pervez musharraf
-
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఈ అధ్యక్షుడు ఓ వైరుద్ధ్యాల పుట్ట
ఇటీవల మరణించిన పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్లోని వైరుద్ధ్యాలను తేల్చడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు. రెండుసార్లు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. మితవాద ముస్లిం అయిన ముషారఫ్, లష్కర్–ఎ–తోయిబాకు అతిపెద్ద మద్దతుదారునని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధినేతగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం విషయంలో పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత చేరువకు రాగలిగారు. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి. జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఒక వైరుద్ధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల్లో కొన్ని సంతోషకర మైనవి. కొన్ని ఇబ్బందికరమైనవి. కానీ ఆయన మాత్రం వాటికి మించిన వ్యక్తిత్వంతో ఉండేవారు. ఆయన దుస్తులు ఎంత నీటుగా ఉండేవంటే అందరినీ అవి ఆకర్షించేవి. అలాగే ఆయన పదాలతో ఆడుకునేవారు. 2002 అధ్యక్ష ‘ఎన్నికల్లో’ ఆయన 98 శాతం ఆధిక్యత సాధించినప్పుడు ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక అభి నందించింది. దానికి ఆయన చెప్పిన సమాధానం ఆ పత్రిక రిపోర్టర్‌ను నివ్వెరపర్చింది. ‘‘మీరు వ్యంగ్యంగా చెప్పినట్లయితే, నేను మాట్లాడేది ఏమీ ఉండదు. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే, మీకు థాంక్స్ చెబుతాను.’’ పాకిస్తాన్ ఆర్మీ జనరల్‌గా, ఆ తర్వాత పాక్ అధ్యక్షుడిగా వ్యవహ రించిన ముషారఫ్ లోని వైరుధ్యాలను తేల్చిచెప్పడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు. రెండుసార్లు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. అలాగే ఇబ్బందికరమైన ఇంటర్వ్యూలను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేవారు. ఒక గ్లాసెడు విస్కీతో ఖుషీ చేసుకుంటారని పేరొందిన ఈ మితవాద ముస్లిం తాను మిలిటెంట్ సంస్థ అయిన ‘లష్కర్–ఎ–తోయిబా’కు అతిపెద్ద మద్దతుదారును అని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధిపతిగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత సామీప్యతకు ఆయన చేరుకున్నారు. ఈ దురాక్రమణదారు చేసిన రక్తపాత రహిత తిరుగుబాటును జనం ఆమోదించి స్వాగతించారు. కానీ అదే జనం దృష్టిలో హేయమైన అధ్య క్షుడిగా మారిపోయి, అభిశంసనను తప్పించడానికి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి. మరో రెండు ఆహ్లాదకరమైన విషయాలను పంచుకోనివ్వండి. నేను జనరల్ ముషారఫ్‌ను 2000 సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారి కలిశాను. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయిన కొంతకాలం తర్వాత మా సమావేశం జరిగింది. అది ఒక భార తీయ జర్నలిస్టుకు ఆయన ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ. పైగా దాన్ని దూర దర్శన్‌లో ప్రసారం చేస్తారు కనుక నేను ప్రత్యేకించి దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను పాకిస్తాన్ జనరల్‌ను నియంత అని పిలిచాను. తన నిజాయితీ, విశ్వసనీయత పూర్తిగా అనుమానించదగినవని ఆయనతో చెప్పాను. ఆయన మామూలుగా నవ్వేశారు. అయితే ఆయన ఏ మాత్రం కలవరపడే వ్యక్తి కాదని గుర్తించడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. వాణిజ్య ప్రకటనలకు విరామం ఏర్పడిన సమ యంలో, మా బంధం కొనసాగడానికి వీలుగా ఆయనతో చిన్న సంభాషణ చేయాల్సిన అవసరముందని భావించాను. దానికోసం ఆయన ధరించిన ‘టై’ గురించి ప్రశంసించాను. తర్వాత ఇంటర్వ్యూ తిరిగి ప్రారంభమైంది. అర్ధగంట తర్వాత ఇంటర్వ్యూ ముగిశాక, ఆ ఇంటర్వ్యూకు సహకరించిన సిబ్బందికి జనరల్ టీ, స్నాక్స్ ఆతిథ్యం ఇచ్చారు. కెమెరామన్‌కు ఆయన సిగరెట్ ఆఫర్ చేశారు. సౌండ్ రికార్డిస్టు భుజంపై తన చేయి వేశారు. అలాగే ఎలక్ట్రీషియన్ జోక్‌కు ఫకాలున నవ్వారు. నిమిషాల్లోనే ఆయన వాతావరణాన్ని స్నేహపూర్వకంగా మార్చేశారు. ఆ కాసేపట్లోనే నాతోటి సహచరులు ఆయన పట్ల ఆత్మీయతను పెంచుకుంటున్నట్లు గ్రహించాను. మేము వీడ్కోలు చెబుతుండగా, జనరల్ ముషారఫ్ తన టైని విప్పి, నాకు అందించారు. ‘‘దీన్ని మీరు ధరించాలని కోరుకుంటు న్నాను. దయచేసి దీన్ని మీకు ఇవ్వనివ్వండి’’ అన్నారు. ‘‘సర్, సర్, సర్’’, నేను నత్తులు పలికాను. ‘‘నేను చేసింది ఒక అమాయకపు వ్యాఖ్య. అంతకుమించి నేను మరేమీ సూచించలేదు’’ అన్నాను. ‘‘నాకు తెలుసు’’, ఆంటూ ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఇది మీ పట్ల నా సఖ్యతకు సంకేతం మాత్రమే’’ అన్నారు. ‘‘మీకు కృతజ్ఞతలు’’ అని నేను కదిలిపోయాను. తర్వాత, టైకి ఉన్న బంగారు పిన్నును, ఆయన చొక్కాకు వేలాడుతున్న బంగారు గొలుసును చూస్తూ నవ్వుతూ చెప్పాను. ‘‘నేను గోల్డ్ చెయిన్ గురించి ప్రశంసించి ఉండాల్సింది. అప్పుడు బహుశా దాన్ని కూడా మీరు నాకు ఇచ్చి ఉండేవారు.’’ అప్పుడు జనరల్ గట్టిగా నవ్వారు. ‘‘హా. ఔర్ అగర్ ఆప్ కో జూతీ పసంద్ ఆయీ హోతీ తో వో భీ మిల్ జాతీ (అవును. ఒకవేళ మీకు బూట్లు ఇష్టమైతే అవి కూడా దొరికేవి)’’ అంటూ హాస్య మాడారు. తదుపరి సంవత్సరాల్లో నేను జనరల్‌ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇస్లామాబాద్‌లోనే కాదు, లండన్, దుబాయిల్లో కూడా ఇంటర్వ్యూ చేశాను. వీటిల్లో 2009లో చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తుంది. పదవీ విరమణ చేశాక, తన అధ్యక్షత గురించి, ప్రత్యేకించి కశ్మీర్‌పై తెర వెనుక జరిగిన చర్చల గురించి, జనరల్ నిజాయితీగా మాట్లాడడానికి ఇష్టపడతారా అని నేను ప్రశ్న రాసి పంపించాను. ‘‘డియర్ కరణ్’’ అంటూ ఆయన నాకు ఈమెయిల్లో సమాధాన మిచ్చారు. ‘‘ఇప్పుడు నేను ఇంటర్నెట్ వాడకం నేర్చుకుంటున్నాను. నా సాంకేతిక పరాక్రమపు మొదటి లబ్ధిదారు మీరే.’’ అది నిజమే అని నేను కచ్చితంగా చెప్పలేను. అది అడగడానికి సమయం దొరకలేదు. కానీ జవాబివ్వడంలో అదొక మంచి ముఖస్తుతి విధానం. ఆ ఈమెయిల్ జవాబును నేను ఫ్రేము కట్టించాను. అది ఇప్పుడు నా స్టడీ రూములో వేలాడుతోంది. తర్వాత కొన్ని వారాలకు లండన్‌లో ఆయనతో మరో ఇంటర్వ్యూకు అవకాశం ఏర్పడింది. అప్పుడు పాక్ జనరల్ ఓపెన్ నెక్ షర్టుతో పౌడర్ బ్లూ జాకెట్ ధరించి ఉన్నారు. రివీయెరా హోటల్లో సెలవులు గడపడానికి వచ్చిన హాలీవుడ్ నటుడిలా కనిపించారు. సూటు, టైతో కావాలనే అతిగా డ్రెస్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. ‘‘మీరు బో టైని ఎందుకు కట్టుకోలేదు?’’ అని ఆయన అడిగారు.‘‘టై ఎలా కట్టుకోవాలో నాకు మీరు నేర్పుతారని అనుకున్నాను.’’ అధికారం కోల్పోయి, చట్టం ముందు పలాయితుడుగా ఉన్న ప్పుడు కూడా జనరల్ తన హాస్య ప్రవృత్తిని కోల్పోలేదు. ఆయన చనిపోయిన వార్త రాగానే ఎక్కువగా ఆయన రాజకీ యాలపై దృష్టి పడింది. అందుకే ఆయన వ్యక్తిత్వంలో ఇబ్బంది కరమైన వైరుధ్యాలు కనిపించాయి. అవి నిజం కూడా. అదే సమయంలో ఆయనలోని ఆహ్లాదకరమైన విషయాలను కూడా మర్చిపోకూడదు. అవి కూడా సత్యంలో భాగమే. కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ పాలన నేర్పిన పాఠాలెన్నో!
అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అని నానుడి. పాకిస్తాన్ సైనిక నాయకుడిగా, ఆ పైన పాలకుడిగా చక్రం తిప్పిన జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అధికారం పోయాక పరాయి దేశానికి పలాయనమై, ఆఖరికి అరుదైన వ్యాధితో ఆదివారం నిస్సహాయంగా కన్నుమూయాల్సి వచ్చింది. సైనిక దిగ్గజాలు అయూబ్, జియాల బాటలో నడిచి, పాకిస్తాన్‌ను నేరుగా పాలించే స్థాయికి ఎదిగిన ఈ జనరల్ మూటగట్టుకున్న అప్రతిష్ఠ అపారం. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ హఠాత్తుగా స్తంభించింది ఆయన వల్లే. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో అంత శక్తిమంతమైన అధినేత కూడా గద్దె దిగారు. అనేక వివాదాలు ముసిరిన ముషారఫ్ పాలన చిత్రమైన పరస్పర వైరుద్ధ్యాల గాథ. అవిభజిత భారతావనిలో ఢిల్లీలో పుట్టిన ఈ జనరల్ సైనికకుట్రకు పాల్పడినప్పుడు ప్రజా ప్రభుత్వాల అవి నీతితో విసిగిన పాక్ పౌరసమాజం సంతోషించింది. ఆ సంతోషం తొందరలోనే ఆవిరైంది. పాక్ భద్రతా పరిస్థితిని చిక్కుల్లో పడేసిన పాపం ముషారఫ్‌దే. తీవ్రవాదంపై పోరులో ఆయన ద్వంద్వ నీతి ఆ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తే, ఆ రాజకీయ దుశ్చర్యలో తానే దగ్ధమైన దుఃస్థితి. దాయాది దేశంలో మరణశిక్ష పడ్డ ఏకైక సైనిక పాలకుడనే దుష్కీర్తీ ఆయనదే. 2007లో రెండోసారి ఎమర్జెన్సీ విధించి, రాజద్రోహానికి పాల్పడ్డారన్న కారణంపై మరణశిక్ష పడింది. వైద్యచికిత్సకంటూ 2016లో దేశం విడిచి దుబాయ్ చేరి, అక్కడే స్వీయప్రవాసంలో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ముషారఫ్ వ్యవహారమంతా ఓ నిగూఢ ప్రహేళిక. నిరంకుశ పాలన సాగిస్తూనే, ఉదారవాద సంస్కరణలూ తెచ్చారు. మీడియా వర్ధిల్లడానికి వీలు కల్పించిందీ ఆయనే. ఆనక అవి తనకు అడ్డం తిరిగాక వాటి నోరు మూయించేందుకు ప్రయత్నించి, భంగపడ్డదీ ఆయనే. 1999 మేలో సైనిక ప్రధానాధికారిగా దుందుడుకుగా కార్గిల్ యుద్ధానికి కారణమై, పాక్ పరువు తీసిందీ ఆయనే. అదే అక్టోబర్‌లో కరాచీలో తన విమానం దిగనివ్వని ప్రధాని నవాజ్ షరీఫ్‌ను సాగనంపి, ఎమర్జెన్సీ విధించి పగ్గాలు చేపట్టి, ఆనక 2001లో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి దేశాధ్యక్షుడై, భారత్‌తో శాంతి ప్రయత్నాలు చేసిందీ ఆయనే. ఆ మాటకొస్తే ఆయన హయాంలోనే అయిదేళ్ళు భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొంది. చిత్రంగా ఈ సైనిక నియంత ఏలుబడిలోనే 2003–04ల్లో సియాచిన్, కశ్మీర్ వివాదం దాదాపు పరిష్కారమయ్యే దాకా వెళ్ళింది. ఆఖరున ఆ అవకాశం చేజారింది. 1999 నుంచి తొమ్మిదేళ్ళు పాక్‌ను పాలించిన శక్తిమంతమైన దేశాధినేత ముషారఫ్. అధ్యక్షుడైన కొద్దినెలలకే ‘తీవ్రవాదంపై పోరు’ అంటూ దోస్తీ చేసిన అమెరికాని సైతం బురిడీ కొట్టించిన తంత్రం ఆయనది. అల్‌ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కోసం అగ్రరాజ్యం జల్లెడ పడుతుంటే, అతణ్ణి పెరట్లోనే పెట్టుకొని కాలక్షేపం చేయగలిగారు. అలా ఇటు తీవ్రవాద విషనాగుతో, అటు 9/11 ఘటనతో తీవ్రవాదంపై శివాలెత్తుతున్న అమెరికాతో ఏకకాలంలో నెయ్యం నెరిపారు. ఈ కత్తి మీద సాము వికటించి, పాలు పోసిన పామే కాటేసింది. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నాడంటూ తీవ్రవాద బృందాలు రెండుసార్లు ఆయన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాయి. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను పట్టాలు తప్పేలా చేయడం సహా ఆయన ఘోర తప్పిదాలు అనేకం. రాజకీయ మనుగడ కోసం వివిధ మతతత్త్వ పార్టీలతోనూ జట్టు కట్టారు. ఆఖరికి 2006లో బలూచ్ నేత అక్బర్ ఖాన్ బుగ్తీని హతమార్చడంతో బలూచిస్తాన్‌లో దిగజారిన పరిస్థితి ఇప్పటికీ సాధారణ స్థితికి రానే లేదు. బుగ్తీ హత్యతో ఆరంభమైన ముషారఫ్ పతనం దేశ ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించాలన్న విఫలయత్నంతో వేగవంతమైంది. 2008లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ అభిశంసనకు సిద్ధమవడంతో అవమానకరమైన రీతిలో ముందుగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో మూడు నెలలకు 26/11 ముంబయ్ దాడులతో భారత్ కూడా పాఠం నేర్చుకుంది. సైనిక నియంతతోనో, సైనాధ్యక్షుడితోనో మాట్లాడినంత మాత్రాన దాయాదితో సంబంధాలు మెరుగవడానికి అన్ని వర్గాలూ కలిసొస్తాయనుకుంటే అంతకన్నా అవివేకం లేదన్న చేదు నిజం తెలిసొచ్చింది. ఇక, 2010లో ముషారఫ్ పెట్టిన ‘ఆల్ పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్’ సైతం అనేక ఇతర ఏకవ్యక్తి రాజకీయ పార్టీల లానే అచిరకాలంలోనే తెర మరుగైంది. దేశ సమస్యల్ని పరిష్కరించగల సత్తా సైన్యానికే ఉందని గుడ్డిగా నమ్మిన పాక్ సైనిక నేతల్లో కడగొట్టువాడైన ముషారఫ్ కష్టాలు కొనితెచ్చారు. ఇస్లామాబాద్‌లో అధికార కేంద్రంగా ఆనాటి నుంచి సైన్యం సాగిస్తున్న ఆటకు ఇప్పటికీ తెరపడనే లేదు. ఆయన హయాంలో జరిగిన అనేక నిర్ణయాలే ఇవాళ్టికీ పాక్ రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాల ముఖచిత్రం ఇలా మిగలడానికి కారణం. నేడు రాజకీయ అనిశ్చితి, తీవ్రవాదుల ఎదురుదాడి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తానీ పాలక శిష్టవర్గం, పౌరులు, సైన్యం ముషారఫ్ శకం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం. ఆయన తప్పొప్పులు పాకిస్తానే కాదు.. పొరుగుదేశమైన మనతో సహా ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాల్లో సైనిక జోక్యం దుష్పరిణామాలు అంత తొందరగా ఆగవు. -
తాజ్‌మహల్‌ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్‌ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్‌మహల్‌ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్‌మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్‌కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్‌గా ఉన్నారు. ముషారఫ్ తాజ్‌మహల్‌ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్‌ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్‌కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్‌ని టూరిస్ట్ గైడ్‌గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్‌మహల్‌ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్‌మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్‌మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
కరడుగట్టిన సైనిక నియంత.. ‘కార్గిల్’ విలన్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు. ఢిల్లీలో పుట్టి... పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్‌గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్‌గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు. నియంత పాలన పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్‌పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్‌లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు. మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్‌పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు ఆ దేశ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. కాగా ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపబడ్డాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2019లో పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. కానీ తరువాత 2020లో అతని మరణశిక్షను నిలిపివేస్తూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. గత 2018 నుంచి ముషారఫ్ ప్రాణాంతక వ్యాధి అమిలోయిడోసిస్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని అమెరికన్ హస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 2016 నుంచి ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నారు. గత జూన్‌లో అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్యం కారణంగా మూడు వారాల క్రితం మాజీ ఆర్మీ చీఫ్‌ను ఆసుపత్రిలో చేర్చామని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోలుకోవడం సాధ్యం కావడం లేదని, అతని అవయవాలు పనిచేయని దశలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ ట్వీట్ చేశారు. అయితే సుదీర్ఘ కాలంగా ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆదివారం(జనవరి 5) మరణించారు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ నేత మోదీనే -
ధోని జులపాల జుట్టు; ముషారఫ్‌తో ప్రత్యేక అనుబంధం
సాక్షి, వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా అతను బాగా పాపులర్ అయింది హెయిర్‌స్టైల్‌తోనే. జులపాల జుట్టుతో మైదానంలో బరిలోకి దిగే ధోనిని చూస్తూ అప్పటి ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు. ధోని హెయిర్‌స్టైల్ ఎంతలా పాపులర్ అయిందంటే.. అతని హెయిర్‌స్టైల్‌ను యువతలో కూడా చాలామంది అనుకరించడానికి ప్రయత్నించారు. తన హెయిర్‌స్టైల్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ధోనికి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ముచ్చట పడ్డాడు. ధోని హెయిర్‌స్టైల్‌ను అమితంగా ప్రేమించిన ముషారఫ్ జట్టు కట్ చేయించుకోవద్దంటూ రిక్వెస్ట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ టీమిండియా ఫ్యాన్స్ మరోసారి దానికి సంబంధించిన వీడియోనూ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ మారింది. మరోసారి ఆ విషయాలను గుర్తుచేసుకుందాం. 2005-2006లో పాకిస్థాన్ పర్యటనకి వెళ్లిన రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్రాగా.. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. ఛేదనలో భారత్ జట్టుని గెలిపించాడు. ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలో భారత్ 292/5తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ని ధోనీ ఫినిష్ చేసిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. మ్యాచ్ అనంతరం ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ కట్ చేయించుకోకు’’ అని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టయిల్ని కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత క్రమంగా తన హెయిర్‌స్టైల్‌ను మారుస్తూ వచ్చాడు. -
ముషారఫ్‌కు భారీ ఊరట
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గత డిసెంబర్లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు కూడా చట్టప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కేసు నమోదు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం వరకు అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది’ అని పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ఇష్తియాక్ ఖాన్ తెలిపారు. ఈ తీర్పుతో జనరల్ ముషారఫ్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. కాగా, లాహోర్ హైకోర్టు తీర్పుపై జనరల్ ముషారఫ్ హర్షం వ్యక్తం చేశారు. -
సరికొత్త చరిత్ర.. ఆయనకు ఉరిశిక్ష!
ఎన్నికల్లో కుట్ర లేదని ఈ ఏడాది ప్రారంభంలో క్లీన్చిట్ పొందిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అనూహ్యంగా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. గే వివాహాలను తైవాన్ చట్టబద్ధం చేయగా... స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని బ్రూనే నిర్ణయం తీసుకుంది. కెనడా పీఠంపై మరోసారి ట్రూడో కొలువుదీరగా.. బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతి పటేల్ కీలక బాధ్యతలు స్వీకరించారు. వీటితో పాటు ఈ ఏడాది చోటుచేసుకున్న మరెన్నో అంతర్జాతీయ పరిణామాలపై సాక్షిడాట్ కామ్ అందిస్తున్న సంక్షిప్త వార్తల సమాహారం. జనవరి 5 హౌజ్‌లో.. 181 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. కొత్తగా కొలువుదీరిన అమెరికా ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్‌లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. జనవరి 5 అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్! అమెరికా ప్రయోగించిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించింది. హెచ్- 6కె అనే బాంబర్ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. జనవరి 8 బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా కేబినెట్లో కేవలం ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. అమెరికా దాడుల్లో అల్ ఖైదా బడావీ మృతి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్ అల్ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్‌ఖైదా తరఫున యెమెన్‌లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. జనవరి 11 వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. కాగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. జనవరి 13 అమెరికా చరిత్రలో షట్‌డౌన్ రికార్డు అమెరికా-మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్‌డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్‌డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వం అధిగమించింది. జనవరి 18 ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. జనవరి 29 పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!! సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్‌లోని ఓ కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్-షాదాద్కోట్ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. జనవరి 31 అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26 300 మంది ఉగ్రవాదుల హతం? పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. మార్చి 26 అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని రాబర్ట్ ముల్లర్ విచారణ కమిటీ తేల్చింది. మార్చి 29 ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..! ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. అదే విధంగా.. దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష అమలు చేయనుంది. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. ఏప్రిల్ 21 బాంబు పేలుళ్లతో రక్తమోడిన కొలంబో శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. మే 17 గే వివాహాలను చట్టబద్ధం చేసిన తైవాన్ స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు సా యింగ్-వెన్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. జూన్ 6 థాయ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా(65) ఎన్నికయ్యారు. 2014లో ఇంగ్లక్ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. జూలై 01 ఉత్తర కొరియాలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్‌మున్‌జొమ్ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమైంది. జూలై 26 అమెరికాలో మళ్లీ మరణశిక్షల అమలు దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. జూలై 26 బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్ బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్.. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్(హోం మంత్రి), రిషి సునక్(ఆర్థిక శాఖ సహాయ మంత్రి), అలోక్ శర్మ (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 15 భారత్‌ను హెచ్చరించిన ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విమర్శించారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్‌లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. సెప్టెంబరు 7 ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబరు 11 ఇమ్రాన్‌కు ఐరాస షాక్ జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ వ్యవహారం భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటరీస్ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ స్పష్టం చేశారు. సెప్టెంబరు 23 చరిత్రాత్మకంగా హౌడీ మోదీ! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో హ్యూస్టన్‌లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్‌ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. అక్టోబరు 23 కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో! కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకొన్నారు. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్‌కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డిస్ట్రిక్ట్స్‌లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అక్టోబరు 29 ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా బాగ్దాదీ చనిపోయాడని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నవంబరు 9 కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం భారత్, పాకిస్తాన్లను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని.. పాక్‌లోని నరోవల్ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. నవంబరు 19 పాక్ అణు క్షిపణి పరీక్ష భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. నవంబరు 21 ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. నవంబరు 26 హాంకాంగ్ ఎన్నికల్లో చైనాకు షాక్ హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన 155 మంది ఓడిపోయారు. నవంబరు 29 శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల సాయం శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. డిసెంబరు 4 అనూహ్యం: కమలా హ్యారిస్ అవుట్! అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల అభ్యర్థిత్వ పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ ప్రకటన చేశారు. డిసెంబరు 9 మిస్ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. డిసెంబరు 12 ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్నవారే. డిసెంబరు 15 మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్-2019 కిరీటం దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. డిసెంబరు 18 ముషారఫ్‌కు మరణశిక్ష సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. డిసెంబరు 20 ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. అనంతరం సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
‘చచ్చినా అతన్ని వదలొద్దు.. శవాన్ని అయినా ఉరి తీయండి’
కరాచి : రాజద్రోహం కేసులో ఉరిశిక్ష పడిన మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజద్రోహం కేసు తీర్పు వివరాలను ముగ్గురు సభ్యుల బెంచ్ గురువారం సమగ్రంగా చదివి వినిపించింది. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో మూడు రోజులపాటు వేలాడదీయాలని పేర్కొంది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్‌కి పారిపోయిన ముషారఫ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. (చదవండి : ముషారఫ్‌కు మరణశిక్ష) రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్‌కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించగా జస్టిస్ కరీం, జస్టిస్ నజారుల్లా అక్బర్ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ వకార్ అహ్మద్, జస్టిస్ కరీం ముషారఫ్ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి : ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు) -
ముషారఫ్ ఎప్పటికీ ద్రోహి కాదన్న పాక్ ఆర్మీ
-
ముషారఫ్‌కు పాక్ ప్రభుత్వం మద్దతు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్‌కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. -
పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
-
ముషారఫ్‌కు మరణశిక్ష
ఇస్లామాబాద్: సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్ పై ఈ కేసు నమోదైంది.పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింద్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్‌ల బెంచ్ మంగళవారం వెల్లడించింది. కోర్టు తీర్పు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ముషారఫ్ అందుబాటులో లేరు. అయితే ఫిర్యాదులను, రికార్డులను, వాదనలు, కేసులోని వాస్తవాలను పరిశీలించిన మీదట ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్‌కి వ్యతిరేకంగా మెజారిటీ తీర్పుని వెల్లడించారు. 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షస్థానంలో ఉండి ముషారఫ్ సైనికాధిపతిగా వ్యవహరించడంతో ముషారఫ్ పాలనలో జనం విసిగిపోయారు. సుప్రీంకోర్టు జడ్జీలనూ ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచారు. అనేక మంది జడ్జీలను విధుల నుంచి తొలగించారు. తర్వాత 2008లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఓ రాజకీయ పార్టీ వైఫల్యంతో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ముషారఫ్‌కి ఈ శిక్ష అమలు చేయడం ఇప్పుడు సవాల్‌గా మారనుంది. దుబాయ్‌లోని ఆసుపత్రి పడకపై నుంచి ముషారఫ్ గత నెలలో ఓ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. అందులో కేసులో తనపై న్యాయమైన విచారణ జరగడంలేదని ఆరోపించారు. అలాగే ‘జాతికి సేవ చేశాను. దేశ అభ్యున్నతి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అని వీడియోలో ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుని ముషారఫ్ పై కోర్టులో చాలెంజ్ చేయొచ్చని న్యాయనిపుణులు వెల్లడించారు. అమెరికాపై నవంబర్ 9 న జరిగిన దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో ముషారఫ్ అమెరికా పక్షం వహించడం పట్ల మతపరమైన పార్టీలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ హింసకు దారితీశాయి. -
మాజీ నియంతకు మరణశిక్ష
పాకిస్తాన్‌ను ఒక అర్థరాత్రి చెరబట్టి, ఏ రకమైన ప్రజామోదమూ లేకుండా తొమ్మిదేళ్లపాటు పాలించి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌కు అక్కడి ప్రత్యేక న్యాయ స్థానం దేశద్రోహ నేరంకింద మరణశిక్ష విధించడం ఆ దేశంలో మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. సుప్రీంకోర్టుకు అప్పీల్‌కి వెళ్లినప్పుడు ఈ శిక్ష నిలబడుతుందా... పాక్ సైన్యం ఈ తీర్పును ఎలా పరిగణిస్తుందన్న అంశాలు పక్కనబెడితే పాకిస్తాన్ చరిత్రలో సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న సైనికాధికారికి పౌర న్యాయస్థానంలో మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఇప్పటికే అనారోగ్యంతో దుబాయ్ ఆసుపత్రిలో ఉన్న ముషార్రఫ్ తన వాదన వినకుండా తీర్పునిచ్చారని, తనను వేధిస్తున్నారని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చుగానీ... ఆయన చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు. 1999 అక్టోబర్‌లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ శ్రీలంక పర్యటనకెళ్లినప్పుడు రక్తరహిత కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ముషార్రఫ్ ఆ తర్వాత వరసబెట్టి ప్రజా స్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ముందుగా మీడియా పీకనొక్కి, ఆ తర్వాత న్యాయవ్యవస్థ పనిపట్టారు. 2007లో దేశంలో రాజ్యాంగాన్ని రద్దుచేసి, కొత్తగా తాత్కాలిక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దానికింద ఎమర్జెన్సీ విధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ మూర్తులంతా పదవుల్నించి తప్పుకుని కొత్త రాజ్యాంగం కింద ప్రమాణస్వీకారం చేయాలని హుకుం జారీచేశారు. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని తక్షణం నిలిపేస్తున్నట్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వీరిని, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తెకర్ చౌధ్రితోసహా వంద మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచారు. వివిధ హైకోర్టులు, ఆ కిందిస్థాయి న్యాయస్థానాలకు చెందిన 76 మంది న్యాయమూర్తులు కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకులందరినీ ఖైదు చేశారు. ఈ చర్య తర్వాత పాకిస్తాన్ అంతటా ఆందోళనలు రాజుకోవడంతో ముషార్రఫ్ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసుకుని నేరుగా పాలించడం మొదలుపెట్టారు. అటు సైనిక దళాల చీఫ్‌గా, ఇటు దేశాధ్యక్షుడిగా జోడు పదవుల్లో ఉన్న ముషార్రఫ్‌పై ఏదో ఒక పదవే ఉంచుకోవాలంటూ సైన్యం నుంచి కూడా ఒత్తిళ్లు రావడంతో సైనిక దళాల పదవికి స్వస్తి చెప్పి అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించు కున్నారు. తనకు ఆప్తుడైన ఐఎస్ఐ చీఫ్ కయానీకి సైనిక దళాల చీఫ్ పదవి కట్టబెట్టారు. రాజ్యాం గాన్ని రద్దు చేసిన కేసులోనే ఇప్పుడు ముషార్రఫ్‌కు ఇప్పుడు మరణశిక్ష పడింది. తనను ఏరి కోరి తెచ్చుకున్న నవాజ్ షరీఫ్‌కు తాను ఎసరు పెట్టినట్టే... తాను తెచ్చుకున్న జనరల్ కయానీ తనకే ఎదురు తిరగడం ముషార్రఫ్‌కు అనుభవంలోకొచ్చింది. 2008 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ముషార్రఫ్ కనుసన్నల్లో పనిచేసే పీఎంఎల్–క్యూ తుడిచిపెట్టుకుపోగా పీపీపీ ఘనవిజయం సాధించింది. తన టక్కుటమార విద్యలన్నీ విఫలమయ్యాయని గ్రహించాక ఇక అయిష్టంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పౌర ప్రభుత్వాలను కబ్జా చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైనికాధికారుల్లో ముషార్రఫ్ మొదటివారేమీ కాదు. ఆ దేశం దాదాపు 35 ఏళ్లపాటు సైనిక పదఘట్టనల్లోనే బతుకీడ్చింది. తమ పాలనలోని అవినీతి జనం కళ్లబడకుండా, పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాల జోలికి వారు పోకుండా ఇస్లామిక్ సిద్ధాంతం పేరు చెప్పి ప్రజలను బుజ్జగించడం సైనిక పాలకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహం. ఆ తానులో ముక్కగా ముషార్రఫ్ కూడా దాన్నే కొనసాగించారు. అటు అఫ్ఘాన్‌లో తాలిబన్లకు బహి రంగంగా సహాయసహకారాలిస్తూ, భారత్‌లో ఉగ్రవాద దాడులు చేసేందుకు ప్రోత్సహించారు. పాక్‌లో తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం అవసరం గనుక అమెరికా ఈ కుట్రలన్నిటికీ సహక రిస్తూ వచ్చింది. 2001లో అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేశాక ఇదంతా మారక తప్పలేదు. ఆ తర్వాత చాటుమాటుగా ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ వచ్చారు. ఈ సంస్కృతిని ఇంకా పాక్ విడనాడలేదు. ఇప్పుడు తీర్పు వెలువరించిన ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించిన వైనాన్ని గమనిస్తే, ముషార్రఫ్‌ను కాపాడటానికి అది ఎన్ని పాట్లు పడిందో అర్థమవుతుంది. ఈ పనంతా మొదట్లో ముషార్రఫ్ చేసుకోవాల్సి వచ్చింది. 2013నాటి ఈ కేసు విచారణలో అడుగు ముందుకు పడకుండా ఎప్పటికప్పుడు ఆయన ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూనే వచ్చారు. అవన్నీ వృధాయేనని అర్థమయ్యాక 2016లో ఆయన కొద్దిరోజుల్లో తిరిగొస్తానని నమ్మబలికి దేశం నుంచి నిష్క్రమించారు. ఈ మూడేళ్లూ చడీచప్పుడూ చేయని ఇమ్రాన్ సర్కార్ ఇక తీర్పు వెలువడటం తథ్యమని తెలిశాక ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వకుండా ఆపాలంటూ పిటిషన్ వేసింది. అలా నెలరోజులు గడిచిపోయింది. ఆ అడ్డంకి కూడా అధిగమించి ఈ నెల 17న తీర్పునిస్తామని ఈ నెల 5న ప్రకటించాక ముషార్రఫ్‌తో పాటు అప్పటి ప్రధాని షౌకత్ అజీజ్, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ దోగర్, అప్పటి న్యాయమంత్రి జహీద్ హమీద్‌లను కూడా నిందితులుగా చేర్చాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వీరందరినీ చేర్చి కొత్తగా విచారించాలని కోరింది. ఇన్నేళ్లపాటు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని మందలించి, పిటిషన్‌ను కొట్టేసి ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరిం చింది. తుది అప్పీల్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ తీర్పును ఎటూ సుప్రీంకోర్టు నిలిపివేస్తుంది. ఆ నిర్ణయం ఇప్పట్లో రాదనే చెప్పాలి. అక్కడ కూడా చుక్కెదురయ్యాక దేశాధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టొచ్చు. కానీ ఆ దేశ రాజకీయాలపై ఇంకా సైన్యం పట్టుసడలని వర్తమానంలో ఈ తీర్పు ప్రతీ కాత్మకమైనదే అయినా ఎన్నదగినది. దీని పర్యవసానాలెలా ఉంటాయో మున్ముందు చూడాలి. -
సంచలన తీర్పు: ముషారఫ్‌కు ఉరిశిక్ష
-
సంచలన తీర్పు: ముషారఫ్‌కు ఉరిశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌లోని లాహోర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేకంగా 2007 నవంబర్ 3న దేశంలో ఎమర్జెనీ విధించారు. ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బందించారు. అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. కేసు విచారణ జరుగుతుండగానే దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా దిక్కరించారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
కశ్మీర్ మా రక్తంలోనే ఉంది
ఇస్లామాబాద్: కశ్మీర్ తమ రక్తంలోనే ఉందని, కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు నిలబడతారని పాక్ మాజీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. పాక్ శాంతి మంత్రాన్ని జపిస్తున్నా భారత్ భయపెట్టాలని చూస్తోందన్నారు. ‘భారత్ కార్గిల్ యుద్ధాన్ని మరచిపోయిందేమో.. యుద్ధం ముగిసే ముందు అమెరికా సాయం కోరింది’ అని వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో దుబాయ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఏపీఎంఎల్) అధ్యక్షుడిగా ఉన్న 76 ఏళ్ల ముషారఫ్ ఆయన అనారోగ్యంతో ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్కేక ప్రతిపత్తిని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలిసారి ఆయన స్సందించారు. కశ్మీర్ పౌరులకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ శాంతి కోరుకుంటోందని, దాన్ని తమ బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. 1999 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్.. బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ముషారఫ్ ఇంట్లో మికా సింగ్.. నెటిజన్ల ఆగ్రహం
కరాచీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్, పాక్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్‌లో బాలీవుడ్ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పాకిస్తాన్‌లోని చాలామందికి నచ్చలేదు. దీంతో ఇరుదేశాల నెటిజన్లు ఈ వీడియోపై ట్విటర్లో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నైలా ఇనాయత్.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘జనరల్ పర్వేజ్ ముషారఫ్ బందువుల ఫంక్షన్లో ఓ భారత సింగర్ ప్రదర్శన ఇచ్చారు. సంతోషం.. అదే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ఇది జరిగి ఉంటే?.. అంటూ ప్రశ్నించారు. అలాగే ఓ పాకిస్తానీ ట్వీట్ చేస్తూ.. ‘ఒక పక్క ఇండియా చేతిలో కశ్మీర్ పతనం అవుతోంది. మరో పక్క కరాచీలో భారత కళాకారుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు. నయా పాకిస్తాన్ అంటే ఇదేనేమో!’ అని కామెంట్ చేశారు. ‘బాలీవుడ్ సినిమాలు బ్యాన్ చేశారు. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపేశారు. పాక్ గగనతలంలో భారత విమానాల రాకపోకలను నిషేధించారు. సరే.. విమానాలు రద్దు అయితే, వీసాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా పాక్ వచ్చారు. ఎందుకంటే ఈ నయా పాకిస్తాన్ ఓ షేమ్ పాకిస్తాన్’ అని ఆ నెటిజన్ మండిపడ్డాడు. దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాజకీయం వేరు.. కళలు వేరు.. కళలకు హద్దులు లేవు’ అని పేర్కొంటున్నారు. -
పాక్ ముసుగు తొలగించిన ముషార్రఫ్
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బహిర్గతం చేశారు. భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ను పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌ను వినియోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్‌కు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్కూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అయినప్పటికీ.. తన పాలన కాలంలో దానిని భారత్‌పై దాడుల కోసం ఇంటెలిజెన్స్ వాడుతుండేదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడుగా ఉన్న కాలంలోనే జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించిదని ఆరోపించారు. అయితే మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జర్నలిస్ట్ ముషార్రఫ్‌ను ప్రశ్నించారు. దీనికి ముషార్రఫ్ అప్పటి పరిస్థితులు చాలా భిన్నమైనవని.. ఆ కాలంలో భారత్, పాక్‌లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేసేవని పేర్కొన్నారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో పాటు భారత్‌లో జరిగిన చాలా ఉగ్ర దాడుల వెనుకు జైషే చీఫ్ మసూద్ అజార్ హస్తం ఉన్న సంగతి తెలిసిందే. -
అధ్యక్షున్ని అవుతా.. సాయం చేయండి
వాషింగ్టన్: పాకిస్తాన్లో మళ్లీ తాను అధికారంలోకి రావడానికి రహస్యంగా సాయం చేయాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అమెరికా చట్ట సభ్యులను కోరుతున్న వీడియో బయటపడింది. పాక్‌లోని అబోటాబాద్‌లో అల్‌కాయిదా చీఫ్ లాడెన్ స్థావరాన్ని గుర్తించడంలో నిఘా సంస్థ ఐఎస్ఐ విఫలం కావడంపై తాను సిగ్గు పడుతున్నట్లు ముషార్రఫ్ చెప్పారు. అమెరికా ఇచ్చిన నిధులతోనే ఉగ్రవాదంపై పోరాడామనీ, పాక్‌లో పేదరికాన్ని తగ్గించామని చెప్పారు. తాము నిధుల్ని ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇచ్చామనీ, పేదరిక నిర్మూలనకు కాదని అమెరికా చట్టసభ్యులు ఘాటుగా స్పందించారు. ‘అబోటాబాద్‌లో లాడెన్ ఆచూకీ తెలుసుకోకపోవడం ఐఎస్ఐ నిర్లక్ష్యమే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా 2001, సెప్టెంబర్ 11న ఉగ్రదాడుల విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది’ అని తెలిపారు. 2012 తర్వాత తీసినట్లు భావిస్తున్న ఈ వీడియోను ముషార్రఫ్ వ్యతిరేకి అయిన కాలమిస్టు గుల్ బుఖారీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్‌కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. -
ముషార్రఫ్ వైఖరి సరైనదే: కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడటం లేదు.. వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషార్రఫ్ అన్నారు. నేను కూడా తొలి నుంచి అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్ పాక్ మిలటరీ అధికారులతోను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం నాకు తెలుసున’ని తెలిపారు. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ పుస్తకం ఈ నెల 25 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దంలో ఓడిన తర్వాత.. తన లక్ష్యాన్ని చేధించడంలో ముషార్రఫ్ విఫలమయ్యారని తెలిపారు. ఆ తర్వాత కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో జరిగిన లాహోర్ డిక్లరేషన్‌తో కశ్మీర్ ప్రజల ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. కాగా, సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్ లాంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడటం బాధ కలిగించిదన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్ కూడా భారత ఆర్మీని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కూడా సోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. -
పిరికివాడిని కాదు : మాజీ అధ్యక్షుడు
కరాచీ: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి తన సొంత దేశం రావాలని ప్రయత్నిస్తున్నారు. జూన్ 25న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ పాక్ సుప్రీంకోర్టు తనను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తాను పాక్‌కు తిరిగి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ముషార్రఫ్ భావించారు. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పాక్‌కి తిరిగి రావచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మొదట తన ముందు హాజరైన తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సకిబ్ నసీర్ పేర్కొన్నారు. తనను స్వదేశం రప్పించి అరెస్ట్ చేసేందుకే సుప్రీంకోర్టు ఆ సందేశం పంపిందని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు. తనకు పాక్ రావాలని ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ అంశంపై మాట్లాడుతూ.. పోటీ చేసేందుకు తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరఫున రెండు స్థానాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించానని, ఎన్నికల అధికారి వాటిని తిరిస్కరించారని తెలిపారు. తాను పిరికివాడిని కాదని ప్రపంచం మొత్తం తెలుసునని, త్వరలోనే దేశానికి తిరిగి వస్తానని ముషార్రఫ్ పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముషార్రఫ్ 2016లో దేశం విడిచి వెళ్లి రహస్యంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.