సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్‌కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్‌ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్‌వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు.
అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్‌నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు.
అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్‌లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్‌ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్‌ను వీడారు!
రాహుల్ రాకతో సర్వం నాశనం
సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు.
ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్‌కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్‌శిబిర్‌లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్‌కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు.
కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్‌ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు.
కోటరీ గుప్పెట్లో బందీ
కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే.
రాహుల్‌పై ఆజాద్ ఆరోపణలు...
► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది.
► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు.
► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్‌వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది!
► ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.
► కాంగ్రెస్‌ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది.
► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు.
ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్
దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్‌పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్‌కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్‌పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment