సోషలిస్టు దిగ్గజం కన్నుమూత  | Socialist giant George Fernandes died | Sakshi
Sakshi News home page

సోషలిస్టు దిగ్గజం కన్నుమూత 

Published Wed, Jan 30 2019 1:56 AM | Last Updated on Wed, Jan 30 2019 5:22 AM

Socialist giant George Fernandes died - Sakshi

న్యూఢిల్లీ:  సోషలిస్ట్‌ దిగ్గజం, ధీరోదాత్త రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌(88) మంగళవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కొంత కాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఫెర్నాండెజ్‌ ఇటీవల స్వైన్‌ ఫ్లూ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం 6.42 గంటలకు ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్‌ మరణ వార్తను ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ నిర్ధారించారు.

అమెరికాలో ఉంటున్న జార్జి ఫెర్నాండెజ్‌ కుమారుడు సియాన్‌ ఫెర్నాండెజ్‌ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఫెర్నాండెజ్‌ పార్థివ దేహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తదితరులు కూడా ఫెర్నాండెజ్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఉదయం ఆరు గంటల సమయంలో మా ఆస్పత్రికి ఫెర్నాండెజ్‌ ఇంటి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్లిన వైద్యుల బృందం ఆయనను పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించింది’ అని మాక్స్‌క్యూర్‌ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.  

జీవితాంతం సోషలిస్ట్‌ నేతగానే.. 
జీవితాంతం సోషలిస్టు భావాలనే నమ్మి ఆచరించిన నేతగా ఫెర్నాండెజ్‌ నిలిచారు. 1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా.. 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా.. 1999లో కార్గిల్‌ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్‌ చరిత్ర పుటల్లో నిలిచారు. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం. 1977లో సామ్యవాదులతో కూడిన జనతాపార్టీ ప్రభుత్వంలో, 1999లో హిందుత్వ వాదులతో కూడిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు.  

నిజాయతీ, నిర్భీతి ఆయన సొంతం: మోదీ 
జార్జి ఫెర్నాండెజ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. ‘జార్జి సాహబ్‌ నిజాయతీపరుడు, నిర్భీతిగల నాయకుడు, నిరాడంబరుడు, వినయశీలి. తను నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను ఎన్నడూ విడనాడలేదు. భారత రాజకీయ నాయకత్వానికి నిజమైన ప్రతినిధి. ఆయన దేశానికి అందించిన సేవలు అమూల్యం. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మంచి కార్మిక నేత, మంత్రిగా సమర్ధవంతమైన సేవలందించారు’ అని ప్రధాని మోదీ శ్లాఘించారు. ‘మాజీ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రి అయిన ఫెర్నాండెజ్‌ జీ మృతి బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

అంత్యక్రియలు అయ్యేవరకు ఉంటా: నితీశ్‌ 
జార్జి ఫెర్నాండెజ్‌ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే ఉంటానని బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఫెర్నాండెజ్‌ మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అనంతరం ఆయన పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఫెర్నాండెజ్‌ తీర్చిదిద్దారని నితీశ్‌ తెలిపారు. 

ఫెర్నాండెజ్‌ పేరు మారుమోగిందిలా.. 
కర్ణాటకలో మంగళూరుకు చెందిన ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్‌ సామ్యవాద భావాల పట్ల ఆకర్షితుడై కార్మిక నేతగా ఎదిగారు. 1975–77 సంవత్సరాల మధ్య ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.  

రెండు విధాలుగా అంత్యక్రియలు 
జార్జి అంత్యక్రియలు లోధి శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ తెలిపారు. ‘ఆయన అంతిమ కోరిక మేరకు రెండు విధాలుగా అంత్యక్రియలు జరుపుతాం. గతంలో పార్థివ దేహాన్ని దహనం చేయాలని ఆయన కోరారు. ఇటీవల మాత్రం ఖననం చేయాలని చెప్పారు. ఆయన అభీష్టం ప్రకారం ఈ రెండింటిని నిర్వర్తిస్తాం. ముందుగా దహనం చేసి, అవశేషాలను ఖననం చేస్తాం’ అని చెప్పారు.

నిత్య పోరాట యోధుడు 
జార్జి ఫెర్నాండెజ్‌ పేరు వినగానే 1974 రైల్వే సమ్మెతోపాటు 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటయోధుడు గుర్తుకొస్తాడు. గోవా మూలాలున్న రోమన్‌ కేథలిక్‌ కుటుంబంలో 1930 జూన్‌ 3న జన్మించిన జార్జిని 16 ఏళ్ల వయసులో క్రైస్తవ మత బోధకునిగా మార్చడానికి ఆయన కుటుంబం బెంగళూరు పంపించింది. శిక్షణ పూర్తయ్యాక ఆయన 1949లో సొంతూరు మంగళూరు నుంచి బొంబాయి వెళ్లి రాజకీయాలను జీవిత మార్గంగా ఎంచుకున్నారు. డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్‌ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు.

అప్పటి బొంబాయి మహా నగరంలో ఈ పార్టీ అనుబంధ కార్మికసంఘం హింద్‌ మజ్దూర్‌ కిసాన్‌ పంచాయత్‌(హెచ్‌ఎంకేపీ)ను ముందుకు నడిపించారు. నిప్పులు చెరిగే ట్రేడ్‌ యూనియన్‌ నేతగా, శ్రామికవర్గాన్ని ఉర్రూతలూగించే వక్తగా జార్జి ఈ నగరంలో అనేక సమ్మెలు, బంద్‌లు విజయవంతంగా నిర్వహించారు. జాన్‌ జోసెఫ్, అలిస్‌ మార్తాల ఆరుగురు కొడుకుల్లో పెద్దవాడైన జార్జి రాజకీయ జీవితాన్ని బొంబాయి గొప్ప మలుపు తిప్పింది.

దక్షిణ బొంబాయి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ప్రముఖ కాంగ్రెస్‌ నేత ఎస్కే పాటిల్‌ను 1967 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ(ఎసెస్పీ) టికెట్‌పై జార్జి ఓడించి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.  అప్పటి నుంచి 2004 వరకూ ఆయన 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–10 మధ్య చివరిసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  

బరోడా డైనమైట్‌ కేసులో జైలు జీవితం 
జార్జి నాయకత్వంలో 1974లో జరిగిన రైల్వే సమ్మె విజయవంతమైంది. ప్రధాని ఇందిరాగాంధీ రైల్వే కార్మికుల్లో చీలికలు తెచ్చి వేలాది మందిని అరెస్ట్‌ చేయించడంతో సమ్మెను విరమించారు. 1975 జూన్‌ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మిగిలిన ప్రతిపక్ష అగ్రనేతల మాదిరిగా అరెస్టు కాకుండా ఫెర్జాండెజ్‌ అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం సాగించారు. చివరికి బరోడా డైనమైట్‌ కేసులో నిందితునిగా 1976 జూన్‌లో కోల్‌కతాలో జార్జి అరెస్టయ్యారు. 1977 జనవరిలో ఎమర్జెన్సీని తొలగించాక ప్రతిపక్ష నేతలందరినీ విడుదల చేసినా జార్జికి బరోడా కేసులో బెయిలు రాలేదు. జైలు నుంచే బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు. మధ్యలో మూడుసార్లు నలందా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1977 ఎన్నికల్లో మొరార్జీదేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, 1989 వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. జనతా పాలనలో జార్జి పట్టుబట్టి అమెరికాకు చెందిన కంపెనీలు కోకాకోలా, ఐబీఎంను దేశంలో మూతవేయించారు. బిహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ జనతాదళ్‌లో పెత్తనానికి నిరసనగా 1994లో బిహార్‌ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సమతాపార్టీ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో 1998–99, 1999–2004 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు.

ఆయన హయాంలోనే కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. రక్షణ శాఖ బడ్జెట్‌ భారీ పెంపునకు కూడా ఆయనే కారకుడు. యుద్ధంలో మరణించిన జవాన్ల కోసం కొనుగోలు చేసిన శవపేటికల కుంభకోణం కారణంగా ఆయన 2004లో రాజీనామా చేశారు. 2004లో ముజఫర్‌పూర్‌ నుంచి చివరిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, 2009లో ఆయనకు జనతాదళ్‌(యూ)టికెట్‌ ఇవ్వలేదు. అదే ఏడాది ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లోనే ఆయన అల్జీమర్స్‌ వ్యాధికి గురయ్యారు. 

కుష్వంత్‌ సింగ్‌లా ఎందుకు మారారు?
దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పోలీసుల కళ్లుగప్పేందుకు జార్జి ఫెర్నాండెజ్‌ కుష్వంత్‌ సింగ్‌ పేరుతో చెలామణీ అయ్యారని ఆయన సహవాసి ఒకరు తెలిపారు.  ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విజయ్‌ నారాయణ్‌ అప్పటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఎమర్జెన్సీని వ్యతిరేకించే వారిని ఇందిర ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఆ నిర్బంధం నుంచి తప్పించు కునేందుకు మేం మారువేషాల్లో తిరిగేవాళ్లం. ఫెర్నాండెజ్‌ సిక్కుగా మారిపోయారు.

తలపాగా ధరించి, జట్టు, గడ్డం పొడుగ్గా పెంచుకుని తన పేరు కుష్వంత్‌ సింగ్‌గా చెప్పుకునేవారు. నేనేమో కాశీకి చెందిన ముస్లిం నేత పనివానిగా మారిపోయా. అలా మేం అజ్ఞాతంలో ఉంటూనే పని కొనసాగించేవాళ్లం. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యమ నేతలకు ఆయన రాసే ఉత్తరాలను నేను రహస్యంగా రైల్వే మెయిల్‌లో పంపిస్తుండేవాణ్ని. మామూలుగానైతే ఫెర్నాండెజ్‌ బిహారీ మాదిరిగా ధోవతీ, కండువా ధరించేవారు’ అని నారాయణ్‌ తెలిపారు. 

అరంగేట్రం ఇలా..
కార్మిక నేతగా గుర్తింపు పొందిన ఫెర్నాండెజ్‌ రాజకీయ అరంగేట్రం మాత్రం ఆసక్తికరం. ముంబై (బాంబే)లోని న్యూ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జార్జ్‌ ఫెర్నాండెజ్‌ కౌన్సిలర్‌గా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్‌ నేత ఎస్కే పాటిల్‌ ముంబైకి మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యేవారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు కూడా ఆయనకే ఉండేది. ఈ నేపథ్యంలో కార్మికవర్గాల మద్దతుతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జార్జి నిర్ణయించారు.  సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌రావ్‌ పాటిల్‌ను కలుసుకుని ‘మీరు బాంబేకు మకుటం లేని మహారాజు కదా.. ఎవరో మున్సిపల్‌ కౌన్సిలర్‌ జార్జ్‌ ఫెర్నాండెజ్‌ మీపై పోటీకి దిగుతున్నాడట.

ఒకవేళ మీరు ఓడిపోతే’ అని ప్రశ్నించారు. దీంతో పాటిల్‌ స్పందిస్తూ..‘ఈ జార్జి ఫెర్నాండెజ్‌ ఎవరు? ఆ దేవుడు కూడా నన్ను ఓడించలేడు’ అని జవాబిచ్చారు. మరుసటి రోజు పత్రికల్లో ఇదే ప్రచురితమైంది. దీన్ని ఆయుధంగా మలుచుకున్న ఫెర్నాండెజ్‌..‘తనను దేవుడు కూడా ఓడించలేడని పాటిల్‌ అంటున్నారు. కానీ ఆయన్ను మీరు (ప్రజలు) ఓడించగలరు’ అని పోస్టర్లు వేయించారు. దీంతో దక్షిణ ముంబై స్థానంలో పాటిల్‌పై 42వేల ఓట్ల మెజారిటీతో జార్జి గెలిచారు.

లైలా కబీర్‌తో వివాహం..జయా జైట్లీతో సహజీవనం 
బెంగాల్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి హుమాయూన్‌ కబీర్‌ కూతురు లైలాను 1971లో జార్జి వివాహమాడారు. వారి ఏకైక కుమారుడు అమెరికాలో ఉన్నారు. 1990లో కుటుంబ విభేదాలతో లైలాకు విడాకులివ్వకుండానే ఆయన విడిగా జీవించడం ప్రారంభించారు. తరువాత కాలంలో సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీతో తన నివాసంలో కలిసి జీవించారు. 2012లో లైలా, ఆమె కుమారుడు జయను ఇంట్లోంచి గెంటి వేయగా, సుప్రీంకోర్టు అనుమతితో ఆమె జార్జిని కలుసుకున్నారు.

కార్మిక నేతగా, చురుకైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడమేగాక మంత్రి పదవిలోని సమయంలో ఆయన హక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. పౌర హక్కుల ఉద్యమాలకు ఆయన మద్దతుగా నిలిచేవారు. డాక్టర్‌ లోహియాతో కలిసి పని చేసిన నేతల్లో ప్రముఖుడైన ఫెర్నాండెజ్‌ మరణంతో భారత రాజకీయాల్లో కీలక శకం ముగిసినట్టయింది. కన్నడం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన జార్జి గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  

ఇంకో జన్మ ఉంటే వియత్నాం పౌరుడిగా! 
మళ్లీ జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటానని జార్జి ఫెర్నాండెజ్‌ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతర్యుద్ధంతో అతలాకుతలం అయినప్పటికీ వియత్నాం భారత్‌ కంటే ముందుకు దూసుకుపోతోందనీ, రాబోయే వందేళ్ల భవిష్యత్‌ గురించి వాళ్లు ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల క్రితం బెంగళూరులోని కర్ణాటక ప్లాంటర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ..‘వియత్నాం ప్రజలు క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం కలిగినవారు.

తమ ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వారు వెనుకాడరు. అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ జోక్యం, అంతర్యుద్ధం కారణంగా 30 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ శరవేగంగా పురోగమిస్తున్న వియత్నాం.. తలసరి ఆదాయంలో భారత్‌ను దాటేస్తోంది.  నేనేమీ అసూయతో మాట్లాడటం లేదు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణమంత్రిని నేనే. మరో జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటా’ అని ఫెర్నాండెజ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement