పచ్చటి పొలాల్లో మృత్యు ఘోష
పచ్చటి పొలాల్లో మృత్యు ఘోష
Published Tue, Oct 25 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
– అన్నదాతల అసువులు తీస్తున్న అప్పులు
– కొంపముంచిన రుణమాఫీ
– పట్టించుకోని ప్రభుత్వం
– ఈ నెలలో ఇద్దరు ఆత్మహత్య
– రెండేళ్లలో 8మంది బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రై వేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో ఇద్దరు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నిడదవోలులోని లింగంపల్లికి చెందిన రైతు బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) అప్పులు తీర్చే దారిలేక ఈనెల 14న అర్ధరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 18న సాయంత్రం కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. వీరిద్దరికీ కొద్దోగొప్పో భూమి ఉండగా, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించిన వారే. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బయటపడే మార్గం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా.. పాలకులు కనికరించడం లేదు. జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, 3.25 లక్షల మందికి రుణార్హత కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటించారు. వారిలో సగం మందికి కూడా కార్డులు అందలేదు. అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 18 వేల మందికి రూ.100 కోట్లలోపే రుణాలిచ్చారు. ఈ ఏడాది జిల్లా రుణ ప్రణాళిక రూ.6,300 కోట్లు కాగా, ఇప్పటికే రూ.3,500 కోట్లను రుణాలుగా మంజూరు చేసినట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. అందులో కేవలం రూ.100 కోట్లలోపు మాత్రమే కౌలు రైతులకు దక్కాయి. బ్యాంకుల నుంచి అప్పు పుట్టక, మరోవైపు రుణమాఫీ ఫలాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
రెండేళ్లలో 8మంది..
టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నపూర్ణ వంటి జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండేళ్లలో జిల్లాలో 8మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. అప్పుల ఊబినుంచి బయటపడే మార్గంలేక దెందులూరు మండలం సోమవరప్పాడుకు చెందిన బులుసు కోటేశ్వరరావు, కొవ్వలికి చెందిన గుంజా చిన్న రంగారావు, కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పొగాకు రైతు పందిరిపల్లి సత్యనారాయణ (45), రాజవరం గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40), జంగారెడ్డిగూడెంకు చెందిన పారేపల్లి మంగరాజు, చింతలపూడి మండలం నరసింగపురానికి చెందిన తూము రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా కౌలు రైతులే కాగా.. రెండు కుటుంబాలకు మాత్రమే రూ.3 లక్షల పరిహారం అందింది. మిగిలిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదు.
Advertisement