హఫీద్‌ సయీద్‌ అంటే నాకిష్టం | I like Hafeez Saeed a lot | Sakshi
Sakshi News home page

హఫీద్‌ సయీద్‌ అంటే నాకిష్టం, జిహాద్‌కు ప్రాణమిస్తాడు

Published Wed, Nov 29 2017 10:37 AM | Last Updated on Wed, Nov 29 2017 10:48 AM

I like Hafeez Saeed a lot - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ సైనిక నియంత జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన విషయాలను ప్రకటించారు. తనకు జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన హఫీజ్‌ సయీద్‌ అంటే ఇష్టమని ప్రకటించారు. కశ్మీర్‌ వేర్పాటువాదులకు సహకారం అందించడం.. ఆ ప్రాంతంలో జిహాద్‌, ఉగ్రదాడులకు కారణమవుతున్న హఫీజ్‌ సయీద్‌ పట్ల అభిమానం ఉందని ముషారఫ్‌ ప్రకటించారు. ‘నాకు హఫీజ్‌ సయీద్‌ అంటే చాలా ఇష్టం. కశ్మీర్‌లో వేర్పాటు వాద కార్యక్రమాలకు ఆయన స్థాపించిన జమాత్‌ ఉద్‌ దవా ముందుకు నడిపిస్తోంద’ని పాకిస్తాన్‌లోని ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ముషారఫ్‌ చెప్పారు. లష్కరే తోయిబాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్‌ స్పష్టం చేశారు.

నేను సమర్ధిస్తా!
భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే తోయిబా, జీహాద్‌ను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్‌ తెలిపారు. అంతేకాక తాను అధికారంలో ఉన్న సమయంలో హఫీజ్‌ సయీద్‌తో పలుమార్లు భేటీ అయినట్లు వెల్లడించారు.

సైనిక చర్యకు నేను అనుకూలమే!
జమ్మూకశ్మీర్‌పై సైనిక చర్యకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉన్నట్లు ముషారఫ్‌ ప్రకటించారు. భారత సైన్యం చాలా శక్తివంతమైనది.. ఆ సైన్యాన్ని ఎదుర్కోవడం క్లిష్టమని ఆయన తెలిపారు. అదే సమయంలో కశ్మీర్‌లో లష్కరే తోయిబా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అమెరికా సహకారంతో భారత్‌ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో సఫలమైందన్నారు.

ముంబై దాడుల్లో హఫీజ్‌ హస్తం లేదు!
భారత్‌ను కుదిపేసిన 26/11 ముంబై దాడుల సూత్రధారిగా హఫీజ్‌ సయీద్‌ను పేర్కొనడాన్ని ముషారఫ్‌ తప్పు పట్టారు. ఆ దాడులకు జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే తోయిబాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. హఫీజ్‌ సయీద్‌ను ఉగ్రవాదిగా పిలిచేందుకు పాకిస్తాన్‌లో ఎవరూ ఇష్టపడరని ముషారఫ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement