Former Union Minister
-
‘మురసోలి’ సెల్వమ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు. కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. -
కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ భార్య లక్ష్మీబాయి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం కన్నుమూ శారు. లక్ష్మీబాయి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ఆమె తండ్రి వృత్తిరీత్యా ఒడిశాకు మారారు. ఒడిశాలో మొదటి గ్రాడ్యుయేట్...ఒడిశా రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ లక్ష్మీబాయి. ఆమె ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పోస్టల్ కోర్సు ద్వారా ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. 1955లో పి.శివశంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు మధ్యలో రెండు పీహెచ్డీ డాక్టరేట్లు సాధించారు. ఆమె చేసిన పీహెచ్‌డీల్లో ఒక దానికి బంగారు పతకంతోపాటు జీవిత సాఫల్య పురస్కారం లభించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్ ’’భగవద్గీత, ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’పై 5,000 పేజీల ప్రవచనం. ఇది ఆమె పూర్తిగా చేతితో రాసిన వ్రాత ప్రతిని యూనివర్సిటీకి సమర్పించారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ వినయ్. కాగా, డా.లక్ష్మీబాయి మృతిపట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. -
బీజేపీకి భారీ షాక్..కాంగ్రెస్‌లోకి మాజీ కేంద్ర మంత్రి
లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు బ్రిజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చేరిన దాదాపు నెల రోజుల తర్వాత బీరేందర్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య, హర్యానా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ లత కూడా బీజేపీని వీడారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీరేందర్ సింగ్ మాట్లాడుతూ..‘నేను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. నా రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపాను. 2014-2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన నా భార్య ప్రేమ్ లత కూడా రాజీనామా చేశారు. రేపు, మేం కాంగ్రెస్‌లో చేరనున్నాం’ అని అన్నారు. కాగా, బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేందర్ సింగ్ మార్చి 10న కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా, తండ్రి సైతం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది. -
రాజకీయాలకు గుడ్‌బై బీజేపీ ఎంపీ హర్షవర్ధన్
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలిజాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్.హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పరిధిలోని చాంద్‌నీచౌక్ స్థానం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం బీజేపీ విడుదలచేసిన తొలి జాబితాలో ఈయన పేరు లేదు. అందుకే ఈయన రాజకీయాలను వదిలేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘ 50 ఏళ్ల క్రితం కాన్పూర్‌లో ఎంబీబీఎస్‌లో చేరా. పేదలకు సేవచేశా. 30 ఏళ్ల పైబడిన రాజకీయ జీవితంలో ఐదు సార్లు శాసనసభ, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచా. మళ్లీ ఇన్నాళ్లకు నా మూలాల్లోకి వెళ్లిపోతా’’ అన్నారు. ఢిల్లీ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు పర్వేశ్ శర్మ, రమేశ్ బిధూరి, మీనాక్షి లేఖీ, హర్‡్షవర్ధన్లను కాదని కొత్త వారికి బీజేపీ అవకాశమిస్తూ వారి పేర్లను తొలి అభ్యర్థుల జాబితాల చేర్చడం తెల్సిందే. నేను పోటీచేయలేను: పవన్ సింగ్ పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ ఎంపీ స్థానం నుంచి తనను బీజేపీ అభ్యరి్థగా నిలబెట్టినప్పటికీ తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ నేత పవన్ సింగ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ‘‘ నేనైతే పోటీ నుంచి వైదొలగుతున్నా. ఎందుకు పోటీ చేయట్లేను అనే కారణాలను వెల్లడించలేను’ అని భోజ్‌పురీ గాయకుడు, నటుడు అయిన పవన్ సింగ్ స్పష్టంచేశారు. అసన్సోల్లో బీజేపీ ముందే ఓడిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవాచేసింది. -
స్టాలిన్‌కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి జగదీశన్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 1947లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష్మి జగదీశన్.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. -
కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్ రామ్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. 94 ఏళ్ల సుఖ్ రామ్ మే 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మే 7న న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ.. సుఖ్ రామ్‌తో కలిసి తన చిన్ననాటి ఫోటోను కూడా శర్మ పోస్ట్ చేశాడు. అయితే, ఆయన ఎప్పుడు తుది శ్వాస విడిచారు అని పోస్ట్‌లో పేర్కొనలేదు. మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్రామ్ మూడు సార్లు, విధాన సభ నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. -
ఇంట్లో పనిచేసే రాజు స్కెచ్.. రాత్రి ఇంటికి వచ్చి.. డోర్ కొట్టి
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమెను చంపేశారు. కుమారమంగళం ఇంట్లో ధోబీగా(చాకలి) పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు రాజు కిట్టి కుమారమంగళం ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ మోగడంతో పనిమనిషి తలుపు తీయగా.. వెంటనే ఆమెపై మత్తుమందు చల్లి ఓ గదిలో పడేశాడు. అదే సమయంలో, మరో ఇద్దరు యువకులు కిట్టి కుమారమంగళం గదిలోకి వెళ్లి.. ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో... స్పృహ కోల్పోయిన రెండు గంటల తర్వాత మెలకువలోకి వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేయగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిట్టి కుమారమంగళం చనిపోయినట్లు గుర్తించారు. పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా.. ధోబి రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక కిట్టి కుమారమంగళంలోని విలువైన వస్తువులు, డబ్బు దొంగతనం చేసే క్రమంలో వారు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో(1998-2001) పి. రంగరాజన్ కుమారమంగళం కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. -
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. -
పీవీకి ఆప్తుడు.. కేంద్ర మాజీ మంత్రి కరోనాతో కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కదనోత్సహంతో దరిమిలా వ్యాప్తిస్తుండగా సామాన్యుడితో పాటు ప్రముఖులు కూడా మృత్యువాత పడుతున్నారు. గురువారం ఉదయం ఆర్జేడీ అధినేత అజిత్‌సింగ్ కరోనాతో మృతి చెందగా సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి మాతాంగ్ సిన్హ్ కరోనాతో కన్నుమూశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు మాతాంగ్ సిన్హ్ అత్యంత ఆప్తుడు. అస్సాంకు చెందిన మాతాంగ్ సిన్హ్ 1992లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పీవీ నరసింహారావు హయాంలో 1994 నుంచి 98 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో పీవీకి దగ్గరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మాతాంగ్ సిన్హ్ పీవీ నరసింహారావుకు ఆప్తుడు. ఏప్రిల్ 22వ తేదీన కరోనా బారినపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. సిన్హ్‌ను అస్సాంలో గుర్తుపట్టని వారంటూ ఎవరూ ఉండరు. సిన్హ్ మొదట బొగ్గు వ్యాపారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అస్సాంలో తొలిసారిగా 2013లో శాటిలైట్ ద్వారా టీవీ ఛానెల్ (నార్త్ఈస్ట్ విజన్-ఎన్‌ఈటీవీ)ను 2003లో ప్రారంభించాడు. సిన్హ్‌ను శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో పాత్ర ఉందని ఆరోపిస్తూ సీబీఐ 2015 జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు -
జశ్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్ సెప్టెంబర్ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్ సింగ్ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్ సింగ్ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ పేర్కొన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ 1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్‌గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్ స్వామి (90) కన్నుమూశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు.1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించిన ఐడీ స్వామి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వెలిబుచ్చారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు.ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గతవారంమే స్వామి భార్య పద్మ కన్నుమూశారు. -
రెబెల్ న్యాయవాది
కొందరు ప్రశ్నించడానికే పుట్టినట్టుంటారు. ఎంతటివారినైనా నిలదీస్తారు. ఆ క్రమంలో ఎంత పరుషంగా మాట్లాడటానికైనా సిద్ధపడతారు. అవతలివారిని ఇరకాటంలోకి నెడతారు. అందుకే వారిని చూస్తే అధికార పీఠాలు వణుకుతాయి. ఆదివారం ఉదయం కన్నుమూసిన సుప్రసిద్ధ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ ఆ కోవకు చెందిన అరుదైన వ్యక్తి. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట అక్షరసత్యం. 2015లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా కెవి చౌదరి నియామకం జరిగినప్పుడు ‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎంతమాత్రం అనుకోలేదు. మీపై క్రమేపీ తగ్గుతూ వస్తున్న గౌరవం, ఇవాళ్టితో పూర్తిగా అడుగంటింది’ అని మోదీకి ఘాటైన లేఖరాసినా...‘మీరు విశ్వాసఘాతకులు. నాకు కృతజ్ఞతగా ఉండాల్సిన మీరు శత్రువుగా మారి వంచకులతో చేతులు కలిపారు’ అంటూ బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అడ్వాణీపై నిప్పులు చెరిగినా...మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అధికారంలో ఉండగా ఆయనకు బోఫోర్స్‌పై రోజుకు పది ప్రశ్నలతో లేఖలు సంధిం చినా అది రాంజెఠ్మలానీకే చెల్లుతుంది. ఆ లేఖల గురించి ఒకరు ప్రస్తావించినప్పుడు రాజీవ్‌గాంధీ సహనం కోల్పోయి, ‘అరిచే ప్రతి కుక్కకూ జవాబివ్వాల్సిన అవసరం లేద’ని ఈసడిం చగా...‘అవును నేను కుక్కనే. ఈ ప్రజాస్వామ్యానికి కావలి కుక్క’ను అని రాంజెఠ్మలానీ తడుము కోకుండా ప్రత్యుత్తరమిచ్చారు. పదవుల పంపకం జరిగినప్పుడల్లా అవి దక్కనివారు అలగటం, నిష్టూరంగా మాట్లాడటం ఇంచుమించు అన్ని పార్టీల్లో గమనిస్తాం. ఆ ధోరణి జెఠ్మలానీలో కూడా కనబడుతుంది. అయితే ఆయన అలక విలక్షణమైనది. ముందూ మునుపూ ‘పనికొస్తుంద’ని ఏ విషయం దాచుకోవడం అంటూ ఉండదు. తాను ఏం ఆశించాడో, ఎందుకు ఆశించాడో చెప్పడంతోపాటు... నాయకుడు తన నెలా నట్టేట ముంచాడో కుండబద్దలు కొట్టడం జెఠ్మలానీ ప్రత్యేకత. ఆయన కాంగ్రెస్ మొదలుకొని అన్ని పార్టీల్లోనూ చేరారు. ఇంచుమించు అంతే వేగంగా బయటికొచ్చారు. రాజ్యసభ సభ్యత్వమో, మరొకటో ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినప్పుడు నిప్పులు చెరగడం జెఠ్మలానీకి రివాజు. అలా అని ఆయన్ను సగటు రాజకీయ నాయకుడిగా భావించలేం. అనుకున్న పదవి దక్కి నిక్షేపంగా ఉన్నప్పుడు సైతం ఆయన మౌనంగా, ప్రశాంతంగా గడిపిన సందర్భం లేదు. అటల్ బిహారీ వాజపేయి కేబినెట్లో న్యాయ శాఖమంత్రి ఉంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఏఎస్ ఆనంద్‌కు వ్యతిరేకంగా ప్రకటన చేసి జెఠ్మలానీ పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం 2004లో ఆయన వాజపేయిపైనే లక్నో నియోజకవర్గం నుంచి పోటీచేశారు. బీజేపీలో ఉంటూనే 2012లో అప్పటి అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖరాస్తూ యూపీఏ ప్రభుత్వ అవినీతిపై పార్టీ నేతలెవరూ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీయడంతో ఆగ్రహించిన పార్టీ ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరించగా, పార్టీపైనే పరువు నష్టం దావా వేశారు. ఆ సందర్భంలోనే అడ్వాణీపై నిప్పులు చెరిగారు. ఆయనే ఇతరులతో చేతులు కలిపి తన బహిష్కరణకు కారణమయ్యారని విమర్శించారు. జైన్ హవాలా కేసులో వాదించి ఆయన్ను నిర్దోషిగా నిరూపిస్తే, ఇది అడ్వాణీ చేసిన ప్రత్యుపకారమని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఆయన మౌనంగా లేరు. రోజూ ఆయన చేసే పదునైన విమర్శలను తట్టుకోలేని ఇందిర ప్రభుత్వం ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేస్తే దానిపై బొంబాయి హైకోర్టు స్టే విధించింది. అనంతరం ఆయన కెనడా వెళ్లి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దాన్ని తొలగించాకే దేశంలో అడుగుపెట్టారు. క్రిమినల్ కేసులు స్వీకరించడంలోనైనా, వాటిని వాదించడంలోనైనా జెఠ్మలానీ వ్యవహారశైలి ఎవరి ఊహకూ అందేది కాదు. సాక్షుల్ని క్రాస్ ఎగ్జామ్ చేయడంలో ఆయన సాటి దేశంలోనే మరెవరూ లేరంటారు. దాని వెనకున్న రహస్యాన్ని ఆయనొకసారి చెప్పారు. కక్షిదారు చెబుతున్న అంశాలపైనే ఆధారపడినా, కేవలం చట్టనిబంధనలు చదువుకు వెళ్లినా అనుకున్న ఫలితం రాదని... స్వయంగా ఘటనా స్థలానికెళ్లి సొంతంగా పరిశోధించి జరిగిందేమిటో తెలుసుకున్నప్పుడే ఏ కేసునైనా సమర్థవంతంగా వాదించగలుగుతామన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఏడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో గడించిన అపారానుభవం నుంచి చెప్పిన మాటలవి. దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఒక రూపం సంతరించుకోవడంలో జెఠ్మలానీ పాత్ర ఎనలేనిది. ఆయన వాదించిన కేసులు చూస్తే జెఠ్మలానీ విలక్షణ శైలి అర్ధమవుతుంది. 70వ దశకంలో పేరుమోసిన స్మగ్లర్ హాజీ మస్తాన్ మొదలుకొని 90లనాటి హర్షద్ మెహతా, కేతన్ పారిఖ్ వంటి స్టాక్ మార్కెట్ స్కాం నిందితుల వరకూ...ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులు, పార్లమెంటుపై దాడి కేసులో ఉన్న అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ జిలానీ వరకూ జెఠ్మలానీ స్వీకరించిన కేసులన్నీ దిగ్భ్రాంతిపరిచేవే. ఈ కేసుల్లో ఆయన మొక్కుబడిగా వాదించడం కాదు... తన వాదనా పటిమతో ఆ కేసుల్లోని బహుముఖ కోణాలను విప్పి చెప్పి, నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి చేసే ప్రయత్నాలు న్యాయమూర్తులనే అబ్బురపరిచేవి. సమాజం గీసే లక్ష్మణరేఖలు ఎప్పుడూ జెఠ్మలా నీని నివారించలేకపోయాయి. ఈ కేసుల్లోని నిందితులు జాతి వ్యతిరేకులని, దేశద్రోహులని, వారి తరఫున వాదించినవారూ ద్రోహులేనని గుండెలు బాదుకుంటున్నవారిని చూసి ఆయన జాలిపడి ఊరుకునేవారు. నేర నిరూపణ జరిగేవరకూ ఏ కేసులోని నిందితులైనా నిరపరాధులేనన్నది ఆయన నిశ్చిత భావన. సంపన్న కక్షిదారుల నుంచి ఫీజు రూపంలో భారీగా వసూలు చేయడం, నిస్సహాయ కక్షిదారుల తరఫున ఉచితంగా వాదించడం జెఠ్మలానీ ఎంచుకున్న విధానం. ఆయన జీవిత చరిత్ర పుస్తకం పేరు ‘తిరుగుబాటుదారు’. జెఠ్మలానీ చివరి వరకూ అలాగే జీవించారు. -
జెఠ్మలానీ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎంతో క్లిష్టమైన క్రిమినల్ కేసులతోపాటు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ తెలిపారు. జెఠ్మలానీ నలుగురు సంతానంలో ఇద్దరు చనిపోగా కుమారుడు మహేశ్, కుమార్తె శోభ ఉన్నారు. ఆయన మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబసభ్యుల కు సానుభూతి తెలిపారు. జెఠ్మలానీ అంత్యక్రియ లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన కుమారుడు మహేశ్ చితికి నిప్పంటించారు. కరాచీలో 17 ఏళ్లకే లా పట్టా 1923 సెప్టెంబర్ 14వ తేదీన సింథ్(పాకిస్తాన్)లోని షికార్పూర్లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు. అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి చేరుకున్నారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగానూ పేరు.. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో కేసు వేశారు. అనంతరం ఆ కేసును జెఠ్మలానీ ఉపసంహరించుకున్నారు. న్యాయ నిపుణుడిని కోల్పోయాం: రాష్ట్రపతి ‘రామ్ జెఠ్మలానీ మృతి విచారకరం. ఆయన తన వాక్పటిమతో ప్రజా సమస్యలపై పోరాడారు. గొప్ప న్యాయ నిపుణుడిని దేశం కోల్పోయింది’అని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ. న్యాయ వ్యవస్థకు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజం జెఠ్మలానీ. అటువంటి విశిష్టమైన వ్యక్తిని దేశం కోల్పోయింది’అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ జెఠ్మలానీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసిన జెఠ్మలానీ ఉన్నతమైన వ్యక్తిగా గుర్తుండిపోతారని జగన్ పేర్కొన్నారు. కేసులతో వార్తల్లోకి.. సుదీర్ఘ వృత్తి జీవితంలో ఆయన చేపట్టని అంశం లేదు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్ల తరఫున కూడా వాదించారు. దేశంలో ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన జెఠ్మలానీ.. పలు ప్రతిష్టాత్మక క్రిమినల్ కేసుల్లో నిందితుల పక్షాన వాదించడం వివాదాస్పదం అయింది. ఇందిరాగాంధీ హత్య కేసులో, అనంతరం రాజీవ్ హత్య కేసులో నిందితుల పక్షాన నిలబడ్డారు. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల కేసుల్లోనూ ఆయన వాదించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జిలానీ తరఫున వాదనలు వినిపించారు. విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్ వేశారు. హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా తరఫున వాదించారు. దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున వాదించారు. 2013లో మైనర్‌పై రేప్ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు. -
స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం
సాక్షి, లక్నో: కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి స్వామి చిన్మయానంద్‌పై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. షాజహన్‌పూర్‌కు చెందిన లా విద్యార్థిని ఆ కాలేజీ డైరెక్టర్ కూడా అయిన చిన్మయానంద్‌పై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. తనను కూడా బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఎల్ఎల్ఎం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా) విద్యార్థిని ఫేస్బుక్ లైవ్ చేసింది. ఆ సన్యాసి రూపంలో ఉన్న ఆయన పోలీసు ఉన్నతాధికారులు తన చెప్పు చేతల్లో పెట్టుకుని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తూ వుంటాడని వాపోయింది. అయితే తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందని కూడా కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం (శనివారం నుంచి) ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లోని స్వామి సుఖదేవానంద న్యాయ కళాశాలలో బాధిత విద్యార్థిని చివరి సంవత్సరం చదువుతోంది. మరోవైపు కాలేజీ హాస్టల్నుంచి తమ కుమార్తె అదృశ్యమైందనీ, చిన్మయానందే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు షాజహన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎప్పుడూ తనతో చెప్పలేదనీ, అయితే రక్షాబంధన్‌కు ఇంటికి వచ్చినపుడు ఆందోళనగా కనిపించిందని ఆమె తండ్రి చెప్పారు. ఇది ఇలా వుంటే రూ .5 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులనుంచి కాల్ వచ్చిందంటూ స్వామి చిన్మయానంద్ మద్దతుదారులు, కాలేజీ యాజమాన్యం కూడా కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన చిన్మయానంద్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో (1999-2004) కేంద్రమంత్రిగా ఉన్నారు. అఇయతే, 2011 నవంబరులో ఆయన ఆశ్రమంలోని యువతి ఆరోపణల నేపథ్యంలో దాడి, రేప్, బలవంతం అబార్షన్, హత్యాప్రయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే ఏడేళ్ల తరువాత గత ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసును ఎత్తివేస్తూ యోగి సర్కారు సంచలన నిర్ణయం తీసుకోగా, దీనికి వ్యతిరేకంగా బాధితురాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. -
జైట్లీకి కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కైలాస్ కాలనీలోని స్వగృహం నుంచి దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు అక్కడే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్ష్‌వర్థన్, ప్రకాశ్ జవడేకర్, పీయూష్ గోయెల్, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలపాటు పార్థివ దేహం వద్ద మౌనంగా నిలుచుండి పోయారు. మధ్యాహ్నం ప్రత్యేక శకటంలో జైట్లీ పార్థివ దేహాన్ని నిగమ్‌బోధ్ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్రలో ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్ బిర్లా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుసహా అశేష సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠిస్తుండగా జైట్లీ కుమారుడు రోహన్ చితికి నిప్పంటించారు. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ..జైట్లీకి ఉద్వేగపూరిత నివాళులర్పించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ వస్తువులపై మక్కువ కుర్తా పైజామాతో అందరికీ ఆత్మీయుడిగా కనిపించే అరుణ్ జైట్లీకి లండన్‌లో తయారయ్యే షర్టులు, జాన్ కాబ్ షూస్ వంటి బ్రాండెడ్ వస్తువులంటే విపరీతమైన మక్కువనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయ వేత్తగా, ప్రముఖ లాయర్‌గా అందరికీ సుపరిచితుడైన జైట్లీకి బ్రాండెడ్ వాచీలు, పెన్నులు, శాలువాలు, షర్టులు, ఇంకా షూలు సేకరించడం హాబీ. ఆయన వాడే వాటిల్లో ప్రఖ్యాత పటేక్ ఫిలిప్స్(వాచీలు), మాంట్ బ్లాంక్ (పెన్నులు) ఉన్నాయి. జైట్లీ అభిరుచులపై కుంకుమ్ చద్దా రాసిన ‘ది మారిగోల్డ్ స్టోరీ’ పుస్తకంలోని అరుణ్‌జైట్లీ: ది పైడ్ పైపర్ అనే చాప్టర్లో వివరంగా ఉంది. ‘చాలా మంది భారతీయులకు ఒమెగా వాచీలకు మించి తెలియని రోజుల్లోనే జైట్లీ చాలా ఖరీదైన పటేక్ ఫిలిప్స్ వాచీలను కొనేవారు. మాంట్ బ్లాంక్ పెన్నులు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి మోడల్‌నూ కొనేవారు. ఇంకా జమవార్ షాల్స్‌ను సేకరించేవారు. ఆయన తన కుమారుడికి కొని పెట్టిన మొదటి షూ జత ఇటాలియన్ బ్రాండ్ సల్వటోర్ ఫెర్రాగమో’ అని చద్దా పేర్కొన్నారు. అలాగే, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తనకంటూ కొన్ని నియమాలను విధించుకున్నారు. లాయర్‌గా తను తీసుకునే ఫీజు కాకుండా క్లర్కులకు ‘మున్షియానా’(ఫీజు)కూడా అందేలా చూసేవారు. ఈ విధానం ఆయన తోటి వారికి నచ్చకపోయినా అరుణ్ తన విధానానికే కట్టుబడి ఉన్నారు’ అని జైట్లీ సతీమణి సంగీత తెలిపారని చద్దా తన పుస్తకంలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనల్లోనూ వెంట ఉండే వారి ఖర్చులు తనే భరించేవారని ఆమె తెలిపారన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల సందర్భంగా రాకపోకల కోసం విదేశీ కంపెనీల ప్రతినిధులు కార్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామన్నా అంగీకరించేవారు కాదని పేర్కొన్నారు. -
అందరివాడు
రాజకీయాల్లో అందరి మనసులూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్‌జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్‌లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు. వాదనలో పదునెక్కువ గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్ రామ్‌జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. తెరవెనుక వ్యూహకర్త జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు. ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నిక కాలేదు... ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు. మోదీకి ప్రధాన మద్దతుదారు వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్ సీఎంగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీతో.. క్రికెట్ అంటే ప్రాణం న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వైఎస్సార్సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి
-
వైఎస్సార్సీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ) చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు.. వైఎస్ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
కాంగ్రెస్ పార్టీకి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజీనామా
-
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షాక్
సాక్షి, విజయనగరం : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో మిత్రులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. రాజీనామా పత్రాన్ని శనివారమే పార్టీ అధిష్టానానికి పంపానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని అన్నారు. కాంగ్రెస్ రూపొందించిన ఏపీ విభజన చట్టంలో లోపాలున్నాయని విమర్శించారు. పార్టీలో తనలాంటి సీనియర్లకు గౌరవం లేదని వాపోయారు. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనతో దేశం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. బీజేపీతో కలిసి ఉండే పార్టీలోకి వెళ్లనని చెప్పారు. -
సోషలిస్టు దిగ్గజం కన్నుమూత
న్యూఢిల్లీ: సోషలిస్ట్ దిగ్గజం, ధీరోదాత్త రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్(88) మంగళవారం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కొంత కాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఫెర్నాండెజ్ ఇటీవల స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం 6.42 గంటలకు ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మరణ వార్తను ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ నిర్ధారించారు. అమెరికాలో ఉంటున్న జార్జి ఫెర్నాండెజ్ కుమారుడు సియాన్ ఫెర్నాండెజ్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఫెర్నాండెజ్ పార్థివ దేహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు కూడా ఫెర్నాండెజ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘ఉదయం ఆరు గంటల సమయంలో మా ఆస్పత్రికి ఫెర్నాండెజ్ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్లిన వైద్యుల బృందం ఆయనను పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించింది’ అని మాక్స్‌క్యూర్ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. జీవితాంతం సోషలిస్ట్ నేతగానే.. జీవితాంతం సోషలిస్టు భావాలనే నమ్మి ఆచరించిన నేతగా ఫెర్నాండెజ్ నిలిచారు. 1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా.. 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా.. 1999లో కార్గిల్ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్ చరిత్ర పుటల్లో నిలిచారు. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం. 1977లో సామ్యవాదులతో కూడిన జనతాపార్టీ ప్రభుత్వంలో, 1999లో హిందుత్వ వాదులతో కూడిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. నిజాయతీ, నిర్భీతి ఆయన సొంతం: మోదీ జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. ‘జార్జి సాహబ్ నిజాయతీపరుడు, నిర్భీతిగల నాయకుడు, నిరాడంబరుడు, వినయశీలి. తను నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను ఎన్నడూ విడనాడలేదు. భారత రాజకీయ నాయకత్వానికి నిజమైన ప్రతినిధి. ఆయన దేశానికి అందించిన సేవలు అమూల్యం. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం గట్టిగా పోరాడారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మంచి కార్మిక నేత, మంత్రిగా సమర్ధవంతమైన సేవలందించారు’ అని ప్రధాని మోదీ శ్లాఘించారు. ‘మాజీ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రి అయిన ఫెర్నాండెజ్ జీ మృతి బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంత్యక్రియలు అయ్యేవరకు ఉంటా: నితీశ్ జార్జి ఫెర్నాండెజ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే ఉంటానని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫెర్నాండెజ్ మృతికి సంతాప సూచకంగా రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అనంతరం ఆయన పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఫెర్నాండెజ్ తీర్చిదిద్దారని నితీశ్ తెలిపారు. ఫెర్నాండెజ్ పేరు మారుమోగిందిలా.. కర్ణాటకలో మంగళూరుకు చెందిన ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన జార్జి ఫెర్నాండెజ్ సామ్యవాద భావాల పట్ల ఆకర్షితుడై కార్మిక నేతగా ఎదిగారు. 1975–77 సంవత్సరాల మధ్య ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. రెండు విధాలుగా అంత్యక్రియలు జార్జి అంత్యక్రియలు లోధి శ్మశానవాటికలో జరుగుతాయని ఆయన సన్నిహితురాలు జయా జైట్లీ తెలిపారు. ‘ఆయన అంతిమ కోరిక మేరకు రెండు విధాలుగా అంత్యక్రియలు జరుపుతాం. గతంలో పార్థివ దేహాన్ని దహనం చేయాలని ఆయన కోరారు. ఇటీవల మాత్రం ఖననం చేయాలని చెప్పారు. ఆయన అభీష్టం ప్రకారం ఈ రెండింటిని నిర్వర్తిస్తాం. ముందుగా దహనం చేసి, అవశేషాలను ఖననం చేస్తాం’ అని చెప్పారు. నిత్య పోరాట యోధుడు జార్జి ఫెర్నాండెజ్ పేరు వినగానే 1974 రైల్వే సమ్మెతోపాటు 1975 ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటయోధుడు గుర్తుకొస్తాడు. గోవా మూలాలున్న రోమన్ కేథలిక్ కుటుంబంలో 1930 జూన్ 3న జన్మించిన జార్జిని 16 ఏళ్ల వయసులో క్రైస్తవ మత బోధకునిగా మార్చడానికి ఆయన కుటుంబం బెంగళూరు పంపించింది. శిక్షణ పూర్తయ్యాక ఆయన 1949లో సొంతూరు మంగళూరు నుంచి బొంబాయి వెళ్లి రాజకీయాలను జీవిత మార్గంగా ఎంచుకున్నారు. డాక్టర్ రాంమనోహర్ లోహియా నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరి కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి బొంబాయి మహా నగరంలో ఈ పార్టీ అనుబంధ కార్మికసంఘం హింద్ మజ్దూర్ కిసాన్ పంచాయత్(హెచ్‌ఎంకేపీ)ను ముందుకు నడిపించారు. నిప్పులు చెరిగే ట్రేడ్ యూనియన్ నేతగా, శ్రామికవర్గాన్ని ఉర్రూతలూగించే వక్తగా జార్జి ఈ నగరంలో అనేక సమ్మెలు, బంద్‌లు విజయవంతంగా నిర్వహించారు. జాన్ జోసెఫ్, అలిస్ మార్తాల ఆరుగురు కొడుకుల్లో పెద్దవాడైన జార్జి రాజకీయ జీవితాన్ని బొంబాయి గొప్ప మలుపు తిప్పింది. దక్షిణ బొంబాయి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ప్రముఖ కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌ను 1967 సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ(ఎసెస్పీ) టికెట్‌పై జార్జి ఓడించి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2004 వరకూ ఆయన 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009–10 మధ్య చివరిసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. బరోడా డైనమైట్ కేసులో జైలు జీవితం జార్జి నాయకత్వంలో 1974లో జరిగిన రైల్వే సమ్మె విజయవంతమైంది. ప్రధాని ఇందిరాగాంధీ రైల్వే కార్మికుల్లో చీలికలు తెచ్చి వేలాది మందిని అరెస్ట్ చేయించడంతో సమ్మెను విరమించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మిగిలిన ప్రతిపక్ష అగ్రనేతల మాదిరిగా అరెస్టు కాకుండా ఫెర్జాండెజ్ అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం సాగించారు. చివరికి బరోడా డైనమైట్ కేసులో నిందితునిగా 1976 జూన్‌లో కోల్‌కతాలో జార్జి అరెస్టయ్యారు. 1977 జనవరిలో ఎమర్జెన్సీని తొలగించాక ప్రతిపక్ష నేతలందరినీ విడుదల చేసినా జార్జికి బరోడా కేసులో బెయిలు రాలేదు. జైలు నుంచే బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే స్థానం నుంచి ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు. మధ్యలో మూడుసార్లు నలందా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1977 ఎన్నికల్లో మొరార్జీదేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, 1989 వీపీ సింగ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. జనతా పాలనలో జార్జి పట్టుబట్టి అమెరికాకు చెందిన కంపెనీలు కోకాకోలా, ఐబీఎంను దేశంలో మూతవేయించారు. బిహార్ సీఎం లాలూ ప్రసాద్ జనతాదళ్‌లో పెత్తనానికి నిరసనగా 1994లో బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సమతాపార్టీ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాల్లో 1998–99, 1999–2004 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. రక్షణ శాఖ బడ్జెట్ భారీ పెంపునకు కూడా ఆయనే కారకుడు. యుద్ధంలో మరణించిన జవాన్ల కోసం కొనుగోలు చేసిన శవపేటికల కుంభకోణం కారణంగా ఆయన 2004లో రాజీనామా చేశారు. 2004లో ముజఫర్‌పూర్ నుంచి చివరిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే, 2009లో ఆయనకు జనతాదళ్(యూ)టికెట్ ఇవ్వలేదు. అదే ఏడాది ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లోనే ఆయన అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారు. కుష్వంత్ సింగ్లా ఎందుకు మారారు? దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పోలీసుల కళ్లుగప్పేందుకు జార్జి ఫెర్నాండెజ్ కుష్వంత్ సింగ్ పేరుతో చెలామణీ అయ్యారని ఆయన సహవాసి ఒకరు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విజయ్ నారాయణ్ అప్పటి ఘటనలను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఎమర్జెన్సీని వ్యతిరేకించే వారిని ఇందిర ప్రభుత్వం అరెస్టు చేస్తోంది. ఆ నిర్బంధం నుంచి తప్పించు కునేందుకు మేం మారువేషాల్లో తిరిగేవాళ్లం. ఫెర్నాండెజ్ సిక్కుగా మారిపోయారు. తలపాగా ధరించి, జట్టు, గడ్డం పొడుగ్గా పెంచుకుని తన పేరు కుష్వంత్ సింగ్‌గా చెప్పుకునేవారు. నేనేమో కాశీకి చెందిన ముస్లిం నేత పనివానిగా మారిపోయా. అలా మేం అజ్ఞాతంలో ఉంటూనే పని కొనసాగించేవాళ్లం. వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యమ నేతలకు ఆయన రాసే ఉత్తరాలను నేను రహస్యంగా రైల్వే మెయిల్లో పంపిస్తుండేవాణ్ని. మామూలుగానైతే ఫెర్నాండెజ్ బిహారీ మాదిరిగా ధోవతీ, కండువా ధరించేవారు’ అని నారాయణ్ తెలిపారు. అరంగేట్రం ఇలా.. కార్మిక నేతగా గుర్తింపు పొందిన ఫెర్నాండెజ్ రాజకీయ అరంగేట్రం మాత్రం ఆసక్తికరం. ముంబై (బాంబే)లోని న్యూ మున్సిపల్ కౌన్సిల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కౌన్సిలర్‌గా ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ ముంబైకి మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యేవారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల మద్దతు కూడా ఆయనకే ఉండేది. ఈ నేపథ్యంలో కార్మికవర్గాల మద్దతుతో 1967 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జార్జి నిర్ణయించారు. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్రావ్ పాటిల్‌ను కలుసుకుని ‘మీరు బాంబేకు మకుటం లేని మహారాజు కదా.. ఎవరో మున్సిపల్ కౌన్సిలర్ జార్జ్ ఫెర్నాండెజ్ మీపై పోటీకి దిగుతున్నాడట. ఒకవేళ మీరు ఓడిపోతే’ అని ప్రశ్నించారు. దీంతో పాటిల్ స్పందిస్తూ..‘ఈ జార్జి ఫెర్నాండెజ్ ఎవరు? ఆ దేవుడు కూడా నన్ను ఓడించలేడు’ అని జవాబిచ్చారు. మరుసటి రోజు పత్రికల్లో ఇదే ప్రచురితమైంది. దీన్ని ఆయుధంగా మలుచుకున్న ఫెర్నాండెజ్..‘తనను దేవుడు కూడా ఓడించలేడని పాటిల్ అంటున్నారు. కానీ ఆయన్ను మీరు (ప్రజలు) ఓడించగలరు’ అని పోస్టర్లు వేయించారు. దీంతో దక్షిణ ముంబై స్థానంలో పాటిల్‌పై 42వేల ఓట్ల మెజారిటీతో జార్జి గెలిచారు. లైలా కబీర్‌తో వివాహం..జయా జైట్లీతో సహజీవనం బెంగాల్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి హుమాయూన్ కబీర్ కూతురు లైలాను 1971లో జార్జి వివాహమాడారు. వారి ఏకైక కుమారుడు అమెరికాలో ఉన్నారు. 1990లో కుటుంబ విభేదాలతో లైలాకు విడాకులివ్వకుండానే ఆయన విడిగా జీవించడం ప్రారంభించారు. తరువాత కాలంలో సమతా పార్టీ అధ్యక్షురాలు జయా జైట్లీతో తన నివాసంలో కలిసి జీవించారు. 2012లో లైలా, ఆమె కుమారుడు జయను ఇంట్లోంచి గెంటి వేయగా, సుప్రీంకోర్టు అనుమతితో ఆమె జార్జిని కలుసుకున్నారు. కార్మిక నేతగా, చురుకైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడమేగాక మంత్రి పదవిలోని సమయంలో ఆయన హక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. పౌర హక్కుల ఉద్యమాలకు ఆయన మద్దతుగా నిలిచేవారు. డాక్టర్ లోహియాతో కలిసి పని చేసిన నేతల్లో ప్రముఖుడైన ఫెర్నాండెజ్ మరణంతో భారత రాజకీయాల్లో కీలక శకం ముగిసినట్టయింది. కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడిన జార్జి గొప్ప రాజకీయవేత్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇంకో జన్మ ఉంటే వియత్నాం పౌరుడిగా! మళ్లీ జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటానని జార్జి ఫెర్నాండెజ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అంతర్యుద్ధంతో అతలాకుతలం అయినప్పటికీ వియత్నాం భారత్ కంటే ముందుకు దూసుకుపోతోందనీ, రాబోయే వందేళ్ల భవిష్యత్ గురించి వాళ్లు ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. 15 ఏళ్ల క్రితం బెంగళూరులోని కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఫెర్నాండెజ్ మాట్లాడుతూ..‘వియత్నాం ప్రజలు క్రమశిక్షణ, అంకితభావం, దృఢసంకల్పం కలిగినవారు. తమ ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికి సైతం వారు వెనుకాడరు. అమెరికా, చైనా, ఫ్రాన్స్ జోక్యం, అంతర్యుద్ధం కారణంగా 30 లక్షల మంది వియత్నాం పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ శరవేగంగా పురోగమిస్తున్న వియత్నాం.. తలసరి ఆదాయంలో భారత్‌ను దాటేస్తోంది. నేనేమీ అసూయతో మాట్లాడటం లేదు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణమంత్రిని నేనే. మరో జన్మంటూ ఉంటే వియత్నాం పౌరుడిగా పుట్టాలని కోరుకుంటా’ అని ఫెర్నాండెజ్ తెలిపారు. -
బీజేపీకి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై
భువనేశ్వర్: మాజీ కేంద్ర మంత్రి, రూర్కెలా ఎమ్మెల్యే దిలీప్ రే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన మూడు పేజీల లేఖను కూడా విడుదల చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం ఉదయం ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ప్రదీప్ అమత్న కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో గొప్ప మార్పు రాబోతుందని బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో నేను కూడా నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని భావించాను. చాలా కాలంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేను పరిష్కరిస్తానని అక్కడి ప్రజలు నమ్మారు. నా నియోజకర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతుగా ఎంతో కృషి చేశారు. కానీ, నేను అంచనాలను చేరుకోలేకపోయాను. అందుకే నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇది చాలా బాధతో కూడుకున్న నిర్ణయం. రూర్కెలాలో 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేద’ని దిలీప్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దిలీప్ రాజీనామా స్పందించిన ఒడిశా బీజేపీ చీఫ్ బసంత్ పాండా మాట్లాడుతూ.. ఒక కొమ్మ పడిపోయినంతా మాత్రనా చెట్టుకు ఎటువంటి నష్టం లేదని అన్నారు. నష్టపోయిన చోటు నుంచే కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయని తెలిపారు. కాగా, రూర్కెలా ఇస్పాత్ జనరల్ హాస్పిటల్, బ్రహ్మణి నదిపై రెండో వంతెన నిర్మించకపోవడంపై దిలీప్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. -
అక్బర్‌పై మరో ‘మీ టూ’
వాషింగ్టన్: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్ పబ్లిక్ రేడియో’ చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్ ఏజ్’లో చేరా. ఆ సమయంలో అక్బర్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి ఎడిటర్‌గా అక్బర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తీసేస్తా.. 1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్ ఎడిటోరియల్ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్ హోటల్ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ‘ఓ సారి అసైన్మెంట్ నిమిత్తం జైపూర్‌కు వెళ్లా. అప్పటికే అక్కడ ఓ హోటల్లో ఉన్న అక్బర్ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’. బ్రిటన్, యూఎస్ పంపిస్తా.. 1994 డిసెంబర్లో ఎన్నికల కవరేజీపై అక్బర్ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్‌లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్‌పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్ప్లేస్కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్‌లోని ‘డౌజోన్స్’ పత్రికలో చేరాను’ ప్రతిభతో ఎదిగా.. ‘ఇప్పుడు నేను యూఎస్ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్ వీక్, యూఎస్ఏ టుడే, అసోసియేటెడ్ ప్రెస్, సీఎన్ఎన్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్‌పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. పరస్పర అంగీకారంతోనే: అక్బర్ పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు. -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్(63) బుధవారం కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయ విద్యనభ్యసించిన కామత్ 1984లో ముంబై నార్త్ ఈస్ట్ నియోజక వర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఐదు పర్యాయాలు ఎంపీగా.. ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన (1984, 91, 98, 2004, 2009) కామత్.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2009- 11 వరకు ప్రసార, సమాచార శాఖ మంత్రిగా, హోం శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు. జూలై 2011లో తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా.. రాజస్తాన్, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కాంగ్రెస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2017లో పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాగా గురదాస్ కామత్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గురుదాస్ కామత్ జీ ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పెద్ద దెబ్బ. ముంబైలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కామత్ జీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అశోక్ గెహ్లాట్, రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. The sudden passing away of senior leader Gurudas Kamat ji, is a massive blow to the Congress family. Gurudas ji helped build the Congress party in Mumbai & was greatly respected & admired by all. My condolences to his family in their time of grief. May his soul rest in peace. — Rahul Gandhi (@RahulGandhi) August 22, 2018