మోదీపై ముషార్రఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ముంబైపై 2008లో ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనలో జమాత్–ఉద్–దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర లేదని పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాకిస్తాన్ సయీద్‌ను అసలు ఉగ్రవాదిగా భావించడమే లేదన్నారు. సయీద్ గృహనిర్భంధంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘హఫీజ్ సమస్య భారత్‌కే పరిమితం. దీని గురించి అమెరికాలో ఎవ్వరూ మాట్లాడర’ని స్పష్టం చేశారు.
ప్రస్తుత భారత్–పాక్ సంబంధాలపై ముషార్రఫ్ స్పందిస్తూ, ఇరుదేశాల మధ్య శాంతిని పెంపొందించగల శక్తి ఒక్క నరేంద్ర మోదీకే ఉందని అభిప్రాయపడ్డారు. కానీ శాంతి నెలకొనడం ఆయనకు ఇష్టం లేదన్నారు. 2018లో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ముషార్రఫ్ ప్రకటించారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదని, మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో 68 ఏళ్ల సయీద్‌ను ఇంతకుముందు పాకిస్తాన్ 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచింది.