వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి
కాశ్మీర్‌పై ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు
భారత్‌తో యుద్ధానికి పాక్ సైన్యం సిద్ధమని వెల్లడి
మోదీ ముస్లిం వ్యతిరేకి, పాక్ వ్యతిరేకి అని ఆరోపణ
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్‌తో మాట్లాడుతూ భారత్‌తో యుద్ధానికి పాక్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. అలాగే పాక్‌లో లక్షలాది ప్రజలు కాశ్మీర్ కోసం పోరాడేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. పాక్ తిరిగి దాడి చేయబోదన్న భ్రమలో ఉండరాదని భారత్‌ను హెచ్చరించారు. ‘‘కాశ్మీర్‌లో భారత సైన్యం తో మేం ముందు, వెనక నుంచి కూడా పోరాడగలం. ‘మేం ముస్లింలము, మా చెంపలపై కొడితే రెండోవైపు చూపించం. దాడి చేస్తే మేం తగిన రీతిలో బుద్ధిచెప్పగలం’ అని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇటీవలి కాల్పుల ఉదంతంపై ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం అంతర్గతంగా బలంగా ఉంటే పాక్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పైనా ముషార్రఫ్ ఆరోపణలు గుప్పించారు. మోదీని ముస్లిం వ్యతిరేకిగా, పాక్ వ్యతిరేకిగా అభివర్ణించారు. మోదీ ప్రమాణస్వీకారానికి పాక్ ప్రధాని వెళ్లడాన్ని ముషార్రఫ్ తప్పుబట్టారు. పాక్‌కు భారత్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా కల్పించడాన్ని జోక్‌గా అభివర్ణించారు.
యుద్ధాన్ని గుర్తుచేసుకున్న నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 1965 నాటి భారత్-పాక్ యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో యుద్ధ విమానాలు లాహోర్ గగనతంలో పోరు సాగించడాన్ని చూశానన్నారు. గురువారం ఇస్లామాబాద్‌లోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో వైమానిక చీఫ్ ఎయిర్‌చీఫ్ మార్షల్ తాహిర్ రఫీక్‌తో భేటీ సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతకుముందు షరీఫ్ భద్రతాపరమైన అంశాలపై చర్చించేందుకు సైనిక, ప్రభుత్వ నేతలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.