
‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్కకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో యార్లగడ్డ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు
సాక్షి, అమరావతి : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించిన అనంతరం క్లుప్తంగా మాట్లాడారు. సినారె గురించి తాను ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సింది ఏమీలేదని, ఆయన రచనలు, ఆయన ప్రసంగాల గురించి ఇంతమంది పెద్దలు మాట్లాడిన తరువాత తానింక చెప్పజాలనని జగన్ వినమ్రంగా అన్నారు. ఆచార్య సినారె రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు ఆయన చేసిన ప్రసంగాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనది డాక్టర్ సి.నారాయణరెడ్డితో 45 ఏళ్ల పరిచయమని అన్నారు. ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాక్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రథమ శ్రోతను తానేనన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండోవారు సినారె అని చెప్పారు. యువకులైన సీఎం వైఎస్ జగన్ పది కాలాల పాటు రాజ్యం చేయాలని.. జనరంజకంగా పాలించాలని జస్టిస్ చలమేశ్వర్ ఆకాంక్షించారు.
రైతులను వేధించకుండా చూడాలి
ఒకచోట నుంచి మరోచోటికి రైతులు నల్లబంక మట్టిని, ఎర్రమట్టిని తవ్వుకుని ట్రాక్టర్లలో తీసుకువెళ్తూ ఉంటారని.. అలాంటి వారిని పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సమావేశంలో చలమేశ్వర్ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది శిక్షార్హమని ఎక్కడాలేదని.. రైతుల అనుకూల ప్రభుత్వం కనుక వారి సంక్షేమం కోరి ఇలాంటి వేధింపులు వారిపై లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలివ్వాలని, ఇది రాష్ట్రంలో ఉండే రైతులందరి సమస్య అని ఆయనన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారన్నారు. అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. వాటిని అధిగమించే శక్తి వైఎస్ జగన్‌కి ఉందని భావిస్తున్నానన్నారు. ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వస్తారని, ప్రజాసేవ చేసే క్రమంలో చట్టసభల్లో అనవసరంగా బలప్రదర్శనలు జరుగుతూ ఉంటాయన్నారు. ప్రజాసేవను ఇలా చేయాలా? ఇంత వేడి అవసరమా అని అన్నారు. సినారె అనేక విషయాలను చక్కగా చెప్పారన్నారు.
జగన్ ఆత్మవిశ్వాసం గొప్పది : యార్లగడ్డ
పార్లమెంట్‌లో అనేక అనుభవాలను, దృశ్యాలను.. సంఘటనలను చెప్పిన డాక్టర్ సి.నా.రే ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ పూర్వ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్, ఫలితాలకు మధ్య సమయంలో తాను జగన్‌ను కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరినపుడు, ఫలితాలు రావడానికి ముందే.. తాను 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అదే హోదాలో ఆవిష్కరిస్తానని చెప్పారని, ఆయన ఆత్మవిశ్వాసం అంత గొప్పదని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. రైతు నేస్తం పబ్లికేషన్స్‌కి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. సినారె కుటుంబ సభ్యులు ఎ. భాస్కర్‌రెడ్డి, ఎస్ సురేందర్‌రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్‌రెడ్డి, గాదె సుధాకర్‌రెడ్డి, చైతన్యదేవ్, ప్రముఖులు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేష్, కోనేరు ప్రసాద్, అడుసుమిల్లి జయప్రకాష్, గోళ్ల నారాయణరావు, వంశీ రామరాజు, కేవీ సుబ్బారావు, ఏఎస్ దాస్, విజయసాయిరెడ్డి, కనుమూరి రఘురామ కృష్ణంరాజు సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.