కృష్ణరాజపురం: బెంగళూరులో అత్యంత భారీ చోరీ చోటుచేసుకుంది. ఏకంగా 77 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బెంగళూరు పులకేశినగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాణసవాడి–హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి దగ్గర్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ఉంది. ఇందులో తమ వినియోగదారులకు వారి బంగారం కుదువ పెట్టుకుని నగదు ఇస్తుంటారు. ఈ కార్యాలయంలో భారీగా బంగారం ఉంటుం దని భావించిన దుండగులు శనివారం రాత్రి గోడకు కన్నమేసి లోపలికి చొరబడ్డారు. బంగారం భద్రపరిచిన బీరువాలను గ్యాస్ కట్టర్‌లతో కత్తిరించారు. అందులోని 77 కేజీల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన తీరు చూసి తెలిసిన వ్యక్తుల పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
కస్టమర్లకు భరోసా
బంగారం చోరీ నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంగారానికి పూర్తిగా బీమా భద్రత ఉందని ముత్తూట్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. దోపిడీ కారణంగా కస్టమర్ల బంగారానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఓ ప్రకటనలో పేర్కొంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు రికవరీ చేసే వరకూ కొంత సమయం ఇవ్వాలని తర్వాత వారికి పూర్తి పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారని, వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment