దేశ ఆర్థిక వ్యవస్థను ప్రకంపింపజేసిన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి అయిదేళ్లు నిండాయి. దేశప్రజలపై సర్జికల్ స్ట్రయిక్ అని చెబుతున్న ఈ ఒక్క నిర్ణయంతో చలామణిలో ఉన్న 86 శాతం నగదు ఉనికిలో లేకుండా పోయింది. యావద్దేశం నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. డబ్బుకోసం పడిగాపులు కాస్తూ 120 మంది సామాన్యులు చనిపోయారు. ఈ పిడుగుపాటు నిర్ణయం ద్వారా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. నల్లధనం బయటపడలేదు. సంపన్నుల అక్రమార్జనను ఇది అడ్డుకోలేదు. డిజిటల్ చెల్లింపుల లక్ష్యం పనిచేయలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ. 15 లక్షల కోట్లకు పైగా నగదు చలామణిలో ఉండగా 2021 అక్టోబర్ నాటికి అది రూ. 28 లక్షల కోట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 94 శాతం శ్రామికులకు ఉపాధి కలిగిస్తున్న అసంఘటిత రంగం కోలుకోలేనంతగా కుప్పగూలి పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. పెద్దనోట్ల రద్దు దేశంపై రుద్దిన విధాన నిర్ణయ సంక్షోభం మాత్రమే.
అయిదేళ్ల క్రితం అంటే 2016 నవంబర్ 8 రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దుపై ‘చారిత్రక’ నిర్ణయాన్ని ప్రకటించారు. దీన్ని భారత ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించే చర్యగా ప్రధాని పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థలో చలామణిలో లేకుండా దాగి ఉంటున్న లెక్కలోకి రాని డబ్బును వెలికి తీయడం, నకిలీ నోట్ల పనిపట్టడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు ప్రాధాన్యత తగ్గించి డిజిటల్ చెల్లింపులను పెంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలోని రాబడిని పెంచుకోవడమే పెద్ద నోట్ల రద్దు లక్ష్యమని తెలిపారు. ప్రధాని నిర్ణయంతో అంతవరకు చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఒక్కక్షణంలో రద్దయిపోయాయి. దేశ కరెన్సీలో వీటి వాటా 86 శాతం. మరి ఈ అయిదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పులేమిటి? పెద్దనోట్ల రద్దుకు, ఈ కాలంలో జరిగిన మార్పులకు ఉన్న సంబంధం ఏమిటి?
దాదాపు 86 శాతం కరెన్సీ నోట్లు ఉపయోగంలో లేకపోవడంతో యావద్దేశం గగ్గోలు పెట్టింది. వేలాది మంది నిత్యం తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేయడం రోజువారీ కార్యక్రమమైపోయింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ గట్టిగా సమర్థించుకుంటూ వచ్చారు. ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయలు దాచుకుంటున్నట్లు వస్తున్న వార్తలపట్ల నిజాయితీ కల పౌరులు బాధపడటం లేదా? గన్నీ బ్యాగ్‌ల నిండా అక్రమ సంపాదన దాచుకుంటున్న వార్తలు చూసి దేశంలో బాధపడనివారెవ్వరు? ఇలా అక్రమంగా డబ్బు దాచుకుంటున్న వారు తమ వద్ద అంత డబ్బు ఎలా కూడిందో పన్ను అధికారుల ముందు చెప్పేలా చేయడం, లేదా తమ వద్ద పోగుపడిన ఆ డబ్బుపై ఆశ వదులుకునేలా చేయడానికే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నామని ప్రధాని సెలవి చ్చారు. అందుకే చాలామంది పెద్ద నోట్ల రద్దు చర్యను అవినీతికి వ్యతి రేకంగా కేంద్రం చేపట్టిన మరో సర్జికల్ స్ట్రయిక్‌గా వర్ణించారు.
అక్రమ నగదు ఎక్కడకు పోయినట్లు?
కేంద్రం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం దేశప్రజలకు పిడుగుపాటులా తగిలింది. కానీ కొంతమంది ఆర్థిక వేత్తలు మాత్రం పెద్దనోట్ల రద్దు భావనను సమర్థించారు. 2016 నవంబర్ 14న ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ ఒక వాణిజ్య పత్రికకు రాస్తూ, పెద్ద నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థనుంచి 4.5 లక్షల కోట్ల రూపాయలు అదృశ్యమైపోతాయని పేర్కొన్నారు. ఇలాంటి నమ్మకాలు, ఆశావహ ప్రకటనలు అతి త్వరలోనే మాయమైపోయాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెద్ద నోట్ల రద్దు జరిగి మూడు నెలలు కాకముందే 2017 ఫిబ్రవరి 2న పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో చావుకబురు చల్లగా చెప్పేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో లెక్కలోకి రాకుండా దాగివున్న నగదు నిల్వలు పెద్దగా బయటకు రాలేదని తేల్చేశారు. ఆ సంవత్సరం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 లోపు, 2 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకు నగదును 1.09 కోట్ల ఖాతాలలో ప్రజలు తిరిగి డిపాజిట్ చేశారు. అలాగే 80 లక్షలకు పైబడిన డిపాజిట్లను 1.48 లక్షల ఖాతాలలో పెద్ద నోట్ల రద్దు సమయంలోనే సంపన్నులు డిపాజిట్ చేశారని బడ్జెట్ ప్రసంగం పేర్కొంది.
