పాక్‌లో నియంతల పాలనే బెస్ట్: ముషార్రఫ్
ఇస్లామాబాద్: తాను పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందని, కానీ భారత్ ఎదురుదాడులకు దిగితే పరిస్థితి ఏంటని వెనక్కి తగ్గినట్లు ఇటీవల పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. బుధవారం బీబీసీ ఉర్దూ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి భారత్‌కు వ్యతిరేకంగా పాక్ మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యలుచేశారు. నియంతల (ఆర్మీ చీఫ్‌లు) పాలనలో భారత్‌పై పాక్ ప్రాబల్యం అధికంగా ఉండేదని, కానీ ప్రజల చేత ఎన్నుకైన ప్రభుత్వాల పాలనలో అంతా నాశనమైందని విమర్శించారు. ఆర్మీ చీఫ్‌లు ఫీల్డ్ మార్షల్ అయుబ్ ఖాన్, జనరల్ జియా ఉల్ హక్‌ల పాలనలో పాక్ సరైన మార్గంలో నడిచిందన్నారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ భారత్‌తో సంబంధాలంటూ ఎన్నో అంశాలలో పైచేయి సాధించలేక పోయారన్నారు. షరీఫ్ పాలన అంతా అమ్ముకునే విధానాలేనని దుయ్యబట్టారు. జియా ఉల్ హక్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా, ముజాహిద్దీన్ సాయంతో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం సాధ్యమైందన్నారు. డిక్టేటర్స్ పాలనలో ఉన్న ఆసియా దేశాలు ఎంతో ప్రగతి సాధించాయని అభిప్రాయపడ్డారు.
1999లో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి అధికారం హస్తగతం చేసుకోవడంపై స్పందించారు. ఆర్మీ చీఫ్‌ల పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని, వారి అభీష్టం మేరకు తాను తిరుగుబాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు చేత ఎన్నికైన నేతలు దేశాన్ని నాశనం చేయగా.. ఆర్మీ చీఫ్‌లు మాత్రం ప్రజల హక్కులను రక్షించినట్లు వివరించారు. 2001 నుంచి 2008 వరకు ముషార్రప్ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు.