బెనజీర్‌ను చంపిందెవరు..?
‘‘నేను పాక్‌కు వెళ్లాలనుకుంటున్నా..’’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భుట్టో. ఆమె సన్నిహితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? ఈ పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం అవసరమా..’ కొందరు ధైర్యం చేసి గొంతు సవరించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి, ‘మీరు వెళ్లకూడదంతే..’ అంటూ అడ్డుతగిలారు. కానీ, బెనజీర్ భుట్టో మొండిఘటం. ఎవరి మాటా వినలేదు. చివరకు నిఘా వర్గాల మాట కూడా..!
2007 అక్టోబర్ 18.. బెనజీర్ భుట్టో పాక్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఎవరెన్ని చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదు. ఒకటా రెండా.. ఎనిమిదేళ్లు! దేశానికి దూరంగా.. ఎవరో విసిరేస్తే ఎగిరిపడినట్టు, విదేశాల్లో పడింది. దుబాయ్, బ్రిటన్లలో భారంగా కాలం వెళ్లదీసింది. స్వదేశాన్ని చూడాలని, పాక్ ప్రజల జేజేలు అందుకోవాలనీ ఆమెకూ ఆత్రంగానే ఉండేది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పాక్‌ను ముషారఫ్ ఏలుతున్నాడు. అసలే సైనికాధ్యక్షుడు, ఆపై నియంత.. తలచుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే అన్ని రోజులూ అజ్ఞాతంలో గడిపింది. ఇక, ఉపేక్షించి లాభం లేదు. పాక్‌కు ఎలాగైనా వెళ్లాల్సిందే. నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాల్సిందే. భయపడితే కుదరదు. అయినా, రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన తాను భయపడటమా..? నెవర్!
కొన్ని గంటల వ్యవధిలోనే భుట్టో విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బయట వేల సంఖ్యలో మద్దతుదారులు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ మానవ హారంలా ఏర్పడ్డారు. వారి మధ్యలోంచి బెనజీర్ భుట్టో ర్యాలీ. ఎనిమిదేళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న ఆమె ముక్కు పుటాలకు కమ్మని మట్టివాసన తాకిందో లేదో గానీ, క్షణాల వ్యవధిలోనే బాంబుల వాసన చుట్టేసింది. ర్యాలీలో రెండు బాంబులు పేలి భారీ విధ్వంసం జరిగింది. భుట్టో ఎలాగో ప్రాణాలతో బయటపడింది. కానీ, 139 మంది మరణించారు. 450 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ స్థాయి ఘన స్వాగతాన్ని భుట్టో ఊహించలేదు. అప్పుడు గుర్తొచ్చాయి అమెకు సహచరుల హెచ్చరికలు!
వెంటనే దేశాధ్యక్షుడు ముషారఫ్‌కు లేఖ రాసింది. తనకు, తన భర్త అసిఫ్ అలీ జర్దారీకి భద్రత పెంచమంది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, బాంబులను నియంత్రించే జామర్లు, ప్రైవేటు గార్డులు, నాలుగు పోలీసు వాహనాలు.. ఇలా ఏవేవో కోరింది. ముగ్గురు అమెరికన్ సెనేటర్లు కూడా ఇదే విషయమై ముషారఫ్‌కు లేఖలు రాశారు. అయితే, అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. భుట్టోకు మెల్లమెల్లగా పరిస్థితి అర్థమైంది. ‘ఇలాగే అయితే కష్టం.. తన ప్రాణాలు ఎన్నో రోజులు నిలవవు..’ అనుకుంది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏకు, బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన స్కాట్‌లాండ్ యార్డ్‌కు, ఇజ్రాయెల్‌లోని మొసాద్‌లకు లేఖలు రాసింది. తన భద్రత కోసం అభ్యర్థించింది. అయితే, పాక్‌తో దౌత్య సంబంధాల దృష్ట్యా ఈ దేశాల నుంచీ ఆమెకు స్పందన కరవైంది. చిట్టచివరగా అమెరికా, బ్రిటన్లలోని అత్యుత్తమ ప్రైవేట్ ఏజెన్సీలైన ‘బ్లాక్‌వాటర్’, ‘ఆర్మర్ గ్రూప్’లను తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఈ రెండు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. కానీ, పాక్ ప్రభుత్వం ఈ సంస్థలకు వీసా నిరాకరించింది. విదేశీ శక్తులను దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది.
దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే జనవరిలో జరగబోయే ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టింది భుట్టో. పార్టీ మేనిఫెస్టో రూపొందించి, జనాల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా జనమే జనం! దీనికితోడు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఆమెకు నిఘా విషయంలో రహస్యంగా సహాయం చేస్తానని మాటిచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత దూకుడు పెంచింది భుట్టో.
2007, డిసెంబర్ 27న రావల్పిండిలో ఓ ర్యాలీ ఏర్పాటు చేసింది. ర్యాలీ విజయవంతంగా ముగిశాక, తన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనంలోకి చేరుకుంది. అయినా, చుట్టూ జనమే! ఈలోగా కారు లోపలి వ్యక్తులు కొందరు.. సన్ రూఫ్‌ను తెరచి అభిమానులకు మరోసారి అభివాదం చేయాలంటూ సలహాలిచ్చారు. భుట్టో కూడా అదే చేసింది. సన్ రూఫ్ నుంచి బయటకు తల పెట్టి, ప్రజలకు అభివాదాలు చేసింది. అంతే.. కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఘోరం జరిగిపోయింది.
ఎవరు కాల్చారో.. ఏ వైపు నుంచి కాల్చారో కానీ.. భుట్టో తలలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా కారులోకి కూలబడిపోయింది భుట్టో. ఇది జరిగిన మరుక్షణమే శక్తిమంతమైన బాంబు ఒకటి పేలింది. అంతే.. ఆ దెబ్బకు పరిసరాలన్నీ అదిరిపోయాయి. అభిమానులు రక్తపు ముద్దలయ్యారు. కాసేపటికి తేరుకున్న కొందరు భుట్టోను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 6.16 నిమిషాలకు భుట్టో మరణవార్తను ప్రపంచం వినాల్సివచ్చింది.
ముషారఫ్ ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య ధోరణి వల్లే భుట్టో మరణించిందని కొందరన్నారు. ముషారఫ్ ఈ హత్య చేయించాడన్నారు. మరి కొందరేమో.. ఆమె భర్త జర్దారీని సైతం అనుమానించారు. ఇంకొందరు అల్ ఖైదా పనేనన్నారు. ఇలా ఎవరికి వారు ఏదేదో చెప్పుకొచ్చారు. చివరకు నిజాన్ని మాత్రం సమాధి చేశారు. భుట్టోను చంపిందెవరో ఆ ‘అల్లా’కే తెలియాలి!