![Former Pakistan President Pervez Musharraf Passes Away - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/5/pakistan.jpg.webp?itok=XKW5fKpy)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు ఆ దేశ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు.
కాగా ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపబడ్డాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2019లో పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. కానీ తరువాత 2020లో అతని మరణశిక్షను నిలిపివేస్తూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది.
గత 2018 నుంచి ముషారఫ్ ప్రాణాంతక వ్యాధి అమిలోయిడోసిస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని అమెరికన్ హస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. 2016 నుంచి ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నారు. గత జూన్‌లో అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్యం కారణంగా మూడు వారాల క్రితం మాజీ ఆర్మీ చీఫ్‌ను ఆసుపత్రిలో చేర్చామని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోలుకోవడం సాధ్యం కావడం లేదని, అతని అవయవాలు పనిచేయని దశలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ ట్వీట్ చేశారు. అయితే సుదీర్ఘ కాలంగా ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆదివారం(జనవరి 5) మరణించారు.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ నేత మోదీనే
Comments
Please login to add a commentAdd a comment