ఈ రెండు విభిన్న ఖాతాలనుంచి బ్యాంకులకు చేరిన మొత్తం 10.38 లక్షల కోట్లు. దేశం మొత్తంలో చలామణిలో ఉన్న నగదు 15.44 లక్షల కోట్లు అని నాటి అంచనా. అంటే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో మూడింట రెండువంతులు తిరిగి బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చేసినట్లు లెక్క. పైగా రద్దయిన పెద్దనోట్లలో అధిక భాగం నయా సంపన్నుల నుంచే డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని 2017 ఫిబ్రవరి 2 నాటికే పత్రికలు కోడై కూశాయి. దీనికి పరాకాష్టగా రద్దయిన పెద్ద నోట్లలో 99 శాతం వరకు బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో వచ్చి చేరిందని భారతీయ రిజర్వ్ బ్యాంకు స్వయానా పేర్కొంది. మరి ఆర్థిక వేత్తలు పేర్కొన్నట్లు అక్రమంగా దాచుకున్న 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్లు? పైగా ఆర్థిక కార్యకలాపాలు నెలలపాటు స్తంభించిపోయాయి. నల్లధనం అంటే అక్రమ నగదు కాబట్టి పెద్దనోట్లను ఉన్నఫళానా రద్దు చేస్తే సంపన్నులు దాచిపెట్టిన నల్లధనం హుష్ కాకీ మాదిరి మాయమైపోతుందని పాలకపార్టీ భ్రమించింది. కానీ వాస్తవానికి నల్లధనంపై పిడుగుపాటు ఆనుకున్నది కాస్తా దేశ ప్రజలపై విధ్వంసంలా విరుచుకుపడింది.
నగదు రహిత భారత్ సిద్ధించిందా?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తాను భావించిన ప్రాథమిక లక్ష్యాలపై పదే పదే మాట మారుస్తుండటం గమనార్హం. అయిదేళ్ల తర్వాత ఇప్పడు, అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడం పెద్దనోట్ల రద్దు లక్ష్యం కానే కాదంటూ బీజేపీ కొత్త పాట పాడుతోంది. ప్రభుత్వ పన్నుల రాబడిని పెంచుకోవడానికి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యమివ్వడమే పెద్దనోట్ల రద్దు లక్ష్యమని ఇప్పుడు చెబుతున్నారు. గత రెండేళ్ల కాలంలో దేశంలోని సంపన్నులు మరింత సంపన్నులు కావడం, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోవడం స్పష్టమవుతున్నప్పుడు కేంద్ర లక్ష్యాల డొల్లతనం బయటపడుతుంది. డిజిటల్ చెల్లింపులు తగుమాత్రంగా పెరుగుతున్నప్పటికీ ముందెన్నడూ లేనంత స్థాయిలో నగదు చలామణి కూడా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. 2016 నవంబర్ 4న దేశంలో నగదు చలామణీ దాదాపు రూ. 15 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2021 అక్టోబర్ 29 నాటికి ఇది రూ. 29.17 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తంమీద చెప్పాలంటే, పెద్ద నోట్లరద్దు నేపథ్యంలో సంపన్నులు వివిధ మార్గాల ద్వారా నల్లధనాన్ని ఆస్తులుగా మార్చుకుని మరింత బలపడగా, అసంఘటిత రంగంలోని శ్రామికులు నిరుపేదలు దారుణంగా దెబ్బతినిపోయారని డాక్టర్ అమర్త్యసేన్, డాక్టర్ అభిజిత్ వినాయక్, డాక్టర్ అరుణ్ కుమార్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు తీవ్రంగా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉత్పాతానికి, మెజారిటీ ప్రజానీకం దుస్థితికి ప్రధాని స్వయంగా బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని వీరు వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు సృష్టించిన ఉత్పా తంతో 120 మంది నిరుపేదలు బ్యాంకుల్లో చెక్కుల కోసం వడిగాపులు కాస్తూ కన్నుమూశారు. ఇక అసంఘటిక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు. ఉపాధి మార్కెట్‌కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. పెద్దనోట్ల రద్దువల్ల 2017 జనవరి–ఏప్రిల్ కాలం లోనే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ఆర్థికవ్యవస్థకు కోలుకోని దెబ్బ
శరీరంలోని అన్ని అవయవాలకు పోషకాలను అందించడంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆర్థిక వ్యవస్థకు డబ్బు కూడా అలాగే జీవం పోస్తుంది. నగదు చలామణిలో ఉండటం వల్లే ఆర్థిక లావాదేవీలు జరిగి ఆదాయాలను సృష్టించవచ్చు. శరీరం నుంచి 85 శాతం రక్తాన్ని తోడేసి, ప్రతివారమూ 5 శాతం రక్తాన్ని మాత్రమే తిరిగి చేర్చుతూపోతే శరీరం చచ్చి ఊరుకుం టుంది. అదే విధంగా చలామణిలో ఉన్న నగదులో 85 శాతాన్ని రద్దు చేసి సంవత్సరం పాటు కొంచెం కొంచెంగా తిరిగి చేరుస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా జరిగిన ఉత్పాతం ఇదే. దేశ కార్మికరంగంలో 94 శాతానికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం... డబ్బులేక కుప్పగూలిపోయింది. ఈ రంగంలోని లక్షలాది సూక్ష్మ, చిన్నతరహా యూనిట్లకు నిరంతరం డబ్బు అవసరం. అయిదేళ్లు గడిచిన తర్వాత కూడా పెద్దనోట్ల రద్దు అసంఘటిర రంగాన్ని దెబ్బతీస్తూనే ఉంది.
వైఫల్యాల దాటివేతకే ఈ ‘బిగ్ బ్యాంగ్’
శత్రుదేశం వ్యూహాలను అరికట్టేందుకు సైన్యం చేసే మెరుపుదాడులనే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రయిక్ అంటారు. ఊహించని సమయంలో, ఊహించని చోట శత్రువులపై మెరుపుదాడి చేసి తేరుకోకముందే దెబ్బకొట్టి తిరిగి రావడమే సర్జికల్ స్ట్రయిక్. కానీ దేశంలో, అంతర్గతంగా పెద్ద నోట్ల రద్దు వంటి ఆకస్మిక మెరుపుదాడికి ప్రభుత్వం దిగడానికి కారణం ఏమిటి? అంటే 2014లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నల్లధనాన్ని నిర్మూలిస్తాననీ, విదేశాల్లో దాచుకున్న దేశ సంపదను వెలికి తీస్తామనీ హామీ ఇచ్చింది. అలా విదేశాలనుంచి వెలికితీసి రప్పించిన నల్లధనం నుంచి దేశంలోని ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల రూపాయల నగదును ఇస్తామని బీజేపీ నాటి ప్రచారంలో అడక్కుండానే వాగ్దానాలు చేసింది. కాని ఇది తప్పుడు ప్రచారమని త్వరలోనే తేలిపోయింది. విదేశాలనుంచి నల్లధనం తీసుకురావడం అసాధ్యమని స్పష్టమైంది. పర్యవసానంగా పాలకపార్టీ 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతింది. దీంతో నల్లధనానికి చెక్ పెట్టడానికి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధక బృందాన్ని నియమించడం, నల్లధనం వెలికితీత పన్ను చట్టం, ఆదాయ ప్రకటన పథకం వంటి పలు చర్యలకు కేంద్రం దిగింది. కానీ ఇవేవీ పనిచేయలేదు. ఒక బిగ్ బ్యాంగ్ లాంటి విస్ఫోటనం అవసరమని స్పష్టమైంది. అదే పెద్ద నోట్ల రద్దు.
ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద నోట్లరద్దు తప్పుడు సలహాల ఫలితం. అది ప్రకటించిన లక్ష్యాలను వేటినీ సాధించలేదు. పైగా నష్టాన్ని గ్రహించి లక్ష్యాలను మార్చుకున్న తర్వాత కూడా ఫలితాలు ఒనగూరలేదు. ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి అది కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కేంద్ర పాలకవర్గం దీన్ని గ్రహించింది కాబట్టే తదనంతర ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు గురించి ప్రచారంలో వాడుకోలేదు. పెద్దనోట్ల రద్దు దేశం ముందు విధాన నిర్ణయ సంక్షోభాన్ని తీసుకొచ్చింది. మహిళలు, రైతులు, కార్మికులు వంటి బలహీన వర్గాలపై తీవ్రప్రభావం చూపింది తప్పితే నల్లధనం వెలికితీతపై అది సాధించింది శూన్యం మాత్రమే.
– సాత్యకి చక్రవర్తి, సీనియర్ కాలమిస్ట్
Comments
Please login to add a commentAdd a comment