జెఠ్మలానీ కన్నుమూత | Former Union Minister Ram Jethmalani pass away | Sakshi
Sakshi News home page

జెఠ్మలానీ కన్నుమూత

Published Mon, Sep 9 2019 4:09 AM | Last Updated on Mon, Sep 9 2019 4:09 AM

Former Union Minister Ram Jethmalani pass away - Sakshi

రామ్‌ జెఠ్మలానీ

న్యూఢిల్లీ: ఎంతో క్లిష్టమైన క్రిమినల్‌ కేసులతోపాటు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ బూల్‌చంద్‌ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్‌ తెలిపారు.

జెఠ్మలానీ నలుగురు సంతానంలో ఇద్దరు చనిపోగా కుమారుడు మహేశ్, కుమార్తె శోభ ఉన్నారు. ఆయన మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబసభ్యుల కు సానుభూతి తెలిపారు. జెఠ్మలానీ అంత్యక్రియ లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన కుమారుడు మహేశ్‌ చితికి నిప్పంటించారు.  

కరాచీలో 17 ఏళ్లకే లా పట్టా
1923 సెప్టెంబర్‌ 14వ తేదీన సింథ్‌(పాకిస్తాన్‌)లోని షికార్‌పూర్‌లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు.  అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి చేరుకున్నారు.  1959లో కేఎం నానావతి వర్సెస్‌ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయంగానూ పేరు..
అటల్‌ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్‌ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్‌ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆయన కోర్టులో కేసు వేశారు. అనంతరం ఆ కేసును జెఠ్మలానీ ఉపసంహరించుకున్నారు.

న్యాయ నిపుణుడిని కోల్పోయాం: రాష్ట్రపతి
‘రామ్‌ జెఠ్మలానీ మృతి విచారకరం. ఆయన తన వాక్పటిమతో ప్రజా సమస్యలపై పోరాడారు. గొప్ప న్యాయ నిపుణుడిని దేశం కోల్పోయింది’అని రాష్ట్రపతి కోవింద్‌ పేర్కొన్నారు. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ. న్యాయ వ్యవస్థకు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజం జెఠ్మలానీ.  అటువంటి విశిష్టమైన వ్యక్తిని దేశం కోల్పోయింది’అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ జెఠ్మలానీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం
రామ్‌జెఠ్మలానీ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాపం
రామ్‌జెఠ్మలానీ మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసిన జెఠ్మలానీ ఉన్నతమైన వ్యక్తిగా గుర్తుండిపోతారని జగన్‌ పేర్కొన్నారు.

కేసులతో వార్తల్లోకి..
సుదీర్ఘ వృత్తి జీవితంలో ఆయన  చేపట్టని అంశం లేదు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్‌ల తరఫున కూడా వాదించారు.  దేశంలో ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన జెఠ్మలానీ.. పలు ప్రతిష్టాత్మక క్రిమినల్‌ కేసుల్లో నిందితుల పక్షాన వాదించడం వివాదాస్పదం అయింది. ఇందిరాగాంధీ హత్య కేసులో, అనంతరం రాజీవ్‌ హత్య కేసులో నిందితుల పక్షాన నిలబడ్డారు. హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌ స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణాల కేసుల్లోనూ ఆయన వాదించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ జిలానీ తరఫున వాదనలు వినిపించారు.

విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు. హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షా తరఫున వాదించారు. దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు,  ముంబై పేలుళ్ల కేసులో సంజయ్‌ దత్‌ తరఫున వాదించారు. 2013లో మైనర్‌పై రేప్‌ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement