Andhra Pradesh Debt Is Low Compared To Other States - Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే

Published Mon, Jun 20 2022 3:01 AM | Last Updated on Mon, Jun 20 2022 10:06 AM

Andhra Pradesh debt is low Compared to other states - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. ఒక పక్క కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట పరిమితులకు లోబడే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పక్క ద్రవ్య లోటును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రం చేసిన అప్పుల కంటే పలు ఇతర రాష్ట్రాలు చేసిన అప్పులే ఎక్కువ అని తేలింది. వాస్తవం ఇలా ఉండగా, ఈ మాత్రం అప్పులు చేయడం కూడా మహా ఘోరం అన్నట్లు ప్రతిపక్షం, ఎల్లో మీడియా ప్రజల్లో విషం నింపుతున్నాయి.

► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ, రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. 
► కర్ణాటక కూడా రూ.59,244.99 కోట్ల అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసినట్లు తేలింది.

సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో పాటు ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక స్పష్టం చేసింది. కోవిడ్‌ సంక్షోభంతో కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు గణనీయంగా తగ్గిపోగా, మరో పక్క ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్పుల పరిమితి పెంపునకు అనుమతించింది.

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక ఏడాది అంటే 2021–22 బడ్జెట్‌ అంచనాల్లో వెల్లడించిన మేరకు కూడా అప్పులు చేయలేదు. అందులో కేవలం 68.04 శాతం మేర మాత్రమే అప్పు చేసినట్లు కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక ఏడాది మొత్తం ఆదాయ, వ్యయాలను ఆర్థిక ఏడాది చివరి నెల మార్చిలో సర్దుబాటు చేసి, కాగ్‌ ఈ నివేదిక రూపొందిస్తుంది.

2021–22 ఆర్థిక ఏడాదిలో కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు తేలింది. ఆర్థిక ఏడాది ద్రవ్య లోటు అంటే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం జీఎస్‌డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా 2021–22 ఆర్థిక ఏడాదిలో దానిని 2.10 శాతానికే పరిమితం చేసిందని కాగ్‌ అకౌంట్స్‌ స్పష్టం చేశాయి. అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసింది. 


టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం
► టీడీపీ ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేది. అలాంటి ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం 2021–22లో 2.10 శాతానికి పరిమితం చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విచక్షణతో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలకు నిదర్శనం. 
► బడ్జెట్‌ అంచనాల్లో వెల్లడించిన మేరకు అప్పు చేసేందుకు వీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కూడా అప్పు చేయలేదు. అంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారనే టీడీపీ నేతల ఆరోపణలు, ఎల్లో మీడియా కథనాల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. 
► వివిధ రాష్ట్రాల కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ను పరిశీలిస్తే మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ 2021–22లో అతి తక్కువగా అప్పు చేసినట్లు తేలింది. బడ్జెట్‌ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62 కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసింది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయలేదు. 
► ఈ లెక్కన వాస్తవాలను పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకే టీడీపీ నేతలతో పాటు ఆ పార్టీ అనుబంధ మీడియా.. రాష్ట్ర అప్పులపై ఆర్‌బీఐ ఆరా, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఇట్టే తెలుస్తోంది. 

ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడు
► బాబు హయాంలో ఐదేళ్లు అస్తవ్యస్థ ఆర్థిక నిర్వహణ, పాలన కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై ద్రవ్య బాధ్యతలు తడిసి మోపెడయ్యాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.39,000 కోట్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది.
► మరో పక్క ప్రభుత్వ గ్యారెంటీలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడంతో పాటు విద్యుత్‌ సంస్థల అప్పులను రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెంచేసింది. ఇదే సమయంలో డిస్కమ్స్‌ బకాయిలను రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచింది. 

ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి
► ప్రస్తుత ప్రభుత్వం ఇవన్నీ తీరుస్తూనే మరో పక్క కోవిడ్‌ కారణంగా 2019–20లో రాష్ట్ర ఆదాయంలో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేసింది. 
► 2021–22 ఆర్థిక ఏడాదిలో అంతకు ముందు రెండేళ్ల కంటే కొంత మేర రాష్ట్ర ఆదాయం మెరుగు పడింది. 2020–21లో బడ్జెట్‌ అంచనాల రెవెన్యూ రాబడిలో 72.32 శాతమే రాగా, 2021–22లో 84.96% మేర వచ్చిందని కాగ్‌ పేర్కొంది. 
► ఎక్కడా అవినీతి, దుర్వినియోగం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వీలుగా నవరత్నాలకు వినియోగించిందని, కోవిడ్‌ సంక్షోభంలో రాష్ట్రంలో పేద, సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఆదుకున్నట్లయిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను చేపట్టింది.

బాబు హయాంలోనే పరిమితికి మించి అప్పులు
► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పరిమితికి మించి జీఎస్‌డీపీలో 3 శాతానికన్నా ఎక్కువగా అప్పులు చేశారని కాగ్‌ అకౌంట్స్‌ స్పష్టం చేస్తున్నాయి. 2014–15 ఆర్థిక ఏడాదిలో జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు 3.95 శాతం ఉంది. 4 బాబు దిగిపోయే సమయానికి అంటే 2018–19 జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు (అప్పులు) 4.06%కి పెరిగింది. అలాంటిది 2021–22 ఆర్థిక ఏడాదిలో జీఎస్‌డీపీలో అప్పులను 2.10%కు ఈ ప్రభుత్వం తగ్గించింది. 

ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ అప్పు తక్కువే
► పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 2021–22 బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పులు చేసినట్లు కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ పేర్కొన్నాయి. రూ.45,509.60 కోట్ల అప్పు చేయనున్నట్లు తొలుత పేర్కొన్నప్పటికీ,  రూ.47,690.59 కోట్ల అప్పు చేసినట్లు తేలింది. 
► కర్ణాటక రాష్ట్రం 2021–22 ఆర్థిక ఏడాదిలో రూ.59,244.99 కోట్లు అప్పు చేయనున్నట్లు వెల్లడించి, తీరా రూ.60,486.26 కోట్ల అప్పు చేసింది. 
► బడ్జెట్‌ అంచనాల్లో కేరళ ప్రభుత్వం 81.58% మేర, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 82.27% మేర అప్పు చేశాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ బయట వివిధ సంస్థల కోసం అప్పులు చేయడం మామూలే. ఆ అప్పులకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థల ద్వారా అప్పులు చేస్తోంది.  
► బడ్జెట్‌ బయట అప్పులు ఎంత చేశారనేది ద్రవ్య జవాబు దారీ బడ్జెట్‌ నిర్వహణ విధాన పత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో దాపరికం ఏమీ లేదు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో సగటు వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం ఉండగా, ఈ మూడేళ్లలో సగటు వార్షిక అప్పు 15.77 శాతమే ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement