1893లో భారతదేశమే నా ఇల్లు అన్న విదేశి మహిళ | special story to Annie Besant | Sakshi
Sakshi News home page

1893లో భారతదేశమే నా ఇల్లు అన్న విదేశి మహిళ

Published Sun, Jan 28 2018 12:37 AM | Last Updated on Sun, Jan 28 2018 12:37 AM

special  story to  Annie Besant - Sakshi

‘‘నేను 1893లో భారతదేశానికి వచ్చాను. అప్పటి నుంచి ఇదే నా ఇల్లు. ఇక్కడ నేను గడిపిన జీవితమంతా ఈ పురాతన దేశం పూర్వకాలంలో అనుభవించిన స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించి పెట్టడానికే పాటుపడ్డాను.’’ అన్నారామె. భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరో గుర్తుందా? ఆమె ఒక బ్రిటిష్‌ వనిత. దేశ చరిత్రలో కీలకమైన సమయంలో1917 నాటి కలకత్తా సమావేశాలకి ఆమె అధ్యక్షత వహించారు. (కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు). ఆమె పేరు అనిబీసెంట్‌. ఐరిష్‌ మూలాలు ఉన్న ఈ బ్రిటిష్‌ వనిత భారతదేశానికీ, స్వాతంత్య్రోద్యమానికీ, సమాజానికీ చేసిన సేవ చిరస్మరణీమయమైనది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బాలగంగాధర తిలక్, లజపతిరాయ్, మహమ్మదలీ జిన్నా, గాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సరోజినీనాయుడులకు ఉన్నంత ఖ్యాతి, ఆకర్షణ అనిబీసెంట్‌కు కూడా ఉండేవి. ఆనాడు కాంగ్రెస్‌ సభ్యత్వం కంటే, అనిబీసెంట్‌ స్థాపించిన హోంరూల్‌ లీగ్‌కు ఎక్కువ సభ్యత్వం ఉండేది. ఎందరో మహామహులు ఆమె నాయకత్వంలో పనిచేశారు.  అనిబీసెంట్‌ ఒక విప్లవ వనిత. పేదరికంలో పుట్టి పెరిగారు. ఐదో ఏటనే తండ్రి మరణించారు. ఆడబిడ్డను పెంచలేక ఆమె తల్లి తనకు తెలిసిన వారికి ఇచ్చి పోషణ ఏర్పాటు చేసింది. అలాంటి వాతావరణంలో ఉన్నా, ఆమె తనదైన ఆలోచనా విధానాన్ని నిర్మించుకున్నారు. మత విశ్వాసాల గురించి పల్లెత్తు మాట అన్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్న కాలంలో ఆమె తన క్రైస్తవ మత విశ్వాసాలను, మతాధికారుల పాత్రను ప్రశ్నించారు. పైగా ఆమె భర్త క్రైస్తవ పురోహిత వర్గానికి (ఆంగ్లికన్‌ చర్చి) చెందినవారు. 

అనిబీసెంట్‌ (అక్టోబర్‌ 1,1847–సెప్టెంబర్‌ 20, 1933)ను ప్రపంచంలో విశిష్ట మహిళగా చరిత్రకారులు గౌరవిస్తారు. బ్రిటిష్‌ జాతిలో రాజకీయ సంస్కరణల కోసం, స్త్రీల హక్కుల కోసం  ఆమె పోరాడారు. ఐర్లాండ్‌కు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా స్వయం పాలన అవసరమేనని ఇంగ్లండ్‌ పాలన మీద చట్టబద్ధమైన ఉద్యమం నడిపారామె. లౌకికవాదం, కార్మికుల హక్కులు, మహిళల హక్కులు, కుటుంబ నియంత్రణ, నిరుద్యోగం ఇవన్నీ కూడా ఆమె చేసిన పోరాటాలలో భాగాలుగా కనిపిస్తాయి. దీనికి తోడు ఆమె మంచి రచయిత్రి. మంచి రచయితలు మంచి వక్తలు కారన్న అపప్రథను వమ్ము చేస్తూ గొప్ప వక్తగా కూడా పేరెన్నికగన్నారు. ఆమె కుటుంబ నియంత్రణ మీద ఉద్యమం ప్రారంభించి, ఫేబియన్‌ సోషలిస్టుగా పనిచేసి, చివరికి దివ్యజ్ఞాన సమాజం దిశగా ప్రయాణించారు. దివ్య జ్ఞాన సమాజం గురించి ప్రపంచమంతటా తిరిగి ప్రచారం చేసే క్రమంలోనే ఆమె 1893లో భారత్‌ వచ్చారు. ఇక్కడి స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి పెంచుకుని, పోరాటంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భరించారు. కడ ఊపిరిని ఈ గడ్డ మీదే విడిచిపెట్టారు. ఆమె అసలు పేరు అనీ ఉడ్‌. లండన్‌లోని క్లాఫామ్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఐదో ఏటనే మరణించారు. ఆపై తల్లి ఒక భోజనశాల ఏర్పాటు చేసి జీవనం సాగించారు. కూతురుని సరిగా పెంచలేక ఇలాన్‌ మేరియట్‌ అనే తన స్నేహితురాలికి అప్పగించారామె. మేరియట్‌ పెంపకం నిజంగానే అనిబీసెంట్‌కు వరమైంది. మంచి విద్య చెప్పించారామె. ఐరోపా అంతా చూపించారు. అప్పుడే అనిబీసెంట్‌ భవిష్యత్తుకు సంబంధించిన చిత్రం రూపుదిద్దుకుంది కూడా. 19వ ఏట అనిబీసెంట్‌ ఫ్రాంక్‌ బీసెంట్‌ అనే ఒక చర్చి మత గురువును పెళ్లి చేసుకుంది. కానీ వివాహం తరువాత పాత ఆలోచనలకు తోడు రాజకీయాల మీదకు ఆమె దృష్టి మళ్లింది. అందులోను ఐరిష్‌ రాడికల్స్‌తో ఆమె పని చేయడం ఆరంభించింది. ఇంకా ఆమెలోని రచయిత్రిని కూడా ఆ ఆలోచనలు తట్టి లేపాయి. కథలు, వ్యాసాలు రాయడం ఆరంభించారు. ఇద్దరు పిల్లలకు తల్లయింది. వారు– మాబెల్‌ బిసెంట్‌ స్కాట్, ఆర్ధర్‌ డిగ్బి బిసెంట్‌. కానీ కుటుంబ నియంత్రణ గురించి ఆమె పుస్తకం రాయడంతో తీవ్రంగా ఆగ్రహించిన భర్త పిల్లలు ఆమె వద్ద పెరగడం సరికాదన్న వాదన తీసుకువచ్చి, విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. అలా వారిద్దరు 1873లో వేరైపోయారు. నిజానికి  ఆంగ్లికన్‌ చర్చికి సంబంధించిన భర్త ఆలోచనలను, అసలు ఆ మత సిద్ధాంతాలను కూడా అనిబీసెంట్‌ ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచే ఆ కాపురం బీటలు వారడం మొదలయింది.  కాయకష్టం చేసుకునే కుటుంబాల వారు ఎక్కువ మంది పిల్లలను కనడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అనిబీసెంట్‌ వాదించారు. పరిమిత కుటుంబంతోనే అలాంటి కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయని కూడా ఆమె సూచించారు. నిజానికి ఈ అంశంతో రాసిన పుస్తకంతో రచయిత్రిగా అనిబీసెంట్‌ పేరు ఇంగ్లండ్‌లో ప్రతి ఇంటిలోను మారుమోగింది. కానీ ఈ పుస్తకం మీద చర్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త నుంచి విడిపోయాక చర్చి మీద విమర్శను తన వ్యాసాల ద్వారా మరింత ఉధృతం చేశారామె. మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఆమె ఆకాంక్షించారు. కానీ ఆమె భర్తకు విడాకులు మాత్రం ఇవ్వలేదు. చివరికంటా శ్రీమతి బిసెంట్‌గానే ఆమె ఉండిపోయింది. 

అనిబీసెంట్‌ రాజకీయ చింతన సోషలిస్టు సంస్థల సాహచర్యంతో విస్తరించింది. కార్మికోద్యమంలో పనిచేసినప్పుడు కొద్దికాలం మార్క్స్‌ భావాలను కూడా విశ్వసించారు. ఐరిష్‌ హోమ్‌ రూలర్స్‌తో ఏర్పడిన అనుబంధం ఆ చింతనకు మరింత పదును తెచ్చింది. ఈ ప్రభావాలతోనే ఐర్లండ్‌ రైతుల కష్టాలను ఏకరువు పెడుతూ, అక్కడి భూస్వాములను ఆమె విమర్శించేవారు. అప్పట్లోనే ‘బ్లడీ సండే’ ఉదంతం జరిగింది. అందుకు ఆమె ప్రత్యక్ష సాక్షి. నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఇంగ్లండ్‌ యువతరం ట్రఫాల్గర్‌ కూడలి దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. 1887లో జరిగిన ఈ ప్రదర్శన సందర్భంగా జరిగిన హింసలో పదుల సంఖ్యలో యువకులు చనిపోయారు. వందలాది మందిని అరెస్టు చేశారు. తరువాత హఠాత్తుగా ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లారు. 1889లో దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆ సంస్థను భారత్‌లో విస్తరించేందుకే ఆమె 1893లో వచ్చారు. ఇది ఆమె జీవితంలో మరో మలుపు. దేశ ప్రజల మధ్య ఐక్యత లేకుండా స్వాతంత్య్రం సాధ్యం కాదనేది ఆమె గ్రహించిన గొప్ప వాస్తవం. ఉద్యమంలో మమేకం కావడం ఆరంభించిన తరువాత ఒక గొప్ప విషయాన్ని  ఆమె ఆంగ్లేయుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కూడా. భారత్‌ స్వయం పాలన కోరుతోంది. వాళ్లకి కావలసింది మీ పాలనలో అలంకారప్రాయంగా ఉండే పదవులు కాదు. మీ పాలనాయంత్రాంగంలో మిగిలిపోవడం అంతకంటే కాదు అని ఆమె తెగేసి చెప్పారు. భారతదేశంలో బ్రిటిష్‌ పాలనను అదుపులో పెట్టాలంటే హిందువులు, ముస్లింల మధ్య ఐక్యత కూడా అవసరమని ఆమె వాస్తవంగానే భావించారు. అలాంటి ఐక్య వాతావరణం మొదటిసారి 1916లో కనిపించింది. ఆ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం– హిందూ ముస్లిం ఐక్యతకు తొలిసారిగా జరిగిన నిజమైన ప్రయత్నం వల్లనే. అప్పుడు ఎంఏ జిన్నా ముస్లింలీగ్‌ అధ్యక్షులు. లీగ్, కాంగ్రెస్‌ కలసి పనిచేసే విధంగా జిన్నా ఒక ఒప్పందాన్ని చేయించారు. ఆ చెలిమిని కొనసాగించడానికి రెండు మూడు సంవత్సరాలు జాతీయ నాయకులంతా విశేషంగా పాటు పడ్డారు. అలాంటి సందర్భంలోనే 1917లో, కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలకు అనిబీసెంట్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. 

