ఆదాయ, వ్యయాలను ఆర్థిక ఏడాది చివరి నెల మార్చిలో సర్దుబాటు చేసి, కాగ్ ఈ నివేదిక రూపొందిస్తుంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్స్ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఏడాది ద్రవ్య లోటు అంటే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం జీఎస్డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా 2021–22 ఆర్థిక ఏడాదిలో దానిని 2.10 శాతానికే పరిమితం చేసిందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసింది. టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం ► టీడీపీ ఐదేళ్ల పాలనలో జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేది. అలాంటి ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం 2021–22లో 2.10 శాతానికి పరిమితం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విచక్షణతో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలకు నిదర్శనం. ► బడ్జెట్ అంచనాల్లో వెల్లడించిన మేరకు అప్పు చేసేందుకు వీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కూడా అప్పు చేయలేదు. అంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారనే టీడీపీ నేతల ఆరోపణలు, ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. ► వివిధ రాష్ట్రాల కాగ్ ప్రాథమిక అకౌంట్స్‌ను పరిశీలిస్తే మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ 2021–22లో అతి తక్కువగా అప్పు చేసినట్లు తేలింది. బడ్జెట్ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62 కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసింది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయలేదు. ► ఈ లెక్కన వాస్తవాలను పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ మీడియా.. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ ఆరా, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడు ► బాబు హయాంలో ఐదేళ్లు అస్తవ్యస్థ ఆర్థిక నిర్వహణ, పాలన కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడయ్యాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.39,000 కోట్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. ► మరో పక్క ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడంతో పాటు విద్యుత్ సంస్థల అప్పులను రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెంచేసింది. ఇదే సమయంలో డిస్కమ్స్ బకాయిలను రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచింది. ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి ► ప్రస్తుత ప్రభుత్వం ఇవన్నీ తీరుస్తూనే మరో పక్క కోవిడ్ కారణంగా 2019–20లో రాష్ట్ర ఆదాయంలో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేసింది. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో అంతకు ముందు రెండేళ్ల కంటే కొంత మేర రాష్ట్ర ఆదాయం మెరుగు పడింది. 2020–21లో బడ్జెట్ అంచనాల రెవెన్యూ రాబడిలో 72.32 శాతమే రాగా, 2021–22లో 84.96% మేర వచ్చిందని కాగ్ పేర్కొంది. ► ఎక్కడా అవినీతి, దుర్వినియోగం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వీలుగా నవరత్నాలకు వినియోగించిందని, కోవిడ్ సంక్షోభంలో రాష్ట్రంలో పేద, సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఆదుకున్నట్లయిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను చేపట్టింది. బాబు హయాంలోనే పరిమితికి మించి అప్పులు ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పరిమితికి మించి జీఎస్డీపీలో 3 శాతానికన్నా ఎక్కువగా అప్పులు చేశారని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేస్తున్నాయి. 2014–15 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.95 శాతం ఉంది. 4 బాబు దిగిపోయే సమయానికి అంటే 2018–19 జీఎస్డీపీలో ద్రవ్యలోటు (అప్పులు) 4.06%కి పెరిగింది. అలాంటిది 2021–22 ఆర్థిక ఏడాదిలో జీఎస్డీపీలో అప్పులను 2.10%కు ఈ ప్రభుత్వం తగ్గించింది. ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ అప్పు తక్కువే ► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్ ప్రాథమిక అకౌంట్స్ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. ► కర్ణాటక రాష్ట్రం 2021–22 ఆర్థిక ఏడాదిలో రూ.59,244.99 కోట్లు అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసింది. ► బడ్జెట్ అంచనాల్లో కేరళ ప్రభుత్వం 81.58% మేర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 82.27% మేర అప్పు చేశాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బయట వివిధ సంస్థల కోసం అప్పులు చేయడం మామూలే. ఆ అప్పులకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థల ద్వారా అప్పులు చేస్తోంది. ► బడ్జెట్ బయట అప్పులు ఎంత చేశారనేది ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ విధాన పత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో దాపరికం ఏమీ లేదు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో సగటు వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం ఉండగా, ఈ మూడేళ్లలో సగటు వార్షిక అప్పు 15.77 శాతమే ఉంది. -
