Bengaloore
-
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా
11–0 ఇదీ రోహిత్ లెక్క! ఈ ‘హిట్‌మ్యాన్’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్ వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్‌దే జయం. పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్ సోమవారం రెండో సెషన్లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది. బెంగళూరు: టీమిండియా బౌలింగ్ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్ టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్ సీమర్ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్ (4/55), అక్షర్ పటేల్ (2/37) లంక బ్యాటర్స్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్ దిముత్ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్‌నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్‌ను అశ్విన్ స్టంపౌట్ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్ (1)ను జడేజా బౌల్డ్ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్ పడకుండా తొలిసెషన్ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే డిక్వెలా, అనంతరం అసలంక(5) అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలిఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54; మాథ్యూస్ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్ 4; డిక్వెలా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్ 2; లక్మల్ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్ 2; జయవిక్రమ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్ పటేల్ 11–1–37–2. 442: టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అధిగమించి ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. -
కోలుకునేది రెండేళ్ల తర్వాతే
సాక్షి, హైదరాబాద్: దేశీయ నివాస విభాగం 2023లో తారా స్థాయికి చేరుకుంటుంది. 3.17 లక్షల గృహాల విక్రయాలు, 2.62 లక్షల లాంచింగ్స్ జరుగుతాయి. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 1.8 లక్షలకు చేరుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటం, స్టాక్ మార్కెట్ వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలు వంటివి ఈ వృద్ధికి కారణాలని తెలిపింది. కొనుగోలుదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, సాంకేతికత, డిజిటల్ మార్కెటింగ్, వినూత్న వ్యాపార పద్ధతులు దేశీయ నివాస రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో గతేడాది 1,38,344 యూనిట్లు విక్రయమయ్యాయని.. ఈ ఏడాది 1,79,527లకు పెరుగుతాయి. డిమాండ్ మాత్రం కరోనా పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. 2019లో అమ్మకాలు 2,61,358 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 2,64,625 యూనిట్లు, 2023లో 3,17,550 గృహాలు విక్రయం అవుతాయని అంచనా వేసింది. 2017 నుంచి వృద్ధి.. నివాస విభాగం 2017 నుంచి ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2019 నాటికి తారా స్థాయికి చేరింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020లో డీలా పడింది. గతేడాది రెండో అర్ధ భాగం నుంచి కాస్త మెరుగైన ప్రతిభను కనబర్చినప్పటికీ ఆశించిన స్థాయికి చేరలేదు. 2020లో గృహాల విక్రయాలు 1.38 లక్షలు, లాంచింగ్స్ 1.28 లక్షలకు తగ్గాయి. ఈ ఏడాది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గృహాల సప్లయ్ 35 శాతం, విక్రయాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. 2019తో పోలిస్తే మాత్రం సప్లయ్ 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సప్లయ్ కంటే సేల్స్ ఎక్కువ.. వ్యాక్సినేషన్ వేగవంతం కావటంతో 2023 నాటికి రియల్టీ మార్కెట్ పీక్ దశకు చేరుతుంది. 2019తో పోలిస్తే విక్రయాలలో 22 శాతం, సప్లయ్‌లో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2014–16లో గృహాల సప్లయ్ 11,85,000 ఉండగా.. విక్రయాలు 8,90,500లుగా ఉన్నాయి. సేల్స్/సప్లయ్ నిష్పత్తి 0.75 శాతంగా ఉంది. అదే 2017–19 నాటికి సప్లయ్ 5,78,,700 ఉండగా.. అమ్మకాలు 7,20,800లకు పెరిగాయి. నిష్పత్తి 1.25 శాతానికి వృద్ధి చెందింది. నగరంలో సేల్స్ 6 శాతం.. 2023లో జరిగే సేల్స్, లాంచింగ్స్ రెండింట్లోనూ ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో ఉంటాయి. ముంబై సేల్స్‌లో 28 శాతం, లాంచింగ్స్‌లో 30 శాతం వాటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు అమ్మకాలలో 20 శాతం, ప్రారంభాలలో 17 శాతం, ఎన్సీఆర్ వరుసగా 18 శాతం, 15 శాతం, పుణే 15 శాతం, 18 శాతం, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాలు విక్రయాలలో 6 శాతం, లాంచింగ్స్‌లో 8 శాతం వాటాలను సొంతం చేసుకుంటాయి. -
బెంగళూరు పోలీసుల ‘పూజాగిరి’
బెంగళూరు: లాక్డౌన్ విధించినా రోడ్లపైకి జనాలు వస్తూనే ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. బండ్లను సీజ్ చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని చోట్ల బడితే పూజ కూడా చేస్తున్నారు. అయినా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని అరికట్టడం కష్టంగా మారింది. దీంతో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో కొత్త రకం ట్రీట్మెంట్ ఇస్తున్నారు బెంగళూరు పోలీసులు. దీనికి నెటిజన్లు పూజాగిరిగా పిలుస్తున్నారు. బడితే పూజ కాదు బెంగళూరు నగర శివార్లలో ఉన్న మదనయాకనహళ్లి పోలీసులు చిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో అనవసరం కారణంతో రోడ్లపైకి వచ్చినట్టు తేలగానే వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఒకరు వచ్చి మెడలో దండ వేస్తారు. ఆ షాక్ నుంచి తేరుకోగానే మరొకరు హారతి పళ్లెంతో ఎదురై బొట్టు పెట్టేస్తారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోగానే అంక్షితలు వేసి హారతి ఇస్తున్నారు. మొత్తంగా అనవసరంగా బయటకు రావొద్దంటూ బడితే పూజకు బదులు నిజం పూజలు చేస్తున్నారు. ఒపికగా లాక్డౌన్ ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఇంట్లోనే ఉండాలంటూ నచ్చచెబుతున్నారు. పోలీసులు చేస్తున్న ఈ పూజకు సంబంధించిన వీడియో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. Watch: The Madanayakanahalli police in #Bengaluru outskirts has come up with a unique way to tell people flouting #lockdown rules to stay at home by performing aarti of those caught. @IndianExpress pic.twitter.com/VoBP3HwHYA — Express Bengaluru (@IEBengaluru) May 24, 2021 -
భారత మాజీ క్రికెటర్ చంద్రశేఖర్‌కు అస్వస్థత
సాక్షి, బెంగళూరు: భారత మాజీ క్రికెటర్, విఖ్యాత లెగ్ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన భార్య సంధ్య వెల్లడించారు. రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 75 ఏళ్ల చంద్రశేఖర్ గత శుక్రవారం తీవ్రమైన అలసటకు గురయ్యారు. దాంతో పాటు మాట తడబడటంతో ఆయన్ని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలోని వైద్యనిపుణులు ఆయనను పరీక్షించి... స్వల్ప బ్రెయిన్ స్ట్రోక్‌గా నిర్ధారించి చికిత్స చేశారు. మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు ఏర్పడ్డాయని అందువల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. అనంతరం సాధారణ వార్డ్‌కు మార్చారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం, సమస్యా లేదని సంధ్య తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం పది రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన చంద్రశేఖర్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 58 టెస్టులు ఆడి 242 వికెట్లు పడగొట్టారు. అప్పటి సహచర స్పిన్నర్లు బిషన్‌సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్లతో కలిసి 1960, 70 దశకాలను శాసించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘అర్జున’, ‘పద్మశ్రీ’ పురస్కారాలతో గౌరవించింది. -
హీరోయిన్ రష్మిక హాజరు కావాల్సిందే..
సాక్షి, బెంగళూరు: బహు భాషా హీరోయిన్ రష్మికా మందన్న నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రష్మిక నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి,పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్ -
పెజావర స్వామీజీ అస్తమయం
సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజీ కోరిక మేరకు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు. ప్రధాని సంతాపం స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూరుకు స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మధ్వాచార్యుడు స్థాపించిన మఠం 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు. హిందూజాతికి తీరని లోటు – స్వరూపానందేంద్ర సరస్వతి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు. స్వామీజీ సేవలు చిరస్మరణీయం – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. -
77 కేజీల బంగారు నగలు చోరీ
కృష్ణరాజపురం: బెంగళూరులో అత్యంత భారీ చోరీ చోటుచేసుకుంది. ఏకంగా 77 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బెంగళూరు పులకేశినగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి దగ్గర్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఇందులో తమ వినియోగదారులకు వారి బంగారం కుదువ పెట్టుకుని నగదు ఇస్తుంటారు. ఈ కార్యాలయంలో భారీగా బంగారం ఉంటుం దని భావించిన దుండగులు శనివారం రాత్రి గోడకు కన్నమేసి లోపలికి చొరబడ్డారు. బంగారం భద్రపరిచిన బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించారు. అందులోని 77 కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూసి తెలిసిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కస్టమర్లకు భరోసా బంగారం చోరీ నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంగారానికి పూర్తిగా బీమా భద్రత ఉందని ముత్తూట్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. దోపిడీ కారణంగా కస్టమర్ల బంగారానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఓ ప్రకటనలో పేర్కొంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసే వరకూ కొంత సమయం ఇవ్వాలని తర్వాత వారికి పూర్తి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపింది. -
సీబీఐ ఆఫీసర్‌నంటూ లక్షలు కాజేశాడు
సాక్షి, బెంగళూరు : సీబీఐ ఆఫీసర్‌నంటూ వ్యక్తులను భయపెట్టి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ ఇచ్చిన వివరాల ప్రకారం.. అభిలాష్ (34) అనే వ్యక్తి సీబీఐ ఆఫీసర్‌గా చలామణి అవుతూ తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించి ఇటీవల ఓ వ్యక్తి దగ్గర రూ. 24 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత కూడా పలువురిని మోసం చేయడానికి ట్రాక్‌లో పెట్టాడు. సమాచారమందుకున్న పోలీసులు అభిలాష్‌ని పట్టుకొని అతని వద్దనున్న రెండు బెంజ్‌కార్లను స్వాదీనం చేసుకున్నారు. నిందితుని సోషల్ మీడియాలోని ఖాతాలు చూడగా, అందులో తను ఇంజనీర్, బిజినెస్‌మేన్ అని ఉంది. కాగా, అభిలాష్ మీద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
బెంగళూరును వణికించిన వాన
బెంగళూరు: బెంగళూరులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల ఐదుగురు మృతిచెందారు. పశ్చిమ, దక్షిణ భాగాల్లో చాలా ప్రాంతాల్లో నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నీటిపై తేలియాడుతున్న కారులో చిక్కుకున్న మహిళను కొందరు యువకులు కాపాడిన వీడియా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మైసూర్ రోడ్డులోని నాయందహల్లి సర్కిల్లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కురుబ్రహల్లి ప్రాంతంలో డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన వాసుదేవ్ భట్ అనే పూజారి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. మరోవైపు, కనిపించకుండా పోయిన అదే ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు కూడా డ్రైనేజీలో కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
మునిగిపోతున్నాం.. కాపాడండి!
బెంగళూరు: గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఏటా 3.4 మి.మీ. మేర సముద్రంలో మునిగిపోతున్న కిరిబాటి ద్వీపం భారత్ సాయం కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అనోట్ టాంగ్ తెలిపారు. కిరిబాటిని కాపాడే సాంకేతికత, నైపుణ్యం భారత్‌కు ఉన్నాయన్నారు. ప్రముఖ గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ బెంగళూరులో నిర్వహించిన ‘రౌండ్‌గ్లాస్ సంసారా ఫెస్టివల్’లో టాంగ్ మాట్లాడారు. చాలామంది ప్రజలు భవిష్యత్‌లో కిరిబాటిలో ఉండబోరన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ పౌరులు జీవించేందుకు వీలుగా భారత్ శిక్షణ ఇవ్వాలని టాంగ్ విజ్ఞప్తి చేశారు. చేపల వేట ద్వారా 30 నుంచి 40% ఆదాయం సాధించగలిగితే వచ్చే రూ.6,516 కోట్ల(బిలియన్ డాలర్ల)తో డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా మునిగిపోతున్న తమ దేశాన్ని కాపాడుకుంటామన్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీపమైన కిరిబాటిలో దాదాపు 1.10 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. -
ప్రియురాలిపై పెట్రోల్ పోసినిప్పు
* పెళ్లి చేసుకోదేమోనని ప్రియుడి ఘాతుకం * మంటలంటుకుని ఆమె కుటుంబసభ్యులకూ తీవ్రగాయాలు బెంగళూరు(బనశంకరి): పెళ్లి చేసుకోమం టే నిర్లక్ష్యం వహిస్తోందని ఓ ప్రేమికుడు ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటిం చాడు. ఈ ఘటనలో యువతితోపాటు ఆమెను కాపాడ్డానికి వెళ్లిన తల్లిదండ్రులు, చెల్లెలు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని శ్రీరాంపు ర పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. శ్రీరాంపురలోని సాయిబాబానగర్‌కు చెందిన నటరాజ్, అనుపమ దంపతుల కుమార్తె మేఘన ఇంజనీరింగ్ చదువుతోంది. వారి ఇంటి పక్కనే ఉండే దీపక్ ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకోవడానికి యత్నించగా.. ఇరు కుటుంబాల వారు వెనక్కి పిలిపించారు. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో కొంతకాలంగా బండిరెడ్డిపాళ్యలో నివాసముంటున్న దీపక్ మేఘన ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అయితే.. తనతో వివాహానికి మేఘన అంగీకరించదేమోనని అనుమానం పెంచుకొని శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రియురాలిఇంటికి వెళ్లాడు. కిటికీలోంచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న మేఘన కేకలు వేయడంతో మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలు సంజన అక్కడికి వచ్చారు. మంటలు వారికీ అంటుకున్నాయి. వీరి అరుపులు విని ఇరుగుపొరుగు వారు అక్కడకు వచ్చి నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. పోలీసులు వచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించారు. దీపక్‌ను అరెస్ట్ చేశారు.