న్యూఢిల్లీ: న్యాయవిద్య అభ్యసించిన చాలామంది యువతీయువకులు న్యాయవ్యవస్థలో కాకుండా ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ లా యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవంలో జస్టిస్ గొగోయ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ‘లాయర్ల పాత్ర, పనితీరును మనం పరిశీలించాల్సిన అవసరముంది.
న్యాయ రంగంలో గొప్ప అవకాశాలు, ఆకర్షణ ఉన్నప్పటికీ న్యాయవిద్యను అభ్యసించినవారిలో చాలామంది ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. చాలామంది న్యాయవాదులు మధ్యవర్తులుగా, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేవారిగా, న్యాయాధికారులుగా, సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతకాలంలో కార్పొరేట్ న్యాయవాదుల కెరీర్ చాలా ఆకర్షణీయంగా మారింది. ఇందులోని ఆర్థిక మూలాలకు నేను పోదల్చుకోలేదు. అదే సమయంలో బార్, బెంచ్‌లోని ఆసక్తికరమైన బాధ్యతలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది.
నేను బార్, బెంచ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశా. ఇక్కడ పని కారణంగా దొరికే సంతృప్తి చాలాఎక్కువ. ప్రస్తుతం మనం అందిస్తున్న ఐదేళ్ల ‘లా’ డిగ్రీ కోర్సును సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఈ పద్ధతి అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో పూర్తిగా విఫలం కూడా కాలేదు. బార్ వ్యవస్థను పటిష్టం చేసేందుకే ‘లా’ స్కూళ్లను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం ఎన్ని ‘లా’ స్కూళ్లు తమ ఏర్పాటు వెనుకున్న లక్ష్యాన్ని అందుకుంటున్నాయి? ఈ విషయమై బార్ విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment