ఐదు సంతకాలు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు | Chandrababu Naidu Takes Charge As Andhra Pradesh Chief Minister, Signed On Five Files | Sakshi
Sakshi News home page

ఐదు సంతకాలు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

Published Fri, Jun 14 2024 4:03 AM | Last Updated on Fri, Jun 14 2024 12:09 PM

Chandrababu Naidu Takes Charge As Andhra Pradesh Chief Minister

బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీపై మొదటి సంతకం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు

ఐదేళ్ల తరువాత సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి చంద్రబాబు

ఘనంగా స్వాగతం పలికిన రాజధాని రైతులు, మహిళలు, ఉద్యోగులు, అధికారులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని సచి­వా­లయం మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4.41 గంట­లకు వేద పండితుల పూజల అనంతరం బాధ్య­తలు చేపట్టారు. సీఎం హోదాలో ఐదేళ్ల తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు, మహిళలు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు ఇరువైపులా నిలబడి రహదారిపై పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. వెంకటపాలెం వద్ద గజమాలతో స్వాగతించారు. సచివాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు సీఎంను సాదరంగా ఆహ్వానించారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆలిండియా సర్వీస్‌ అధికారులు.. పలువురు మంత్రులు సీఎంని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తొలి రోజు ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. మొదటి హామీ అయిన మెగా డీఎస్సీపై నిరుద్యోగుల సమక్షంలో తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు 16,347 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామన్న రెండో హామీపై రైతుల సమక్షంలో సీఎం సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపై లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. 

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణన దస్త్రంపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని పెట్టారు. ఇక ప్రజల పాలన ఉంటుందని ప్రకటించారు. కాగా డిసెంబర్‌ 31లోగా 16,347 టీచర్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

⇒ ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత తమ ఆవేదనను నా దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్‌ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం రేటు ఉంది. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని ఎన్నికల ప్రచారంలో నేను, పవన్‌ కళ్యాణ్, బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేశా. 

⇒ గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో అనేక సమస్యలున్నాయి. భూములకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టంతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. భూమిని కొంతమంది కొనుగోలు చేయగా మరికొందరికి వారసత్వంగా లభించింది. ఆ పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మ వేసుకోవడం ఎంత వరకు న్యాయం? దానం చేసినట్లు జగనన్న భూహక్కు అని రాసుకున్నారు. చట్టాన్ని తెచ్చి ఆయన మనుషులను పెట్టుకుంటామన్నారు. సొంత మనుషులతో రికార్డులు మార్చడానికి ప్రయత్నించారు. రికార్డులు మార్చి సెటిల్‌మెంట్లు కూడా చేసుకున్నారు. ఒకసారి రికార్డులు మార్చితే హైకోర్టుకు వెళ్లాలి. హైకోర్టుకు వెళితే ఏళ్లు పడుతుంది. అందుకే దీన్ని రద్దు చేస్తున్నాం. 

⇒ మొదటిసారి రూ.35తో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్‌. సమైక్య రాష్ట్రంలో నేను దాన్ని రూ.75కి పెంచా. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1,000కి, తర్వాత రూ.2 వేలకు పెంచా. తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది రూ.వెయ్యి మాత్రమే. ఎన్నికల హామీ మేరకు పెన్షన్‌ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌తో పాటు ఏప్రిల్, మే, జూన్‌కి సంబంధించి నెలకు రూ.1,000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పా. పెంచిన వాటితో కలిపి జూలైలో రూ.7 వేలు పెన్షన్‌ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్‌ కూడా రూ.6 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్‌ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు.  

⇒ ఉన్నత చదువులు చదివినా సరైన స్కిల్స్‌ లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కులు తీశారు. మొదటి సారిగా స్కిల్‌ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది? దేశంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి? దానికి తగ్గ స్కిల్స్‌ ఉన్నాయా లేదా? అన్నది లెక్కిస్తున్నాం. పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు కాకుండా మన రాష్ట్రం నుంచే మానవ వనరులు సమకూర్చేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

⇒ పేదవాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు  తీసుకొచ్చాం. రూ.5 చొప్పున అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించాం. చిరు ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లే వారికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కర్నాటకలో ఇందిరాగా>ంధీ పేరుతో, తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌ పేరుతో వాటిని ఏర్పాటు చేస్తే మనం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చాం. చాలా మంది అన్న క్యాంటీన్లలో భోజనాలకు విరాళాలు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మూసివేసింది. బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఐదో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చేశా. ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement