ఇటీవల మరణించిన పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌లోని వైరుద్ధ్యాలను తేల్చడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు. రెండుసార్లు పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. మితవాద ముస్లిం అయిన ముషారఫ్, లష్కర్–ఎ–తోయిబాకు అతిపెద్ద మద్దతుదారునని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధినేతగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం విషయంలో పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత చేరువకు రాగలిగారు. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి.
జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఒక వైరుద్ధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల్లో కొన్ని సంతోషకర మైనవి. కొన్ని ఇబ్బందికరమైనవి. కానీ ఆయన మాత్రం వాటికి మించిన వ్యక్తిత్వంతో ఉండేవారు. ఆయన దుస్తులు ఎంత నీటుగా ఉండేవంటే అందరినీ అవి ఆకర్షించేవి. అలాగే ఆయన పదాలతో ఆడుకునేవారు. 2002 అధ్యక్ష ‘ఎన్నికల్లో’ ఆయన 98 శాతం ఆధిక్యత సాధించినప్పుడు ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక అభి నందించింది. దానికి ఆయన చెప్పిన సమాధానం ఆ పత్రిక రిపోర్టర్‌ను నివ్వెరపర్చింది. ‘‘మీరు వ్యంగ్యంగా చెప్పినట్లయితే, నేను మాట్లాడేది ఏమీ ఉండదు. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే, మీకు థాంక్స్ చెబుతాను.’’ పాకిస్తాన్ ఆర్మీ జనరల్‌గా, ఆ తర్వాత పాక్ అధ్యక్షుడిగా వ్యవహ రించిన ముషారఫ్ లోని వైరుధ్యాలను తేల్చిచెప్పడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు.
రెండుసార్లు పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. అలాగే ఇబ్బందికరమైన ఇంటర్వ్యూలను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేవారు. ఒక గ్లాసెడు విస్కీతో ఖుషీ చేసుకుంటారని పేరొందిన ఈ మితవాద ముస్లిం తాను మిలిటెంట్ సంస్థ అయిన ‘లష్కర్–ఎ–తోయిబా’కు అతిపెద్ద మద్దతుదారును అని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధిపతిగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత సామీప్యతకు ఆయన చేరుకున్నారు. ఈ దురాక్రమణదారు చేసిన రక్తపాత రహిత తిరుగుబాటును జనం ఆమోదించి స్వాగతించారు. కానీ అదే జనం దృష్టిలో హేయమైన అధ్య క్షుడిగా మారిపోయి, అభిశంసనను తప్పించడానికి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి. మరో రెండు ఆహ్లాదకరమైన విషయాలను పంచుకోనివ్వండి. నేను జనరల్ ముషారఫ్‌ను 2000 సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారి కలిశాను. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయిన కొంతకాలం తర్వాత మా సమావేశం జరిగింది. అది ఒక భార తీయ జర్నలిస్టుకు ఆయన ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ. పైగా దాన్ని దూర దర్శన్‌లో ప్రసారం చేస్తారు కనుక నేను ప్రత్యేకించి దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
నేను పాకిస్తాన్ జనరల్‌ను నియంత అని పిలిచాను. తన నిజాయితీ, విశ్వసనీయత పూర్తిగా అనుమానించదగినవని ఆయనతో చెప్పాను. ఆయన మామూలుగా నవ్వేశారు. అయితే ఆయన ఏ మాత్రం కలవరపడే వ్యక్తి కాదని గుర్తించడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. వాణిజ్య ప్రకటనలకు విరామం ఏర్పడిన సమ యంలో, మా బంధం కొనసాగడానికి వీలుగా ఆయనతో చిన్న సంభాషణ చేయాల్సిన అవసరముందని భావించాను. దానికోసం ఆయన ధరించిన ‘టై’ గురించి ప్రశంసించాను. తర్వాత ఇంటర్వ్యూ తిరిగి ప్రారంభమైంది. అర్ధగంట తర్వాత ఇంటర్వ్యూ ముగిశాక, ఆ ఇంటర్వ్యూకు సహకరించిన సిబ్బందికి జనరల్ టీ, స్నాక్స్ ఆతిథ్యం ఇచ్చారు. కెమెరామన్‌కు ఆయన సిగరెట్ ఆఫర్ చేశారు. సౌండ్ రికార్డిస్టు భుజంపై తన చేయి వేశారు. అలాగే ఎలక్ట్రీషియన్ జోక్‌కు ఫకాలున నవ్వారు. నిమిషాల్లోనే ఆయన వాతావరణాన్ని స్నేహపూర్వకంగా మార్చేశారు. ఆ కాసేపట్లోనే నాతోటి సహచరులు ఆయన పట్ల ఆత్మీయతను పెంచుకుంటున్నట్లు గ్రహించాను. మేము వీడ్కోలు చెబుతుండగా, జనరల్ ముషారఫ్ తన టైని విప్పి, నాకు అందించారు. ‘‘దీన్ని మీరు ధరించాలని కోరుకుంటు న్నాను. దయచేసి దీన్ని మీకు ఇవ్వనివ్వండి’’ అన్నారు.
‘‘సర్, సర్, సర్’’, నేను నత్తులు పలికాను. ‘‘నేను చేసింది ఒక అమాయకపు వ్యాఖ్య. అంతకుమించి నేను మరేమీ సూచించలేదు’’ అన్నాను. ‘‘నాకు తెలుసు’’, ఆంటూ ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఇది మీ పట్ల నా సఖ్యతకు సంకేతం మాత్రమే’’ అన్నారు. ‘‘మీకు కృతజ్ఞతలు’’ అని నేను కదిలిపోయాను. తర్వాత, టైకి ఉన్న బంగారు పిన్నును, ఆయన చొక్కాకు వేలాడుతున్న బంగారు గొలుసును చూస్తూ నవ్వుతూ చెప్పాను. ‘‘నేను గోల్డ్ చెయిన్ గురించి ప్రశంసించి ఉండాల్సింది. అప్పుడు బహుశా దాన్ని కూడా మీరు నాకు ఇచ్చి ఉండేవారు.’’ అప్పుడు జనరల్ గట్టిగా నవ్వారు. ‘‘హా. ఔర్ అగర్ ఆప్ కో జూతీ పసంద్ ఆయీ హోతీ తో వో భీ మిల్ జాతీ (అవును. ఒకవేళ మీకు బూట్లు ఇష్టమైతే అవి కూడా దొరికేవి)’’ అంటూ హాస్య మాడారు. తదుపరి సంవత్సరాల్లో నేను జనరల్‌ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇస్లామాబాద్‌లోనే కాదు, లండన్, దుబాయిల్లో కూడా ఇంటర్వ్యూ చేశాను. వీటిల్లో 2009లో చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తుంది.
పదవీ విరమణ చేశాక, తన అధ్యక్షత గురించి, ప్రత్యేకించి కశ్మీర్‌పై తెర వెనుక జరిగిన చర్చల గురించి, జనరల్ నిజాయితీగా మాట్లాడడానికి ఇష్టపడతారా అని నేను ప్రశ్న రాసి పంపించాను. ‘‘డియర్ కరణ్’’ అంటూ ఆయన నాకు ఈమెయిల్లో సమాధాన మిచ్చారు. ‘‘ఇప్పుడు నేను ఇంటర్నెట్ వాడకం నేర్చుకుంటున్నాను. నా సాంకేతిక పరాక్రమపు మొదటి లబ్ధిదారు మీరే.’’ అది నిజమే అని నేను కచ్చితంగా చెప్పలేను. అది అడగడానికి సమయం దొరకలేదు. కానీ జవాబివ్వడంలో అదొక మంచి ముఖస్తుతి విధానం. ఆ ఈమెయిల్ జవాబును నేను ఫ్రేము కట్టించాను. అది ఇప్పుడు నా స్టడీ రూములో వేలాడుతోంది. తర్వాత కొన్ని వారాలకు లండన్‌లో ఆయనతో మరో ఇంటర్వ్యూకు అవకాశం ఏర్పడింది. అప్పుడు పాక్ జనరల్ ఓపెన్ నెక్ షర్టుతో పౌడర్ బ్లూ జాకెట్ ధరించి ఉన్నారు. రివీయెరా హోటల్లో సెలవులు గడపడానికి వచ్చిన హాలీవుడ్ నటుడిలా కనిపించారు. సూటు, టైతో కావాలనే అతిగా డ్రెస్ చేసుకున్నట్టు నాకు అనిపించింది.
‘‘మీరు బో టైని ఎందుకు కట్టుకోలేదు?’’ అని ఆయన అడిగారు.‘‘టై ఎలా కట్టుకోవాలో నాకు మీరు నేర్పుతారని అనుకున్నాను.’’ అధికారం కోల్పోయి, చట్టం ముందు పలాయితుడుగా ఉన్న ప్పుడు కూడా జనరల్ తన హాస్య ప్రవృత్తిని కోల్పోలేదు. ఆయన చనిపోయిన వార్త రాగానే ఎక్కువగా ఆయన రాజకీ యాలపై దృష్టి పడింది. అందుకే ఆయన వ్యక్తిత్వంలో ఇబ్బంది కరమైన వైరుధ్యాలు కనిపించాయి. అవి నిజం కూడా. అదే సమయంలో ఆయనలోని ఆహ్లాదకరమైన విషయాలను కూడా మర్చిపోకూడదు. అవి కూడా సత్యంలో భాగమే.
కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment