ఔను! దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు!
భారత్‌కు ఎందుకు అప్పగించాలి?
లాహోర్: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఓ పాకిస్థాన్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషార్రఫ్.. దావూద్‌ను అప్పగించాలన్న భారత్ డిమాండ్‌పై స్పందించారు. 'భారత్ చాలాకాలంగా పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఎందుకు ఇప్పుడు మనం మంచివారిగా మారి వారికి సహకరించాలి? దావూద్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతను తప్పక ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. భారత్ ముస్లింలను చంపేస్తోంది. దానిపై దావూద్ ప్రతిస్పందిస్తున్నాడు' అని అన్నారు. పాక్ ఆశ్రయంలోనే దావూద్ ఉన్నాడన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
కరాచీలోని ఓ విలాసవంతమైన భవనంలో దావూద్ దర్జాగా జీవిస్తున్నాడని భారత్ అనేకసారి ఆధారాలతో పేర్కొన్నా.. పాక్ మాత్రం అతను తమ దేశంలో లేడని బుకాయిస్తోంది. గత పదేళ్లుగా ఈ విషయంలో ఎన్ని ఆధారాలు భారత్ సమర్పించినా.. పాక్ మాత్రం తన వాదన మార్చుకోవడంలేదు. ఒసామా బిన్ లాడెన్ కూడా పాక్‌లోనే తలదాచుకుంటున్నాడని భారత్ గతంలో ఆరోపించగా.. ఆ తర్వాత అమెరికా నేవీ సీల్స్ 2011లో అతన్ని హతమార్చిన సంగతి తెలిసిందే.