భారతదేశంలో ఆమె మూడు ప్రధాన పాత్రలు నిర్వహించారు. ఒకటి జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేయడం. రెండు దివ్యజ్ఞాన సమాజం అండగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకర్త. మూడు విద్యా వ్యాప్తి. కాంగ్రెస్‌తో పనిచేసినప్పుడు భారతీయులలో రాజకీయ చైతన్యానికి సంబంధించిన కోణం ఏ విధంగా ఉండాలో ఆలోచించారామె. పాలనలో భారతీయులకు పరిమిత ప్రమేయమా? లేక స్వయం పాలనా? వీటిలో ఆమె స్వయంపాలన వైపు మొగ్గు చూపారు. కానీ ఆమె సమకాలీనులైన మితవాద కాంగ్రెస్‌ నాయకులు భారతీయులకు కొన్ని హక్కుల దక్కితే చాలునన్న ఆలోచనకే పరిమితమయ్యారు. అది కూడా చట్టబద్ధమైన రీతిలో విన్నపాలు, వినతులతో సాధించుకోవాలన్నదే మితవాదుల దృక్పథం. వీరిని పూర్తిగా వ్యతిరేకించినవారు అతివాదులు. తిలక్‌ అందులో ముఖ్యుడు. ఒకదశలో అనిబీసెంట్‌ తిలక్‌తో కలసి హోంరూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని నడిపారు. దీనికే ఆమెను మద్రాస్‌లో ఇంటర్న్‌మెంట్‌కు గురి చేశారు. ఆమెకు స్వేచ్ఛ కల్పించడం కోసం మొత్తం భారతదేశమే బ్రిటిష్‌ ప్రభుత్వం మీద ఉద్యమం సాగించింది. ఆ క్రమంలో హోంరూల్‌ లీగ్‌లోకి వచ్చిన వారే మోతీలాల్, చిత్తరంజన్‌దాస్, జిన్నా తదితరులు. తరువాత గాంధీజీ ఈ సంస్థను కాంగ్రెస్‌తో కలసి పనిచేసే విధంగా ఒప్పించారు. దివ్యజ్ఞాన సమాజం భారతీయ సమాజం మీద వేసిన ముద్ర అసాధారణమైనది. దాదాపు మూడున్నర దశాబ్దాల కాలం అనిబీసెంట్‌ దివ్యజ్ఞాన సమాజం అధ్యక్ష హోదాలో కొనసాగారు. పలు చోట్ల ఆ సంస్థ పాఠశాలలను నిర్వహించేది. మద్రాస్‌లో సెంట్రల్‌ హిందూ స్కూల్, నేషనల్‌ హైస్కూల్, వసంత మహిళా కళాశాల ఆమె స్థాపించినవే. అలాగే వైద్యశాలలను కూడా ఏర్పాటు చేసేది. దివ్యజ్ఞాన సమాజం తరఫున ఒక విశ్వ గురువును ప్రతిష్టించేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. అప్పటికి ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. జిడ్డు కృష్ణమూర్తిగారిని ఆ విశ్వగురువు పీఠం మీద అధిష్టింపచేయాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ అందుకు ఆయన నిరాకరించడం విశేషం. భారతదేశంలో ఇప్పటికీ ప్రతిష్టాత్మకంగా భావించే కాశీ విశ్వవిద్యాలయం స్థాపనలో మదన్‌ మోహన మాలవీయకు అని బీసెంట్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తరువాత బీహెచ్‌యూ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది కూడా. 1933లో అనిబీసెంట్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మద్రాస్‌ నగరంలోని అడయార్‌లోనే దివ్యజ్ఞాన సమాజం ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. అక్కడే ఆమె పార్ధివదేహాన్ని పూడ్చి పెట్టారు. అడియార్‌ నది ఒడ్డున ఉండే దివ్యజ్ఞాన ఆశ్రమంలో మర్రిచెట్టు ఒక అద్భుతం. విస్తీర్ణంలో దీనికి ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ చెట్టు కిందే అని బీసెంట్‌ ఎందరినో సమావేశ పరిచింది. ఆ చెట్టు నీడన ఆమె ఏర్పాటు చేసిన తేనీటి విందులకు రాజకీయవేత్తలు, కవులు, కళాకారులు, స్త్రీజనోద్ధారకులు, సంస్కర్తలు హాజరయ్యేవారు. నిజం చెప్పాలంటే ఆ మహా మర్రి వలెనే అనిబీసెంట్‌ కీర్తి కూడా భారతీయ సాంస్కృతిక జీవనంలో, రాజకీయ ఉద్యమాలలో పరుచుకుని ఉంది. 
∙డా. గోపరాజు నారాయణరావు

అనిబీసెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement