సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు
బెంగళూరు : ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తితే అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని అన్నారు. శనివారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన ‘న్యాయశాఖ అధికారుల 17వ ద్వైవార్షిక సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి సైతం న్యాయాన్ని చేరువ చేసే దిశగా న్యాయమూర్తులు, న్యాయశాఖలోని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయమూర్తులు సరిగా పనిచేయకపోవడం వల్లే దేశంలోని అనేక కోర్టులలో కోట్ల సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ఒక వైపు కేసులు పరిష్కారం అవుతూనే ఉన్నా మరో వైపు రోజూ కొత్త కొత్త కేసులు న్యాయస్థానం ముందుకు వస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు బాధితులకు అన్యాయం కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో నిర్వహించిన జాతీయ అదాలత్‌లో ఒకే రోజున 1.25కోట్ల కేసులను పరిష్కరించినట్లు దత్తు వెల్లడించారు.
ఇలాంటి కార్యక్రమాలు కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఎంతైనా అవసరమని అన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి వాఘేలా మాట్లాడుతూ... కర్ణాటక ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అవసరమైన అన్ని విధాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ఖాళీగా ఉన్న ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, డి గ్రూప్ ఉద్యోగుల భర్తీ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, లోకాయుక్త భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవ్యవస్థ సుప్రీం
Published Sun, Dec 14 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement
Advertisement