- ప్రముఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ ప్రకటన
- తాను చెప్పడంవల్లే ఆర్టికల్ 370పై బీజేపీ మౌనం దాల్చిందని వ్యాఖ్య
శ్రీనగర్: కాశ్మీర్ సమస్యకు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సూచించిన నాలుగు సూత్రాల ఫార్ములానే శాశ్వత పరిష్కారమని ప్రముఖ న్యాయవాది, మాజీ బీజేపీ ఎంపీ రామ్‌జెఠ్మలానీ అన్నారు. కాశ్మీర్ పరిష్కారానికి ఏర్పాటైన ఓ ప్రైవేటు కమిటీకి జెఠ్మలానీ చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. శ్రీనగర్ వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
ముషార్రఫ్ సదుద్దేశంతో భారత్‌కు వచ్చారని(అధ్యక్షుడిగా ఉన్న సమయంలో), ఆయన ప్రతిపాదన కాశ్మీర్ సమస్యకు అద్భుత పరిష్కారమని చెప్పారు. ముషార్రఫ్ డాక్యుమెంట్ అద్భుతమని, కాశ్మీర్‌కు శాశ్వత పరిష్కారానికి ఇది ప్రాతిపదికగా ఉండాలన్నారు. అయితే, ఆయన ప్రయత్నాలు భారత్‌కు కోపాన్ని తెప్పించాయని చెప్పడానికి తాను సంశయించడం లేదన్నారు.
ముషార్రఫ్ డాక్యుమెంట్‌లో తాను కొన్ని మార్పులు చేశానని, అప్పట్లో ఓ మిత్రుడి ద్వారా దాన్ని తన వద్దకు పంపినట్లు వెల్లడించారు. కాశ్మీర్‌కు ఇరువైపులా లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలన్నదే ఆ డాక్యమెంట్ ఉద్దేశంగా పేర్కొన్నారు. వేర్పాటువాదులు అందరూ పాక్ ఏజెంట్లు కారని, వారితో తాను సంప్రదింపులు కొనసాగిస్తున్నానని, ఎక్కువ మంది భారత్‌తోనే ఉండాలనుకుంటున్నారన్నారు.
ఆర్టికల్ 370ని ఎవరూ కదిలించలేరు
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని, దాన్ని ఎవరూ ముట్టుకోలేరని జెఠ్మలానీ అన్నారు. దీని ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీకి వివరించానని, అందుకే బీజేపీ దీనిపై మౌనం దాల్చిందన్నారు. ఎన్నికల ముందు ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఆర్టికల్‌ను ఏర్పాటు చేశారని, దీన్ని ఎవరూ రద్దు చేయలేరని పేర్కొన్నారు.