సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన మీద నమోదైన సుమోటో లైంగిక వేధింపుల కేసును గురువారం సుప్రీం కోర్టు క్లోజ్ చేసింది. రంజన్ గొగోయ్‌పై నమోదైన కేసులో కుట్ర కోణం ఉండవచ్చని అనుమానించిన కోర్టు ఇలా చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.
జస్టిస్ పట్నాయక్ కమిటీ, సీజేఐ ఎస్‌ఏ బాబ్డేల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ నివేదిక మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి ఉత్తర్వుల ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలు ఆయనపై కుట్రను ప్రేరేపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ గొగోయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని పట్నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ పొందలేకపోయిందని వ్యాఖ్యానించింది.
ఎన్ఆర్‌సీ లాంటి కేసుల్లో జస్టిస్ గొగోయ్ ఇచ్చిన తీర్పులపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రంజన్ గొగోయ్ కొన్ని కఠినమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలు విచారణర్హం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలను చేసినట్టు మేం అభిప్రాయపడ్డాం.. సుమోటాగా స్వీకరించిన ఈ కేసును మూసివేస్తున్నామని’’ కోర్టు స్పష్టం చేసింది.
చదవండి: జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
యంత్రాంగమే ఎదుర్కోగలదు
Comments
Please login to add a commentAdd a comment