మారుతున్న ‘శాంతి’ సమీకరణలు
మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆయనతో రహస్య సమాలోచన సాగించారు.
పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ విశ్లేషకులందరి అంచనాలను తలకిందులు చేశారు. 1999లో నవాజ్ ప్రభుత్వాన్ని కూలదోసిన మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌పై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి యత్నించకపోవచ్చని అంతా ఊహాగానాలు చేశారు. ముషార్రఫ్‌ను ఏదో ఒక విధంగా దేశం విడిచిపోయేలా చేయడమే నవాజ్‌కు, పాక్ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమని సూచించారు.
పాక్ చరిత్రలో మొదటిసారిగా ఒక మాజీ జనరల్‌పై పౌర ప్రభుత్వం క్రిమినల్ నేరారోపణలను చేయడం, విచారించడం సైనిక వ్యవస్థకు మింగుడు పడదని అంచనా వేశారు. ముషార్రఫ్‌ను అవమానించడానికి యత్నిస్తే సహించేదిలేదని ఆయన పాక్ గడ్డపై కాలుపెట్టినప్పుడే మాజీ ఆర్మీ చీఫ్‌లు ప్రకటించారు. అది నిజానికి ఆర్మీ చీఫ్ అష్ఫాక్ కయానీ హెచ్చరికేనని అందరికీ తెలిసిందే. అయినా నవాజ్ ముషార్రఫ్‌పై మరణశిక్ష విధించదగిన దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలను ఒక్కటొక్కటిగా చేయిస్తూ వస్తున్నారు.
తాజాగా ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యానేరం ఆరోపణను మోపారు. కీలక రాజకీయ పాత్రధారిగా మారిన పాక్ న్యాయవ్యవస్థకు కూడా ముషార్రఫ్ అంటే కంటగింపే. కాబట్టి ముషార్రఫ్ తనకు తగినంత భద్రత కల్పించడం లేదని బెనజీర్ ఒక పాత్రికేయునికి రాసిన లేఖ ఒక్కదాని ఆధారంతోనే కోర్టు కేసు విచారణకు సిద్ధపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా నవాజ్ భారత్‌తో సత్సంబంధాలను కోరుతున్నారు. 1999లో సరిగ్గా అందుకే ముషార్రఫ్ ఆయనపై ఆగ్రహించారు. కయానీకి ఈ పరిణామా లు మింగుడుపడతాయా? అందుకే పాక్ చరి త్రలో నాలుగో సైనిక తిరుగుబాటుకు తెరలేస్తున్నదేమోనని భయపడుతున్నారు.
సరిహద్దుల్లోని ఇటీవలి ఘర్షణలు పాక్ సైన్యం ప్రేరేపిస్తున్నవేనని, నవాజ్ మాత్రం భారత్‌తో మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారని తరచుగా వినవస్తోంది. అయితే మే నెలలో అఫ్ఘాన్ అధ్యక్షుడు మన దేశ పర్యటనకు రావడానికి ముందు నుంచి పాక్ సైన్యం ట్యాంకు లు, భారీ శతఘు్నలతో అఫ్ఘానిస్థాన్‌పై కాల్పు లు సాగిస్తోంది. అఫ్ఘాన్‌లోని హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో తప్ప అన్ని తాలిబన్, జిహాదీ గ్రూపులతోనూ పాక్ సైన్యానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే పాక్ అఫ్ఘాన్‌లో కీలక పాత్రధారి.
అమెరికా సైతం ఈ ఏడాది మొదటి నుంచి కర్జాయ్‌ను వదిలి, కయానీపై ఆధారపడుతోంది. కయానీ సహాయంతోనే రియాద్‌లో తాలిబన్లతో శాంతి చర్చలకు సన్నాహా లు చేస్తోంది. కాగా, రేపటి అఫ్ఘాన్‌లో భారత్ ప్రముఖ పాత్ర నిర్వహించనున్నదనే భ్రమలో మన దౌత్యనీతి బతుకుతోంది. అందుకే మన ప్రభుత్వం అఫ్ఘాన్‌లో రోడ్లు, ఆస్పత్రుల వంటి మౌలిక నిర్మాణాలపై 200 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. అఫ్ఘాన్ పోలీసు బలగాలకు శిక్షణను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదని మీడియా కథనం.
అయితే మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆయనతో రహస్య సమాలోచనలను సైతం సాగిం చారు. కర్జాయ్ భారీ శతఘు్నలు, యుద్ధ విమానాలు తదితర ఆయుధ సామాగ్రిని కోరారు. అవి పాక్ సరిహద్దులలో మోహరించడానికేనన్నది స్పష్టమే. అయినా గుర్తించలేని గుడ్డితనం కయానీకి లేదు. అఫ్ఘాన్-భారత్ సైనిక బంధమంటే పాక్‌ను చుట్టుముట్టడమేనని పాక్ సైన్యం భావిస్తున్నది. మన సరి హద్దుల్లోని తుపాకుల మోతకు, అఫ్ఘాన్ సరి హద్దుల్లోని శతఘు్నల ఘోషకు కారణం ఒక్కటే.
‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ కోసం అమెరికా పాక్‌కు అందిస్తున్న భారీ ఆయుధ, ఆర్థిక సహాయాన్ని సైన్యం దారిమళ్లించి భార త వ్యతిరేక జిహాదీ ముఠాలకు చేరవేస్తోందనేది 2010లో రచ్చకెక్కింది. ఆ తదుపరి అమెరికా పాక్‌కు అందించే సైనిక సహాయం దారి మళ్లకుండా ఆయుధాలు, నిధులు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి అవసరమైనవి మాత్రమేనని ధృవీకరించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. నామమాత్రమైన ఆ ధృవీకరణను సైతం అమెరికా ఫిబ్రవరిలో కయానీ కోరిక మేరకు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తేసింది. అమెరికా, కయానీల మధ్య కుదిరిన సయోధ్యను గుర్తించకుండానే మన విదేశాంగశాఖ అఫ్ఘాన్, పాక్ విధానాలను రూపొందించుకుంటోంది.
అఫ్ఘాన్ యుద్ధం ప్రారంభంలో ముషార్రప్ అమెరికాకు ఎంతటి కీలక మిత్రుడో నేడు కయానీకూడా అంతే కీలక మిత్రుడు. అప్ఘాన్ యుద్ధం ముగింపు దశలో సైన్యం నవాజ్ ‘ధిక్కారాన్ని’ సహించడమంటే వారి మధ్య ‘అంగీకారం’ కుదిరిందనే అర్థం కావాలి. ఆ ‘అంగీకారం’ ముషార్రఫ్‌ను ఉరికంబానికి ఎక్కించవచ్చేమోగానీ భారత్ పట్ల ‘మెతక’ వైఖరిని కనపబరచదనే అర్థం. అలాంటి ‘అంగీకారం’ ఏదీలేకుంటే మనం మరో సైనిక కుట్రను చూడాల్సిరావొచ్చు.
- పిళ్లా వెంకటేశ్వరరావు