జీతాలకూ కష్టమే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది. సొంతంగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి. రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)విడుదల చేస్తున్న రుణాలను ప్రతినెలా జీతాల కోసం మళ్లిస్తున్నాయి. మిగిలిన మొత్తం కోసం ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. గత రెండు నెలలుగా రుణాల చెల్లింపులను ఆర్ఈసీ, పీఎఫ్సీ నిలుపుదల చేయడంతో.. ఒక్కసారిగా ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో చిక్కుకున్నాయి. తాజాగా ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్లు, ఇతర ఎలక్ట్రికల్ ఆస్తులను తనఖా పెట్టి ఓ బ్యాంకు నుంచి రూ.700 కోట్ల రుణాన్ని తీసుకుంటుండటంతో సోమవారం నాటికి విద్యుత్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో 25వేల మంది ఉద్యోగులు, మరో 22 వేల మంది ఆర్టిజన్లు ఉన్నారు. వీరి జీతాలకు ప్రతినెలా రూ.650 కోట్లు అవుతోంది. గతి లేక దారిమళ్లింపు రాష్ట్రంలో కొత్తగా 1080 మెగావాట్ల యాదాద్రి, 4వేల మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్‌సీలతో తెలంగాణ జెన్కో రుణ ఒప్పందం చేసుకుంది. ప్రతినెలా రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల పనులు జరుగుతుండగా, ఆర్ఈసీ, పీఎఫ్సీలు ఆ మేరకు రుణాలను ప్రతి నెలా చివరి రోజు జెన్కో ఖాతాలో జమ చేస్తున్నాయి. జీతాలకు రూ.650 కోట్లు అవసరం కాగా, ప్రతి నెలా రూ.300 కోట్ల రుణాలను మళ్లిస్తున్నారు. మిగిలిన మొత్తం కోసం వినియోగదారులు చెల్లించే బిల్లులతోపాటు బ్యాంకు రుణాలపై విద్యుత్ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఇప్పటికే అధిక శాతం ఆస్తులు తనఖా కింద పోగా, మిగిలిన ఆస్తులపై కొత్త రుణాల కోసం ఆధారపడుతున్నాయి. అప్పుల కుప్ప విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లకు పెరిగిపోయాయి. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.12 వేల కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.6వేల కోట్లు, సౌర విద్యుత్ అమ్మకందారులకు రూ.6వేల కోట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు రూ.3వేల కోట్లు, సెంబ్ కార్ప్ సంస్థకు రూ.2,600 కోట్లను చెల్లించాల్సి ఉంది. బకాయిలను చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని ఎన్టీపీసీ పలుమార్లు రాష్ట్రాన్ని హెచ్చరించింది. తెలంగాణ వచ్చాక ఏకంగా రూ.34వేల కోట్ల రుణాలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి, భద్రాద్రి, ఇతర విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు జెన్కో రూ.45 వేల కోట్ల అప్పులు చేసింది. పేరుకుపోతున్న నష్టాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రతి నెలా రూ.1,200 కోట్ల చొప్పున ఏడాదికి రూ.14,200 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, ఇప్పటివరకు ప్రభుత్వం రూ.5,600 కోట్ల సబ్సిడీలను మాత్రమే చెల్లించింది. క్రాస్ సబ్సిడీలు సర్దుబాటు చేశాక డిస్కంలు ఏటా రూ.5 వేల కోట్ల వరకు నష్టాల్లో మునిగిపోతున్నాయి. 2021–22 ముగిసే నాటికి నష్టాలు రూ.60 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. సమీప భవిష్యత్తులో విద్యుత్ సంస్థల అప్పులు రూ.లక్ష కోట్లకు చేరుకోనున్నాయి. వడ్డీల చెల్లింపులు చేయలేక విద్యుత్ సంస్థలు సతమతమవుతున్నాయి. సర్కారీ బకాయిలే గుదిబండ గత ఫిబ్రవరి ముగిసే నాటికి డిస్కంలకు రూ.17,202.15 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సినవే రూ.12,598.73 కోట్లు కాగా, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రూ.4,603.41 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం బకాయిపడిన రూ.12వేల కోట్లను చెల్లిస్తే విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతాయని ఉన్నతస్థాయి అధికారవర్గాలు చెబుతున్నాయి. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్‌పాల్‌కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్‌పాల్‌కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్‌లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్‌లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
పచ్చటి పొలాల్లో మృత్యు ఘోష
– అన్నదాతల అసువులు తీస్తున్న అప్పులు – కొంపముంచిన రుణమాఫీ – పట్టించుకోని ప్రభుత్వం – ఈ నెలలో ఇద్దరు ఆత్మహత్య – రెండేళ్లలో 8మంది బలవన్మరణం సాక్షి ప్రతినిధి, ఏలూరు : అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రై వేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నిడదవోలులోని లింగంపల్లికి చెందిన రైతు బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) అప్పులు తీర్చే దారిలేక ఈనెల 14న అర్ధరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 18న సాయంత్రం కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. వీరిద్దరికీ కొద్దోగొప్పో భూమి ఉండగా, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించిన వారే. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బయటపడే మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా.. పాలకులు కనికరించడం లేదు. జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, 3.25 లక్షల మందికి రుణార్హత కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటించారు. వారిలో సగం మందికి కూడా కార్డులు అందలేదు. అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 18 వేల మందికి రూ.100 కోట్లలోపే రుణాలిచ్చారు. ఈ ఏడాది జిల్లా రుణ ప్రణాళిక రూ.6,300 కోట్లు కాగా, ఇప్పటికే రూ.3,500 కోట్లను రుణాలుగా మంజూరు చేసినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. అందులో కేవలం రూ.100 కోట్లలోపు మాత్రమే కౌలు రైతులకు దక్కాయి. బ్యాంకుల నుంచి అప్పు పుట్టక, మరోవైపు రుణమాఫీ ఫలాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండేళ్లలో 8మంది.. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ వంటి జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండేళ్లలో జిల్లాలో 8మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. అప్పుల ఊబినుంచి బయటపడే మార్గంలేక దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన బులుసు కోటేశ్వరరావు, కొవ్వలికి చెందిన గుంజా చిన్న రంగారావు, కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పొగాకు రైతు పందిరిపల్లి సత్యనారాయణ (45), రాజవరం గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40), జంగారెడ్డిగూడెంకు చెందిన పారేపల్లి మంగరాజు, చింతలపూడి మండలం నరసింగపురానికి చెందిన తూము రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా కౌలు రైతులే కాగా.. రెండు కుటుంబాలకు మాత్రమే రూ.3 లక్షల పరిహారం అందింది. మిగిలిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు.