చంద్రబాబు నాయుడి అరెస్ట్ గురించి నానా యాగీ చేయాలి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడానికి కారణమైన 371 కోట్ల రూపాయల లూటీ గురించి ఎవరికీ తెలియకూడదు. ఇదీ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆలోచన. దీన్నే అసెంబ్లీలోనూ వారు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ. ప్రభుత్వం చర్చకు సిద్ధమనగానే కంగారు పడ్డారు. చర్చ జరగకుండా నినాదాలతో.. బల్లలు బాదుతూ వికృత చేష్ఠలు చేస్తూ కాలక్షేపం చేశారు. ఒక వేళ చర్చకు సిద్ధమై ఉంటే చంద్రబాబు నాయుడి దోపిడీ మొత్తం కోట్లాది మందికి మరింత స్పష్టంగా అర్ధమవుతుందనే భయం టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏదైనా చర్చ జరగాలని కోరినపుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వం ముందుకు రాదు. చర్చ జరిగి తీరాల్సిందేనని విపక్షాలు అప్పుడు అసెంబ్లీలో నిరసనలు వ్యక్తం చేసి హడావిడి చేస్తాయి. కానీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల ఆరంభం రోజునే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తమ నాయకుడు చంద్రబాబు నాయుణ్ని స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ చేసిన వైనంపై చర్చ జరగాలని వాయిదా తీర్మానంలో కోరారు. ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు ఒప్పుకోదని టీడీపీ నేతలు అనుకున్నారు. ప్రభుత్వం చర్చకు వీలు లేదంటే ఆ వెంటనే అసెంబ్లీలో హంగామా చేసేయాలని అనుకున్నారు. అయితే..
టీడీపీ నేతలకు షాకిచ్చింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడి అరెస్ట్ మీద.. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు లూటీ చేసిన తీరుపైనా చర్చించడానికి తాము సిద్దమేనని స్పష్టం చేసింది. అంతే కాదు టీడీపీ సభ్యులు ఈ అంశంపై ఎంత సేపు కావాలంటే అంత సేపు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్ ను కోరారు శాసన సభావ్యవహారాల మంత్రి. అవసరమైతే.. టీడీపీ సభ్యులు తమ వాదన వినిపించుకోవచ్చునని అన్నారు. ఆ తర్వాత వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని కూడా అన్నారు. ఈ పరిణామాన్ని ఊహించని టీడీపీ సభ్యుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది.
చంద్రబాబు అరెస్ట్ పైనా.. స్కిల్ కుంభకోణంపైనా నిజంగానే చర్చ జరిగితే తాము తలెత్తుకునే పరిస్థితి ఉండదని భావించినట్లున్నారు. చంద్రబాబు నాయుణ్ని రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసిన సంగతి టీడీపీ నేతలకు కూడా తెలుసు. కాబట్టే.. దాన్ని అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం వివరంగా ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించారు. తద్వారా టీడీపీ ప్రతిష్ఠ మరింతగా దిగజారుతుందని భయపడ్డారు. అందుకే చర్చ మొదలుకానీయకుండా కావాలనే బాబు అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గడిపారు. నందమూరి బాలయ్య అయితే కొన్ని వికృత చేష్ఠలు.. మరి కొన్ని రౌడీ వేషాలతో తమ సభ్యులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు నిజంగానే తప్పు చేశారని ప్రజలకు మరోసారి టీడీపీ సభ్యులే చాటి చెప్పినట్లయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
:::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు
ఇదీ చదవండి: బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య అలా..
Comments
Please login to add a commentAdd a comment