పెజావర స్వామీజీ అస్తమయం | Udupi Pejawar Mutt Swamyji Passes Away at 88 in Bengaluru | Sakshi
Sakshi News home page

పెజావర స్వామీజీ అస్తమయం

Published Mon, Dec 30 2019 4:42 AM | Last Updated on Mon, Dec 30 2019 4:42 AM

Udupi Pejawar Mutt Swamyji Passes Away at 88 in Bengaluru - Sakshi

బెంగళూరులో విశ్వేశతీర్థ స్వామీజీ పార్థివ దేహాన్ని తరలిస్తున్న భక్తులు

సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్‌ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.  

స్వామీజీ కోరిక మేరకు..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు.

ప్రధాని సంతాపం  
స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్‌ చేశారు.

ఉడుపి నుంచి బెంగళూరుకు
స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్‌ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.

మధ్వాచార్యుడు స్థాపించిన మఠం
800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్‌ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు.

హిందూజాతికి తీరని లోటు
– స్వరూపానందేంద్ర సరస్వతి
పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు.


స్వామీజీ సేవలు చిరస్మరణీయం
– ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement