2001 జూలైలో భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, ప్రధాని వాజ్‌పేయీలతో ముషారఫ్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు.
ఢిల్లీలో పుట్టి...
పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్‌గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్‌గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు.
నియంత పాలన
పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్‌పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్‌లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు.
మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్‌పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment