చేబదుళ్ల వడ్డీ రూ.108 కోట్లు | CAG Report Revealed On 2019 March Financial Year Ending | Sakshi
Sakshi News home page

చేబదుళ్ల వడ్డీ రూ.108 కోట్లు

Published Sat, Dec 5 2020 4:46 AM | Last Updated on Sat, Dec 5 2020 8:26 AM

CAG Report Revealed On 2019 March Financial Year Ending - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్ధిక నిర్వహణను గత సర్కారు పూర్తిగా దిగజార్చింది. రెండేళ్లలో చేబదుళ్లకు భారీగా వడ్డీ చెల్లించింది. ఇది టీడీపీ సర్కారు అస్తవ్యస్థ ఆర్ధిక నిర్వహణ విధానాలను రుజువు చేస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 250 రోజులు చేబదుళ్లతోనే కాలం వెళ్లబుచ్చింది. వరుసగా 2017–18లో కూడా చేబదుళ్లు (వేస్‌ అండ్‌ మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌)సకాలంలో చెల్లించకపోవడంతో రూ.44 కోట్ల మేర వడ్డీ కట్టాల్సి వచ్చింది. 2018–19 ఆర్థిక ఏడాదిలో కూడా చేబదుళ్లు సకాలంలో చెల్లించకపోవడంతో రూ.64 కోట్ల మేర వడ్డీ భారం ఖజానాపై పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా వరుసగా రెండేళ్లలో చేబదుళ్లకే రూ.108 కోట్ల మేర వడ్డీ చెల్లించారు. 2018–19 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.  

కాగ్‌ నివేదికలో ముఖ్యాంశాలివీ.. 
► 2018–19లో రెవెన్యూ వ్యయం  భారీగా పెరిగింది. 2017–18లో రెవెన్యూ వ్యయం రూ.1,21,214 కోట్లు ఉండగా 2018–19లో రూ.1,28,570 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది కన్నా 6.07 శాతం పెరిగింది. జీఎస్‌డీపీలో రెవెన్యూ వ్యయం 13.77 శాతంగా ఉంది. 
► 2018–19లో రెవెన్యూ లోటు 13,899 కోట్లుగా ఉంది. 14వ ఆర్ధిక సంఘం రెవెన్యూ లోటు గ్రాంటు విడుదల చేసినప్పటికీ గత మూడేళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు నిర్దేశించిన పరిమితికి మించి ఉంది. 
► 2019 మార్చి 31 నాటికి సీపీఎస్‌ ఉద్యోగుల పెన్షన్‌ సొమ్ము రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం జాతీయ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా తరువాత సంవత్సరాలకు వాయిదా వేసింది. దీనివల్ల ఆ సొమ్ముపై రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాల్సి ఉంది. ఉద్యోగులకు చెందిన నిధులను గత సర్కారు సమంజసం కాని రీతిలో వినియోగించింది. దీంతో ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి నెలకొనడంతోపాటు ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడింది. ఫలితంగా ఈ పథకమే విఫలమయ్యే ప్రమాదం నెలకొంది.  
► ఏటా రుణాలు పెరుగుతుండటంతో 2018– 19కి రుణ బకాయిలు రూ.2,57,510 కోట్లకు చేరుకున్నాయి. 2018–19లో రుణాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.33,804 కోట్లు ఎక్కువగా పెరిగాయి. 2019 మార్చి 31 నాటికి రాష్ట్ర రుణాల పరిపక్వత సమయాలను పరిశీలిస్తే రాబోయే ఏడు సంవత్సరాల్లో 54 శాతం అంటే రూ.1,03,550 కోట్ల రుణాలను రాష్ట్రం తీర్చాల్సి ఉంటుంది. ఈ రుణ భారాన్ని అధిగమించేందుకు అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంతోపాటు వివేచనాత్మక వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. రుణాలు చెల్లించేందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకుంటే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అస్తవ్యస్త నిర్వహణతో ఖజానాకు నష్టం 
అంతర్‌ రాష్ట్ర పర్మిట్లు లేకుండా వాహనాలు తిరిగినా పట్టించుకోలేదు 
చంద్రబాబు హయాంలో రవాణా శాఖ చెక్‌ పోస్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తూర్పారబట్టింది. ఇతర రాష్ట్రాల వాహనాలు అంతర్‌ రాష్ట్ర పర్మిట్లు లేకుండా ఏపీలో తిరిగినా రవాణా శాఖ పట్టించుకోలేదని ఎత్తి చూపింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ నివేదికల్ని ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగ్‌ ఎత్తి చూపిన లోపాల్లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి. 2018–19 మధ్య ఇతర రాష్ట్రాలకు చెందిన 71,011 రవాణా వాహనాలు ఏపీలో ప్రవేశించాయి. ఇందులో 57,047 వాహనాలకు చెల్లుబాటయ్యే అంతర్‌ రాష్ట్ర పర్మిట్లు లేవు. అయినా ఆ వాహనాలు ఏపీలో తిరిగాయి. సరైన ప్రదేశంలో చెక్‌ పోస్ట్‌లు లేకపోవడం వల్ల కనీసం?రూ.1.60 కోట్లు రెవెన్యూ నష్టపోవడమే కాకుండా నిర్దేశిత తనిఖీలు చేపట్టలేదు. ఏడాది వ్యవధిలో జరిగిన 1,79,278 నేరాల్లో 1,39,315 నేరాలు పునరావృతమైన నేరానికి సంబంధించినవి. రెండు, అంతకుమించి నేరాలతో పట్టుబడిన వాహనాలకు రూ.2 వేలు జరిమానా విధించాల్సి ఉండగా, రూ.వెయ్యి మాత్రమే విధించారు. దీనివల్ల కాంపౌండింగ్‌ రుసుం రూ.10.45 కోట్లు తక్కువగా వసూలైంది. 

చింతూరు చెక్‌పోస్ట్‌ వద్ద లావాదేవీలను మాన్యువల్‌గా నిర్వహించారు. రెవెన్యూ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించలేదు. వసూలైన సొమ్మును ట్రెజరీలో సరిగా జమ చేయలేదు. 2015–18 మధ్య కాలానికి సంబంధించి చింతూరు చెక్‌పోస్టు వద్ద వసూలైన రాబడిని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని పాల్వంచ వద్ద చెక్‌ పోస్ట్‌లో వసూలైన రాబడితో పోల్చిచూడగా, చింతూరు వద్ద వసూలైన రాబడిలో రూ.3.09 కోట్లు వ్యత్యాసాన్ని గుర్తించారు. ఏపీలోని మూడు చెక్‌ పోస్ట్‌లలో 2016 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి మధ్య కాలంలో వసూలైన రాబడి ట్రెజరీ జమలతో సరి పోల్చలేదు. దీనివల్ల రూ.1.49 కోట్లు ట్రెజరీలో జమ కాలేదు.  

అంచనాలు 147 % పెంపు 
టీడీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో వివిధ ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేశారని ‘సాక్షి’ ఆది నుంచీ తెలియజేస్తూనే ఉంది. అది అక్షర సత్యమని కాగ్‌ నివేదిక ద్వారా మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు పాలనలో తొలుత రహదారులు, వంతెనలు, భవనాలు, ఇతర  పనుల అంచనాలను రూ.35,780 కోట్లుగా పేర్కొని 2018–19 నాటికి రూ.88,254 కోట్లకు పెంచేసినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. ఏకంగా 147 శాతం పెంచారని కాగ్‌ పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.31,180 కోట్లను వ్యయం చేయగా రూ.1,585 కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టినట్లు కాగ్‌ నివేదిక తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement