న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లను కొత్త జడ్జీలుగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 10న సిఫారసులు పంపడం తెలిసిందే. ఆ సిఫారసులను బుధవారం కేంద్రం ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి నియామక పత్రాలపై సంతకం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరూభాయ్ పటేల్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అజయ్ కుమార్ మిత్తల్ నియమితులయ్యారు.
ఢిల్లీ హైకోర్టుకు మరో నలుగురు జడ్జీలను కేంద్రం నియమించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జస్టిస్ బోపన్న, జస్టిస్ బోస్‌ల పేర్లను కొలీజియం ఏప్రిల్‌లోనే సిఫారసు చేసినప్పటికీ, సీనియారిటీ, ప్రాంతాల వారీ ప్రాతినిధ్యం తదితర కారణాలు చూపుతూ కేంద్రం ఆ సిఫారసులను వెనక్కు పంపింది. అయితే వారిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి అన్ని రకాలా అర్హులేననీ, వారికి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు కల్పించాల్సిందేనంటూ కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసులు పంపింది.
వీరిద్దరితోపాటు కొత్తగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ గవాయ్‌ల పేర్లను కూడా చేర్చి, మొత్తం నలుగురి పేర్లను సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించింది. కొత్తగా నియమితులు కానున్న కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ బోపన్న ప్రస్తుతం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ బోస్ ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్టు ప్రధాన జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ గవాయ్ బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు.
గొగోయ్ పర్యవేక్షణలోనే 10 మంది
గతేడాది అక్టోబర్‌లో సీజేఐగా గొగోయ్ నియమితులు కాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 10 మందిని సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించి, తనకు ముందు పనిచేసిన సీజేఐల్లో చాలా మందికి లేని ఘనతను జస్టిస్ గొగోయ్ సొంతం చేసుకున్నారు. అలాగే సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 31 మంది న్యాయమూర్తులు ఉండటం కూడా గత కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి. జస్టిస్ గవాయ్‌కి 2025లో సీజేఐ పదవి జస్టిస్ గవాయ్ 2025 మే నెలలో సీజేఐగా పదోన్నతి పొందనున్నారు. జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. తొలి దళిత సీజేఐ అయిన కేజీ బాలక్రిష్ణన్ 2010 మే నెలలో పదవీ విరమణ పొందారు.
దశాబ్దాల తర్వాత 31కి
ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీం కోర్టుకు మంజూరు చేసిన జడ్జి పోస్టుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం 27 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉన్నారు. కొత్తగా నలుగురు నియమితులు కానుండటంతో మొత్తం జడ్జీల సంఖ్య గరిష్ట పరిమితి అయిన 31కి చేరనుంది. కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ సుప్రీంకోర్టులో ఒకేసారి 31 మంది జడ్జీలు లేరు.
సుప్రీంలోకి నలుగురు జడ్జీలు
Published Thu, May 23 2019 3:47 AM | Last Updated on Thu, May 23 2019 3:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment