కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్
న్యూఢిల్లీ: నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కోర్టు కొలీజియం పంపిన సిఫార్సులకు 48 గంటల్లోనే కేంద్రం ఓకే చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి(త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా(పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి(గుజరాత్ హైకోర్టు)లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 2002లో ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిగా, 2016లో గుజరాత్ సీజేగా పదోన్నతి పొందారు. కొత్త జడ్జీలు బాధ్యతలు చేపట్టాక కోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరగనుంది.
ప్రజల సందర్శనకు సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టును సామాన్యప్రజలు కూడా సందర్శించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇకపై సుప్రీంకోర్టు గదులు, జడ్జీల గ్రంథాలయాన్ని సెలవు దినాలు మినహాయించి ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని వర్గాల వారూ సందర్శించేందుకు వీలుంది. సందర్శకులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని, థింక్‌ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ను సీజేఐ ప్రారంభించారు. ‘ఈ కేంద్రం ఏర్పాటు కేవలం నాకు తట్టిన ఆలోచన మాత్రమే. మిమ్మల్ని సంప్రదించకుండా దీనిని ఏర్పాటు చేసినందుకు క్షమించాలని కోరుతున్నా’ ఆవిష్కరణ కార్యక్రమంలో సీజేఐ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment