పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు.
దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్?
జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది.
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్‌సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి.
ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి?
2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది.
ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి.
2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది.
ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్‌ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్‌లో అప్పుడు భారత్‌ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.
ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు.
కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది.
రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది.
మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు.
మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త
ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment