కౌలు రైతును కాటేసిన రుణమాఫీ హామీ
కౌలు రైతును కాటేసిన రుణమాఫీ హామీ
Published Sat, Oct 15 2016 9:42 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
– అప్పులు తీర్చలేక ఆత్మహత్య
– రుణం మాఫీకాక పొలం అమ్మేసి కౌలు రైతుగా మారిన వైనం
నిడదవోలు :
రుణమాఫీ హామీ ఓ రైతును పొట్టనపెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లింగంపల్లికి చెందిన బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విద్యాసాగర్ తన తండ్రికి గల ఎకరం పొలంతోపాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆరేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మిల్లర్లు, తెలిసిన ఆసాముల వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. తన తండ్రి వెంకట్రావు పేరిట ఉన్న ఎకరం పొలంపై 2012లో రూ.90 వేల వరకు పంట రుణం తీసుకున్నాడు. ఆ రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో బ్యాంకుకు వాయిదాలు చెల్లించలేదు. ఆ మొత్తం మాఫీకాకపోగా వడ్డీలతో కలిపి తడిసిమోపెడైంది. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు నెలల క్రితం తన తండ్రి పేరిట ఉన్న ఎకరం పొలాన్ని విక్రయించి బ్యాంకు అప్పుతోపాటు బయటి అప్పులను కూడా కొంతమేర తీర్చాడు. అయినా.. బయట తెచ్చిన అప్పులు తీరలేదు. ఈ నేపథ్యంలో బకాయిలు తీర్చే మార్గం లేక విద్యాసాగర్ వారం రోజులుగా బెంగతో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 1గంట సమయంలో పొలంలోని పాక వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి తండ్రి వెంకట్రావు స్పృహ కోల్పోయాడు. మృతుడు విద్యాసాగర్ అవివాహితుడు.
Advertisement