భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు.
1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు.
ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు.