
కొన్ని వివాదాలు కోర్టు రూమ్‌ల్లో విచారణకు సరిపడవు: సీజేఐ
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్‌ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్‌ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు.
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్‌ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు.
మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు.