ramjethmalani
-
జెఠ్మలానీ కన్నుమూత
న్యూఢిల్లీ: ఎంతో క్లిష్టమైన క్రిమినల్ కేసులతోపాటు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్య కేసుల్లో నిందితుల తరఫున వాదించిన ప్రముఖ న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ బూల్‌చంద్ జెఠ్మలానీ(95) కన్నుమూశారు. అతి పిన్న వయస్సులోనే లా డిగ్రీ పొందిన జెఠ్మలానీకి..75 ఏళ్ల అనుభవమున్న అత్యంత సీనియర్, అందరి కంటే ఎక్కువ ఫీజు తీసుకునే న్యాయవాదిగా పేరుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ తెలిపారు. జెఠ్మలానీ నలుగురు సంతానంలో ఇద్దరు చనిపోగా కుమారుడు మహేశ్, కుమార్తె శోభ ఉన్నారు. ఆయన మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి, కుటుంబసభ్యుల కు సానుభూతి తెలిపారు. జెఠ్మలానీ అంత్యక్రియ లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు లోథి రోడ్‌లోని శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన కుమారుడు మహేశ్ చితికి నిప్పంటించారు. కరాచీలో 17 ఏళ్లకే లా పట్టా 1923 సెప్టెంబర్ 14వ తేదీన సింథ్(పాకిస్తాన్)లోని షికార్పూర్లో జన్మించిన జెఠ్మలానీ కరాచీలోని షహానీ లా కళాశాల నుంచి 17 ఏళ్లకే లా డిగ్రీ సంపాదించారు. అనంతరం కరాచీ హైకోర్టులోనే న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం 1958లో ముంబైకి చేరుకున్నారు. 1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కేసుతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2010లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగానూ పేరు.. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ముంబై నుంచి 1977లో జనతాపార్టీ టికెట్‌పై, 1980లో బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1988లో భారత్ ముక్తి మోర్చా అనే రాజకీయ వేదికను, 1995లో పవిత్ర హిందుస్తాన్ కజగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో లక్నో నుంచి వాజ్‌పేయిపై పోటీ చేశారు. అనంతరం బీజేపీ తరఫున 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆయన్ను 2013లో పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టులో కేసు వేశారు. అనంతరం ఆ కేసును జెఠ్మలానీ ఉపసంహరించుకున్నారు. న్యాయ నిపుణుడిని కోల్పోయాం: రాష్ట్రపతి ‘రామ్ జెఠ్మలానీ మృతి విచారకరం. ఆయన తన వాక్పటిమతో ప్రజా సమస్యలపై పోరాడారు. గొప్ప న్యాయ నిపుణుడిని దేశం కోల్పోయింది’అని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. ‘తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వెనుదీయని ధైర్యశాలి జెఠ్మలానీ. న్యాయ వ్యవస్థకు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజం జెఠ్మలానీ. అటువంటి విశిష్టమైన వ్యక్తిని దేశం కోల్పోయింది’అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ జెఠ్మలానీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం రామ్‌జెఠ్మలానీ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసిన జెఠ్మలానీ ఉన్నతమైన వ్యక్తిగా గుర్తుండిపోతారని జగన్ పేర్కొన్నారు. కేసులతో వార్తల్లోకి.. సుదీర్ఘ వృత్తి జీవితంలో ఆయన చేపట్టని అంశం లేదు. రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మాఫియా డాన్ల తరఫున కూడా వాదించారు. దేశంలో ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన జెఠ్మలానీ.. పలు ప్రతిష్టాత్మక క్రిమినల్ కేసుల్లో నిందితుల పక్షాన వాదించడం వివాదాస్పదం అయింది. ఇందిరాగాంధీ హత్య కేసులో, అనంతరం రాజీవ్ హత్య కేసులో నిందితుల పక్షాన నిలబడ్డారు. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణాల కేసుల్లోనూ ఆయన వాదించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జిలానీ తరఫున వాదనలు వినిపించారు. విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలంటూ యూపీఏ హయాంలో సుప్రీంకోర్టులో పిల్ వేశారు. హవాలా కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా తరఫున వాదించారు. దాణా కుంభకోణం, 2జీ స్కాం, జయలలిత అక్రమాస్తుల కేసు, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరఫున వాదించారు. 2013లో మైనర్‌పై రేప్ కేసులో ఆసారాం బాపూజీ తరఫున వాదించారు. -
పవన్‌కు టీడీపీకి దూరం పెరుగుతోందా?
-
పవన్‌కు టీడీపీకి దూరం పెరుగుతోందా?
హైదరాబాద్ : భూసేకరణ అంశంపై టీడీపీ, జనసేన అధ్యక్షుడు సినీనటుడు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ మరో ట్విట్ చేశారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకి మద్దతు పలకడం ధర్మమని, ఎప్పుడైతే ఆ పార్టీ విధానాలు, చర్యలు, దేశానికి నష్టం కలిగిస్తాయో వారికి మద్దతు తెలపడం నేరంతో సమానమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలాని మాటలను పవన్... పై విధంగా తన ట్విట్లో ప్రస్తావించారు. రాజకీయాల్లో దేశ ప్రయోజనమే అత్యున్నతమని జెఠ్మాలానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని భూసేకరణ విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న పవన్ కల్యాణ్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే స్వయంగా తాను కూడా పవన్‌తో భేటీ కావాలని అనుకుంటున్నారట. రెండురోజుల్లో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. pic.twitter.com/XEGRPS1d8Y — Pawan Kalyan (@PawanKalyan) August 22, 2015 -
పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఖాతాలు కలిగివున్న వారి పేర్లను బహిర్గతం చేయడంకన్నా.. విదేశాల్లో దాచేసిన నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారి పేర్లను వెల్లడించాలని కోరుతూ న్యాయవాదులు రామ్‌జెఠ్మలానీ, ప్రశాంత్‌భూషణ్‌లు వేసిన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టంచేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా జెఠ్మలాని తరఫు న్యాయవాది అనిల్దివాన్ వాదనలు వినిపిస్తూ గత ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఈ దేశానికి తిరిగిరాలేదని.. కేవలం కొన్ని సోదాలు, అటాచ్‌మెంటులు మాత్రమే జరిగాయని విమర్శించారు. అటార్నీ జనరల్ ముకుల్ రహ్తొగీ వాదిస్తూ.. జెనీవా హెచ్ఎస్బీసీ బ్యాంకులోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన ఆదాయ పన్ను అంచనాలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయటం జరుగుతుందన్నారు. భూషణ్ తరఫు న్యాయవాది దివాన్ వాదిస్తూ.. ఆయా ఖాతాదారుల పేర్లను ప్రచురిస్తే.. విదేశాల్లో నల్లధనం దాచుకుని, దానిని మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణాల్లోకి మళ్లించిన వారికి అది హెచ్చరికగా పనిచేస్తుంద్కన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఖాతాదారుల పేర్లను బహిర్గతపరచాలని తాము ఆదేశాలు ఇవ్వబోమని, నల్లధనాన్ని వెనక్కు తేవటం ఇక్కడ ముఖ్యాంశమని పేర్కొంది. నల్లధనం అంశంపై ఫ్రెంచ్ ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు, ఇతరత్రా సమాచారం సిట్‌కు సమర్పించామని, వాటిని పిటిషనర్లకు అందించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ దర్యాప్తు బృందమేనని పేర్కొన్న కేంద్రం వైఖరిపై పిటిషనర్లు స్పందనను సమర్పించేందుకు కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. రెండు వారాల్లోగా సమర్పించండి... నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు తాము చేసిన వివిధ సూచనలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిగణనలోకి తీసుకోవాలని జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ కేసుకు సంబంధించిన వారందరూ తమ సూచనలను మంగళవారం నుంచి రెండు వారాల్లోగా సిట్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నామంది. చట్టం చేస్తారో లేదో చెప్పాలి: జెఠ్మలానీ ఈ తీర్పు ప్రకటించిన తర్వాత.. ప్రభుత్వం ఆరు నెలలుగా నల్లధనంపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదంటూ జెఠ్మలానీ కోర్టులోనే తన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను నా డబ్బును వెనక్కు ఇవ్వాలని ఇక్కడికి రాలేదు. దేశానికి చెందిన డబ్బును వెనక్కు తేవాలని కోరుతూ వచ్చాను. చట్టం లేకుండా ఏమీ జరగదు. ఒక ముసాయిదా తయారు చేయాలని సిట్ నాకు చెప్పింది. నేను ముసాయిదాను సిట్‌కు, ప్రధానికి పంపించాను. ఆయన ఆర్థిక శాఖకు పంపారంతే. కానీ.. ప్రధాని నుంచి నాకు ఎలాంటి సమాచారమూ రాలేదు. అసలు చట్టం చేయాలనుకుంటున్నారో లేదో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ చట్టంలో ఈ ముసాయిదా భాగంగా ఉంటుందో లేదో చెప్పాలి. లేదంటే నేను బహిరంగంగా గొంతెత్తాల్సి ఉంటుంది. సలహా ఇవ్వటం తప్ప నేను ఏం చేయగలను? మీరు ఆ సలహాను అంగీకరించకపోతే నేను ఈ దేశ సార్వభౌమ ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని అన్నారు. 15 లక్షల పరిమితి పెట్టండి: సిట్ న్యూఢిల్లీ: ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.15 లక్షలకు మించి నగదును దగ్గర ఉంచుకోవడానికి వీల్లేకుండా పరిమితిని విధించాలని సిట్ సుప్రీంకోర్టుకు సూచించింది. నగదును పోగేయడం కూడా నల్లధనం పెరిగిపోవడానికి కారణమని పేర్కొంది. -
కాశ్మీర్ సమస్యకు ముషార్రఫ్ ఫార్ములానే పరిష్కారం
ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ ప్రకటన తాను చెప్పడంవల్లే ఆర్టికల్ 370పై బీజేపీ మౌనం దాల్చిందని వ్యాఖ్య శ్రీనగర్: కాశ్మీర్ సమస్యకు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సూచించిన నాలుగు సూత్రాల ఫార్ములానే శాశ్వత పరిష్కారమని ప్రముఖ న్యాయవాది, మాజీ బీజేపీ ఎంపీ రామ్‌జెఠ్మలానీ అన్నారు. కాశ్మీర్ పరిష్కారానికి ఏర్పాటైన ఓ ప్రైవేటు కమిటీకి జెఠ్మలానీ చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. శ్రీనగర్ వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ముషార్రఫ్ సదుద్దేశంతో భారత్‌కు వచ్చారని(అధ్యక్షుడిగా ఉన్న సమయంలో), ఆయన ప్రతిపాదన కాశ్మీర్ సమస్యకు అద్భుత పరిష్కారమని చెప్పారు. ముషార్రఫ్ డాక్యుమెంట్ అద్భుతమని, కాశ్మీర్‌కు శాశ్వత పరిష్కారానికి ఇది ప్రాతిపదికగా ఉండాలన్నారు. అయితే, ఆయన ప్రయత్నాలు భారత్‌కు కోపాన్ని తెప్పించాయని చెప్పడానికి తాను సంశయించడం లేదన్నారు. ముషార్రఫ్ డాక్యుమెంట్లో తాను కొన్ని మార్పులు చేశానని, అప్పట్లో ఓ మిత్రుడి ద్వారా దాన్ని తన వద్దకు పంపినట్లు వెల్లడించారు. కాశ్మీర్‌కు ఇరువైపులా లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలన్నదే ఆ డాక్యమెంట్ ఉద్దేశంగా పేర్కొన్నారు. వేర్పాటువాదులు అందరూ పాక్ ఏజెంట్లు కారని, వారితో తాను సంప్రదింపులు కొనసాగిస్తున్నానని, ఎక్కువ మంది భారత్‌తోనే ఉండాలనుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ కదిలించలేరు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని, దాన్ని ఎవరూ ముట్టుకోలేరని జెఠ్మలానీ అన్నారు. దీని ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీకి వివరించానని, అందుకే బీజేపీ దీనిపై మౌనం దాల్చిందన్నారు. ఎన్నికల ముందు ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఆర్టికల్‌ను ఏర్పాటు చేశారని, దీన్ని ఎవరూ రద్దు చేయలేరని పేర్కొన్నారు.