'ముషార్రఫ్ ఆరోగ్యం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంది'
ఇస్తామాబాద్: దేశ ద్రోహం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆరోగ్య పరిస్థితి18 ఏళ్ల కుర్రాడి మాదిరిగా ఉందని ప్రభుత్వ న్యాయవాది అక్రమ్ సిఖ్ తెలిపారు. ఆయన దేశం దాటి వెళ్లి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనవరి 2వ తేదీ నుంచి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముషార్రఫ్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నారు. అతని ఆరోగ్యం ఆందోళనకరంగా ఏమీ లేదన్న విషయం తాజా మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్ధమవుతుందన్నారు. వైద్యానికి రోగులు సహకరించినా, సహకరించకపోయినా ఆస్పత్రి నుంచి బహిష్కరించరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దేశ ద్రోహం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ముషార్రఫ్ వైద్యం చేయించుకోవడానికి పాకిస్తాన్ దాటి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే పాకిస్తాన్ లో గుర్తింపు పొందిన చాలా ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ముషార్రఫ్ గుండె 18 ఏళ్ల యువకుడికి ఎలా ఉంటుందో అదే తరహాలో పని చేస్తుందని సిఖ్ తెలిపారు. కాగా, ముషార్రఫ్ ఆరోగ్యం అతని తరుపు న్యాయవాది అహ్మద్ రాజా కాసూరి ఆందోళన వ్యక్తం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని, విశ్రాంతి తీసుకోవడానికి సమయం కావాలన్నారు. దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన వాదనలు వినిపించడానికి మరింత గడువు ఇవ్వాల్సిందిగా ముషార్రఫ్ కోర్టు అనుమతి తప్పక కోరతారన్నారు.